NTR Memorial Trust: తలసేమియా రోగులకు పెన్నిధి
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:43 AM
తలసేమియా ఒక జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధి. భారతదేశంలో సుమారు మూడు కోట్ల 50 లక్షలకు పైగా పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసేమియా రోగులకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కీలకమైన...
తలసేమియా ఒక జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధి. భారతదేశంలో సుమారు మూడు కోట్ల 50 లక్షలకు పైగా పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసేమియా రోగులకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కీలకమైన సహాయాన్ని అందిస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా 25 బెడ్స్‌తో తలసేమియా కేర్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ వ్యాధి సంక్రమించిన రోగులకు సురక్షితమైన రక్తం, ఫిల్టర్స్, మందులను ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాధిగ్రస్త పిల్లలకు 21,234 యూనిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 60,975 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు NABH–ac– క్రెడిటెడ్, ISO 9000:2015–సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తోంది. రక్త భద్రత కోసం అధునాతన రోబోటిక్ పరీక్షను ఉపయోగిస్తోంది. HIV, హెపటైటిస్ B & C, మలేరియా వంటి వ్యాధుల కోసం స్క్రీనింగ్ చేస్తోంది. తలసేమియా బారిన పడిన వారికి సంవత్సరానికి ఒక బిడ్డకు అయ్యే ఖర్చు–వివరాలు పరిశీలిస్తే రక్త యూనిట్లకు రూ.51,000; ల్యూకో ఫిల్టర్‌కు రూ.26,000; మందులు రూ.84,000; విటమిన్ సప్లిమెంట్లు రూ.20,000; వైద్య పరీక్షలకు రూ.32,000; రవాణా, ఆహారం తదితరాలకు రూ. 37,000... వెరసి సంవత్సరానికి సుమారు రూ.2,50,000 ఖర్చవుతుంది.
ప్రతి తలసేమియా రోగికి సంవత్సరానికి 17 సార్లు రక్తమార్పిడి చేయాలి. ఈ పరిస్థితిని అధిగమించడానికి సాధారణ ప్రజలలో అవగాహన పెంచడం తప్పనిసరి. దేశ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా, ప్రజల దేవుడిగా గుర్తింపు పొందిన నందమూరి తారకరామారావు కుమార్తె నారా భువనేశ్వరి తన తండ్రి ఆశయాలను ఆచరించడమే కాక, వాటిని విస్తరిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే తత్వాన్ని అక్షర సత్యంగా నమ్మే భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నారు. ఈ ట్రస్ట్ వేలాది పేదలకు, విద్యార్థులకు, తలసేమియా రోగులకు, మహిళలకు, విపత్తు బాధితులకు ప్రాణవాయువుగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు సతీమణీగా మాత్రమే కాక, సామాజిక సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు భవనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా కేంద్రాలకు నిధులు సేకరించడానికి విజయవాడలో ‘యు–ఫోరియా’ మ్యూజికల్ నైట్, స్వచ్ఛంద రక్తదానాలను ప్రోత్సహిస్తోంది.
విశాఖపట్నంలో తలసేమియా రన్ వంటి అవగాహనా కార్యక్రమం ద్వారా నిధులు సేకరించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మరోసారి ఈ నెల 19న విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో తలసేమియాతో భాధపడుతున్న పిల్లల కోసం ఒక అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నది. తలసేమియా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా ప్లేట్‌లెట్లు, వైద్యం, మందులు అందిస్తూ, వైద్యశిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించాయి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ దేశంలోని అత్యాధునిక సౌకర్యాలతో నడుస్తున్న రక్తదాన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరి నిబద్ధత, నిస్వార్థ సేవ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు వ్యక్తిగత ప్రచారానికి సంబంధించినవి కావు. స్వార్థం లేని సేవే, శాశ్వత కీర్తిని అందిస్తుంది. నారా భువనేశ్వరి చేపట్టిన సేవా యజ్ఞం నిరంతరం కొనసాగాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం. – నీరుకొండ ప్రసాద్
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి