Rama Chandramouli: బైటి యుద్ధాలు, లోపలి ఖాళీలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 06:06 AM
ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సమాజ గుండె చప్పుడును అక్షరంలో పలికిస్తున్నాడు రామా చంద్రమౌళి. హృదయపు గదిలోని సముద్రాన్ని తన చేతి వేళ్ళ కోసల నుండి అక్షర బిందువులుగా...
ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సమాజ గుండె చప్పుడును అక్షరంలో పలికిస్తున్నాడు రామా చంద్రమౌళి. హృదయపు గదిలోని సముద్రాన్ని తన చేతి వేళ్ళ కోసల నుండి అక్షర బిందువులుగా ఈ నేల మీదికి ప్రవహింపజేస్తున్నాడు. ఊపిరాడని ఉక్కపోతను, లోలోపలి ఎడతెగని వర్షాన్ని, వాడిన మల్లెల ఇగిరిపోయిన పరిమళాన్ని కథలుగా, కవిత్వంగా రాస్తూపోతున్నాడు.
రామా చంద్రమౌళి ఈ ఏభైఐదేళ్ళలో పద్దెనిమిది కవితా సంపుటాలు తెచ్చాడు. ‘‘జీవించడం ఒక వ్యూహం’’ అని, ‘‘జీవితపు పాఠ్యప్రణాళికను తెలు సుకోవడమే జీవితం’’ అనీ అంటాడు తన కవిత్వంలో. ‘‘చూస్తూ చూస్తుండగానే/ జీవితాలు సరళమౌతున్నట్టనిపిస్తూనే సంక్లిష్టమౌతున్నాయి/ మనకు స్పృహ లేకుండానే సగం నికర జీవితాన్ని మొబైల్స్, టీవీలు/ మింగేస్తున్నాయి.../ అన్నీ టచ్ స్క్రీన్లు.. టచ్ స్కిన్లే/ ఎక్కడ దేన్ని తాకితే ఏది తెరుచుకుంటుందో../ విప్పుకుంటుందో తెలియదు అన్నీ అతిస్వేచ్ఛలు../ అతి ప్రవర్తనలు.. అతి అతిక్రమణలు/ ఔటాఫ్ కాలింగ్ ఏరియాలు../ రాత్రుళ్ళను కాగితాల్లా కాల్చేస్తూ ఎక్కడో తనను తాను పొగొట్టుకుంటూ../ నిద్ర గుండెలపై రాలుతున్న సూదుల వాన’’ – అంటాడు. మనుషులు పక్క పక్కన్నే జీవిస్తూ.. మరణిస్తున్న విషాదం అతని కవిత్వం నిండా పరుచుకుంటుంది.
జీవితాన్ని వస్త్రగాలం పట్టి, లోతైన తాత్త్వికతతో రామా చంద్రమౌళి ఇప్పటికి దాకా 420 కథల్ని నేశాడు. కథల నిండా చిత్తడి చిత్తడి అయిన జీవితపు ‘లోపలి ఖాళీ’! సమాజ సంక్లిష్టతలను విశ్లేషిస్తూనే, మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించడం ఆయన కథల ప్రత్యేకత. మారుతున్న కాలంలో మనిషి విలువల పతనాన్ని చూసి ఆవేదన చెందుతాడు. బాధితుల పట్ల కరుణ, అణగారిన వర్గాల పట్ల సానుభూతి ఆయన రచనల్లో అంతర్లీనంగా ప్రవహించే మానవత్వానికి నిదర్శనం. సమాజం ఎంత యాంత్రికంగా మారినా, మనిషిలోని ‘ఆర్ద్రత’ చనిపోకూడదని ఆయన కథలు ప్రబోధిస్తాయి. అస్తిత్వవాదం (Existentialism) పట్ల ఆయనకు ఉన్న అవగాహన కథల్లోని పాత్రల చిత్రణలో కనిపిస్తుంది. భౌతిక ప్రపంచానికి, ఆత్మీయ ప్రపంచానికి మధ్య ఉన్న సన్నని గీతను ఆయన తాత్త్విక దృష్టితో విశ్లేషిస్తారు. ఈ తాత్త్వికత పాఠకుడిని ఆలోచనలో పడేసి, తనను తాను వెతుక్కునేలా చేస్తుంది.
ఆయన భాష సరళంగా ఉంటూనే గాఢత కలిగి ఉంటుంది. వరంగల్ ప్రాంత యాసను అత్యంత సహజంగా వాడతాడు. పాత్రల సంభాషణలు బలమైన ఆలోచనను మోసుకెళ్తాయి. మానవత్వపు విలువలను తాత్త్వికతతో మేళవించి, సైన్స్ కోణంలో విశ్లేషిస్తాడు. ఆధునిక కాలంలో మనిషి కోల్పోతున్న సహజత్వాన్ని గుర్తు చేస్తూ, రేపటి ప్రపంచం పట్ల ఒక హెచ్చరికను, అదే సమయంలో ఒక ఆశను ఆయన తన కథల ద్వారా కల్పిస్తాడు. ‘ఆత్మ అగ్ని.. అది నిన్ను దహిస్తుంది’, ‘నిర్వాణ’, ‘మోహవిమోహం’, ‘పిడికెడు పక్షి.. వినీలాకాశం’, ‘ఏమిటి అంటే ఏమీ లేదు’ లాంటి కథలు మనల్ని కుదిపేసి, వెంటాడుతాయి.
చంద్రమౌళి ఇప్పటిదాకా ముప్పయి ఆరు నవలలు రాశాడు. ప్రతి నవలలో ఒక అంతర్లీన తాత్త్విక ప్రశ్న ఉంటుంది. మనిషి తన ఉనికిని ఎలా కాపాడుకోవాలి? విలువల పతనాన్ని ఎలా అడ్డుకోవాలి? అనే అంశాలపై ఆయన పాత్రలు నిరంతరం మధనపడుతూ ఉంటాయి. ఈ తాత్త్విక చింతనే ఆయన నవలలకు ఒక గాంభీర్యాన్ని చేకూరుస్తుంది. మానవత్వం ఒక అంతిమ లక్ష్యంగా నిలుస్తుంది. ఆయన నవలల్లో ఒక మైలురాయిలాంటి నవల ‘కాలనాళిక’. గడిచిన 80ఏళ్ల తెలంగాణ చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవితమంతా ఈ నవలలో అక్షరీకృతమైంది. నిజాం పాలనలోని అణచివేత, రజాకార్ల ఆగడాలు, వాటిని ఎదిరించిన రైతాంగ పోరాటాన్ని చంద్రమౌళి అత్యంత ప్రామా ణికంగా చిత్రించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, నక్సల్బరీ ఉద్యమ ప్రభావం, విద్యావంతులైన యువతలో కలిగిన చైతన్యాన్ని ఈ నవలలో చూడవచ్చు. మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రాంతీయ అస్తిత్వం కోసం జరిగిన పోరాటం, ప్రస్తుత గ్లోబలైజేషన్ కాలంలో మనిషి విలువలు మారటాన్ని కూడా ఈ నవల స్పృశిస్తుంది. ఈ నవలలోనూ కథానాయకుడి ఆలోచనల్లో లేదా చర్చల్లో సైన్స్ అంశాలను చాలా సహజంగా చొప్పిస్తారు. ఉదాహరణకు, ఒక మనిషి ప్రవర్తనను కేవలం విధిగా చూడకుండా, మెదడులోని రసాయన మార్పులు లేదా పరిణామ క్రమంతో ముడిపెట్టి విశ్లేషించడం ఆయన శైలి. రామా చంద్రమౌళి తన 36కు పైగా నవలల ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక ‘‘సామాజిక–శాస్త్రీయ’’ రూపాన్ని ఇచ్చారు. ‘మొదటి చీమ’, ‘జాయపసేనాని’, ‘తొవ్వ’, ‘అతీతం’ అనే మరో నాలుగు నాటకాల్ని కూడా రాశారు. ‘జాయపసేనాని’ నాటకం జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా అవార్డు పొందింది. ఆయన సాహిత్యానికి తెలుగు నేల మీద ఉన్న ప్రతి అవార్డు లభించింది.
ఒకవైపు ఆర్ద్రమైన మానవత్వం, మరోవైపు లోతైన తాత్త్విక చింతన, ఇంకోవైపు నిర్మొహమాటమైన సాహిత్య విమర్శ ఈ మూడింటి కలయికే చంద్రమౌళి సాహిత్యం. భవిష్యత్తు తరాలకు తెలంగాణ మట్టి వాసనను, ఆధునికతతో కూడిన మేధస్సును అందించిన ఆయన రచనలు తెలుగు సాహితీ వనంలో ఎప్పటికీ వాడని పరిమళాలు.
(రామాచంద్రమౌళి ప్రతిష్టాత్మక ‘అజో–విభొ–కందాళం–2026’ విశిష్ట సాహితీమూర్తి పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా)
వెల్దండి శ్రీధర్
98669 77741
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..