People No Longer: పాదయాత్రలతోనే జనం మెచ్చరు
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:36 AM
జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ పాదయాత్ర చేస్తానంటున్నారు. ఇది ఒక ప్రకటనలా లేదు. బెదిరింపులా ఉంది. ప్రజలు దారుణమైన సంఖ్యతో దించేసినా ఆయన ధోరణిలో మార్పులేదు. పాదయాత్రలతోనో, నెత్తిన చేతులూ, నుదుట ముద్దులూ...
జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ పాదయాత్ర చేస్తానంటున్నారు. ఇది ఒక ప్రకటనలా లేదు. బెదిరింపులా ఉంది. ప్రజలు దారుణమైన సంఖ్యతో దించేసినా ఆయన ధోరణిలో మార్పులేదు. పాదయాత్రలతోనో, నెత్తిన చేతులూ, నుదుట ముద్దులూ పెట్టడంతోనో, అధికారంలోకి రాగలమన్నది భ్రమే. అది గతం. వర్తమానం అలా లేదు. రాహుల్‌గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చేసిన పాదయాత్ర గానీ, పార్టీలను అధికారంలో కూర్చో పెట్టగలనని గొప్పగా చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ బిహార్ పాదయాత్ర గానీ, షర్మిల తెలంగాణ పాదయాత్ర గానీ ఎటువంటి ఫలితాలు ఇచ్చాయి? పాదయాత్రలకు ప్రజలు లొంగరు అన్నది స్పష్టం. పాదయాత్ర చేసే నాయకుడి మీద ఏర్పడే నమ్మకమే ముఖ్యం. జగన్‌రెడ్డి ఆ నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేయకుండా దబాయింపులకు దిగుతున్నారు.
ప్రజలు గతంలో ఆయనకు అధికారం ఇచ్చింది, కొత్త రాష్ట్రాన్ని భారతదేశ పటంలో కొంతలో కొంత అయినా ఆంధ్రులు సగర్వంగా చెప్పుకోగలిగేలా చేయగలరనే ఆశతోనే. కానీ ఆయనేం చేశారు... అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లో ప్రత్యర్థి పార్టీల నేత కుటుంబసభ్యులను, ముఖ్యంగా మహిళల్ని సమాజం ఛీత్కరించే భాషతో మాట్లాడించడం, ఆ మాటలకు పగలబడి నవ్వడం. పైగా ‘నా మనసు గెలుచుకున్నావు’ అని పొగడటం. ఇటువంటి రాజకీయ వాతావరణాన్ని దేశంలోనే ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. దీనిని ప్రోత్సహించిన ఆ పార్టీ అధ్యక్షుడిలో ప్రజలకు శాడిస్టు అవశేషాలే కనిపించాయి గానీ, సాత్విక ప్రజారంజక పాలన ఛాయలు కనిపించలేదు.
సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమచేస్తే చాలు, తానేమి చేసినా జనం పట్టించుకోరు అనే అభిప్రాయం తప్పు అని నిరూపణ అయినా, ఆయనలో మార్పు లేకపోవడమే విశేషం. మద్యం, ఇసుక, మట్టి, భూ ఆక్రమణలతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉన్నా, 175కి 175 సీట్లూ తనవే అనే మైకంలో ఆయన జనాన్ని తప్పుగా అంచనా వేశారు. ఇప్పుడూ అదే భ్రమలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీదకి తన జనాన్ని అబద్ధాలతో రెచ్చగొడుతున్నారు. తమ నాయకులందరినీ అన్యాయంగా జైలుకు పంపుతున్నారనీ, కక్ష సాధింపు అనీ మీడియా ముందు వగస్తున్నారు. అయినా.. ఇది ‘నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష’!
గతాన్ని మీరు మరచిపోవచ్చు గానీ, జనం మరవరు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో దిష్టిబొమ్మలు కాలిస్తే 307 కేసులు పెట్టించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసినా, ఏ రోజూ రోడ్డుపైకి రాని నాలాంటి వ్యక్తిని కూడా పదిరోజులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఒక రోజంతా స్టేషన్‌లో ఉంచారు. ఇలా రాష్ట్రమంతా కక్షల రాజకీయాలు నడిపి.. ఇప్పుడు శాంతిభద్రతలపై గగ్గోలు పెట్టడం ఎబ్బెట్టుగా లేదా? పైగా మీ నాయకులు పోలీస్ అధికారులపై దౌర్జన్యం చేయడం, అరెస్టు చేసుకోండి అంటూ మీది మీదికి వెళ్లడం.. ఇదేమి రాజకీయం? ఇది మీ వికృత చర్యలకి పరాకాష్ఠ కాదా?
అమాయకంగా మొహం పెట్టి అబద్ధాలు పండించినంత మాత్రాన ప్రజలు మోసపోరు. దబాయింపు, దౌర్జన్యాలతో, అరాచకాలతో ప్రజల్ని అదుపులో పెట్టుకుని పీఠాన్ని పదిలం చేసుకోగలం అనుకున్న బిహార్ లాంటి రాష్ట్రాలూ, ఆ నాయకులూ ఏమయ్యారో చూశాం. తల్లికి వందనం అంటూ పేద పిల్లల చదువులకు సాయం చేస్తుంటే.. రెండు వేలు విద్యామంత్రి లోకేశ్ ఖాతాలో పడుతోందంటూ నీచమైన ఆరోపణకి తెగించడం విడ్డూరం. జగన్ 2.0 అనీ, 2029లో సినిమా మరో లెవల్లో చూపిస్తాననీ, రప్పా రప్పా నరకుతానని అనడం మంచిదే అనీ.. ఏమిటిదంతా? గెలుపు ఓటములు సహజం. ఏడాది దాటినా ఓటమిని జీర్ణించుకోలేక కూటమిపై నిరంతరం రగిలిపోతూ, శాపనార్థాలు పెట్టడం ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి సరిపోయే తీరు కాదు. ఇది ఆయనలోని అపరిపక్వతని తెలియజేస్తోంది.
ప్రజల్ని భయభ్రాంతులను చేయడం కాదు, చేసిన తప్పేమిటో గ్రహించి దిద్దుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. జనం నెత్తిన చేతులు పెట్టడం కాదు, జనం ముందు చేతులు కట్టుకుని నిలబడగలగాలి. అహం అనే కిరీటం నెత్తిన ధరించినంత కాలం మీరెన్ని ఆరోపణలూ విమర్శలూ చేసినా జనం వినరు. నచ్చరు. మిమ్మల్ని మెచ్చరు. ముందు మీరు మారండి.. తర్వాత మీ అనుచరులు మారుతారు. రాజశేఖరరెడ్డిలోని పరిణతి, పరిపక్వతా మీలో కనిపించిననాడే జనం మీకు ఇంకో ఛాన్స్ ఇస్తారు. లేదంటే మీరు కాలగర్భంలో కలిసిపోతారు.
ఓ.వి. రమణ
టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి