Share News

హిందుత్వంపై కాంగ్రెస్‌కు ఎందుకంత ద్వేషం?

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:40 AM

కౌరవవంశం వినాశనానికి ధృతరాష్ట్ర, దుర్యోధనులు కారణమన్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ వినాశనానికి రాహుల్ గాంధీతోపాటు అతని సహచరులు కారణమవుతున్నారని అనిపిస్తోంది....

హిందుత్వంపై కాంగ్రెస్‌కు ఎందుకంత ద్వేషం?

కౌరవవంశం వినాశనానికి ధృతరాష్ట్ర, దుర్యోధనులు కారణమన్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ వినాశనానికి రాహుల్ గాంధీతోపాటు అతని సహచరులు కారణమవుతున్నారని అనిపిస్తోంది. రాహుల్, సోనియా మెప్పు పొందడానికా అన్నట్లుగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఇటీవల హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గంగలో మునిగితే పేదరికం పోతుందా అని విమర్శించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఇఫ్తార్ విందులిస్తే, పాస్టర్లూ మౌల్వీలకు జీతాలు ఇస్తే పేదరికం పోతుందా అని మల్లిఖార్జున ఖర్గే ఎందుకు ప్రశ్నించలేదు? ఇదేనా కాంగ్రెస్‌ చెప్పే సెక్యులరిజం?

దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు ఒకటవుతున్న తరుణంలో కూడా రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ హిందూ వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తున్నారు. హిందుత్వం గురించి మాట్లాడేవారంతా హింసను ప్రేరేపిస్తారని, ఈ హిందుత్వవాదులందరినీ తరిమికొట్టాలని, ఆరెస్సెస్‌ బీజేపీలను వ్యతిరేకించాలని చెబుతూ మైనార్టీల పేరుతో ముస్లింలను వెనకేసుకు వస్తున్నారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి ముస్లిం సంతుష్టీకరణ విధానాలే అనుసరిస్తున్నా రాహుల్‌గాంధీ, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ లాగా ఎప్పుడూ మాత్రం బహిరంగంగా హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు, దూషించలేదు. అందుకే ఇంతకాలం దాకా ఆ పార్టీ బతికి బట్టకట్టకలిగింది.


ఇటీవల రాహుల్‌గాంధీ తమ పార్టీ ఆరెస్సెస్‌–బీజేపీలతోపాటు భారత రాజ్య వ్యవస్థతో పోరాడుతున్నాం అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఒక రాజకీయ పార్టీగా ఇతర పార్టీలతో, సంస్థలతో పోరాడటంలో తప్పులేదు కానీ ఏకంగా రాజ్యవ్యవస్థతోనే పోరాడుతామనడం క్షమార్హం కాని నేరం. ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలన్నారో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు.

గతంలో కూడా పాకిస్థాన్ లోని ఉగ్రవాదులపై భారత సైనికులు ప్రాణాలకు తెగించి సర్జికల్ స్ట్రయిక్స్‌, ఎయిర్‌ స్ట్రయిక్స్‌ లాంటివి చేస్తే రాహుల్‌గాంధీ ‘వీటికి సాక్ష్యాలున్నాయా? వీడియోలు, ఫోటోలు తీశారా?’ అని ప్రశ్నించడంతో అంతవరకు ఈ స్ట్రయిక్స్‌తో బిక్కచచ్చిపోయిన పాకిస్థాన్‌కు బలం చేకూర్చి నట్లయింది. రాహుల్‌గాంధీ వేసిన ప్రశ్నలనే వేసి పాకిస్థాన్ మన సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అలాగే ఒకవైపు మన సైనికులు భారత సరిహద్దుల్లో డోక్లాం రక్షణ కోసం చైనాతో పోరాడుతుంటే చైనా రాయబారితో రాహుల్ రహస్యంగా సమావేశం కావడమేంటి? అంతేగాక భారత్‌కు బద్ధ వ్యతిరేకిగా భావించే జార్జ్ సోరెస్ లాంటి వారితో స్నేహం చేయడం, విదేశాలకు వెళ్ళినప్పుడల్లా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, భారత వ్యతిరేకులతో సమావేశమవడం ఎంతవరకు సమంజసం? భారత్ జోడో యాత్రలో కూడా పలువురు దేశ వ్యతిరేకులు, తీవ్రవాద గ్రూపుల నాయకులు పాల్గొనడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా మణిపూర్‌కు చెందిన ఒక తీవ్రవాద గ్రూపు నాయకుడు భారత్ జోడో యాత్రలో పాల్గొన్న చిత్రాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.


సెక్యులరిజం ముసుగులో హిందువులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. హిందువులంతా ఏకం కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుకున్న కొత్త అస్త్రం కుల గణన. రాహుల్‌గాంధీ ఇటీవల తామే రాజ్యాంగ పరిరక్షకులమంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన నిర్ణయాలు కోకొల్లలు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను స్వయంగా రాహుల్‌గాంధీ మీడియా ముందే చించేయడం ఎలా రాజ్యాంగ పరిరక్షణ అవుతుంది? ఎన్నోసార్లు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను ఉన్నపళంగా తీసేయడం ఎంతవరకు సమంజసం?

దేశంలోని హిందువులంతా చిరస్మరణీయంగా గుర్తుంచుకునే అయోధ్య రామమందిర నిర్మాణం, ప్రారంభోత్సవాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ న్యాయవాదులు వాదించినా సుప్రీం తీర్పుతో భవ్యమందిరాన్ని హిందువులు తమ స్వంత ఖర్చులతో నిర్మించుకుంటే కూడా సహించలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ మందిర ప్రారంభోత్సవానికి అందిన ఆహ్వానాన్ని సోనియా, రాహుల్‌గాంధీలు తిరస్కరించడమే కాకుండా కాంగ్రెస్‌ నాయకులు ఎవరు అయోధ్య వెళ్ళకూడదంటూ నిషేధం విధించడంతో స్వాభిమానమున్న కాంగ్రెస్‌ నాయకులు ఎందరో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కొందరు రాజీనామా కూడా చేశారు. ఇలా అడుగడుగునా హిందుత్వ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీని జాతీయవాదులు, హిందువులు ఎలా సమర్థిస్తూ ఓట్లు వేస్తారు? ఎన్నికలప్పుడు మాత్రమే హిందువుల మాదిరిగా రాహుల్, ప్రియాంకగాంధీలు గుళ్ళు, గోపురాలకు దండాలు పెడితే గ్రహించలేనంత అమాయకులా ప్రజలు? ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ తన తప్పులను తెలుసుకొని మసలుకోకపోతే కౌరవవంశంలాగానే కాలగర్భంలో కలిసిపోకతప్పదు.

శ్యామ్‌సుందర్ వరయోగి


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

For National News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 04:40 AM