National Broadcasting Day: దశాబ్దాల నిరంతర శబ్ద కాంతులు
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:24 AM
ప్రతి ఒక్కరి సంక్షేమం, ప్రతి ఒక్కరి జీవన సౌఖ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ, సూర్యచంద్రులతో పోటీ పడుతూ జ్ఞాన, వినోద, సమాచారాల త్రివేణిగా వెలుగొందుతోంది ఆకాశవాణి. మాట లేనిది మనిషి లేడు. భావ వ్యక్తీకరణకు...
ప్రతి ఒక్కరి సంక్షేమం, ప్రతి ఒక్కరి జీవన సౌఖ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ, సూర్యచంద్రులతో పోటీ పడుతూ జ్ఞాన, వినోద, సమాచారాల త్రివేణిగా వెలుగొందుతోంది ఆకాశవాణి. మాట లేనిది మనిషి లేడు. భావ వ్యక్తీకరణకు, సమాచార పంపిణీకి, మానసికోల్లాసానికి మాటే వాహిక. మాటే మనిషికీ మనిషికీ మధ్య వారధి. తొంభై ఏళ్ళ పాటు అలాంటి వారధిగా, విశ్వసనీయతకు మారుపేరుగా పనిచేసింది ప్రసార భారతి. ప్రసారం తనకు తానుగా సులభంగా, సరళంగా, వైవిధ్యంగా, విస్తృతంగా ఆకాశవాణి ద్వారా అందుబాటులో ఉంది. తొంభై ఏళ్ల క్రితం ఆరంభమైన ఆకాశవాణి ప్రపంచ ప్రసార మాధ్యమాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఒక తరాన్ని తట్టిలేపిన రేడియో సిగ్నేచర్ ట్యూన్ వారి హృదయాలపై చేసిన సంతకం ఎంత గాఢమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వందేమాతరమంటూ పొద్దున్నే నిద్రలేపి, భక్తిరంజనితో ప్రశాంత ఆధ్యాత్మిక శబ్దాలయపు ద్వారాలు తెరుస్తుంది. హలం పట్టుకుని పొలానికి బయలుదేరే రైతు మెడలో శబ్ద పుష్పాల మాలగా అలంకృతమవుతుంది. మన వాడ నుంచి విశ్వమంతా తిప్పుకు వచ్చేవి ఆకాశవాణి వార్తావాహికలు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఒకవైపు, కరెంట్ అఫైర్స్, స్పాట్‌లైట్ వంటి ఆంగ్ల కార్యక్రమాలు, వార్తా వ్యాఖ్యలు, జిల్లా సమాచార లేఖలు, ఎఫ్.ఎమ్. రెయిన్‌బో న్యూస్ బులెటిన్‌లు, ప్రత్యేక వార్తా కథనాలు... ప్రతి రోజూ నిత్య సత్యాలుగా, శబ్ద సాక్ష్యాలుగా అందిస్తూ వస్తున్న వార్తా విభాగం ఇప్పుడు ‘న్యూస్ డివిజన్’గా సేవలు అందిస్తోంది. నాటకాలు, నాటికలు, రూపకాలు, ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, ప్రత్యక్ష ప్రసారాలతో... బాలబాలికలు, యువత, మహిళలు, కర్షకులు, కార్మికులు, వయోధికులు... ఇలా అన్ని వయో వర్గాలకు రేడియో ఒక కుటుంబ నేస్తంగా నిలిచింది.
లలిత, జానపద, శాస్త్రీయ సంగీత ప్రక్రియలను ప్రేమగా తన గాలి భుజాలపై మోస్తున్న పాటల పల్లకి రేడియో. తెలుగుతో పాటు అనేక ఇతర భాషల ప్రసారాలతో తెలుగు శ్రోతలను అలరిస్తున్న ఆకాశవాణి కేంద్రాలు ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది ఆకాశవాణి కేంద్రాలు వివిధ భాషల్లో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో శబ్ద కాంతులు పంచుతున్నాయి. వివిధ ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల జోరులో సైతం తనదైన శైలిలో తొమ్మిది దశాబ్దాలుగా సాగుతున్న రేడియో, నేటికీ ‘మొబైల్ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్’గా విశ్వాస వాహినై శ్రోతలను చేరుకుంటూనే ఉంది. 1927లో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ పేరిట బొంబాయిలో మొదలైన ఒక ప్రైవేటు కంపెనీ, ఆల్ ఇండియా రేడియోగా ప్రభుత్వాధీన సంస్థగా స్వర ప్రస్థానం ప్రారంభించింది. 1957 నుంచి వివిధ భారతిగా కూడా విలసిల్లుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ వినని వారుండరు. భారత ప్రధానమంత్రి మోదీ యావత్ దేశంలో మూలమూలలో జరుగుతున్న నిర్మాణాత్మక కార్యక్రమాలను ఉటంకిస్తూ, యువతను, మహిళలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, దేశ సమగ్రతను బలోపేతం చేయడానికి, మన దేశాన్ని ప్రపంచ వేదికలపై నిలపడానికి వారి ‘మన్ కీ బాత్’ ప్రసంగమాలికల ద్వారా నూతన స్ఫూర్తిని అందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ప్రసార సాధనాలలో రేడియో ముందుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. భాషను, యాసను కాపాడుతూ, సాహితీ పిపాసను పెంపొందించడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో ప్రభావవంతమైన సాధనం.
ప్రసారభారతి ఆర్కైవ్స్ విభాగం మహనీయుల రికార్డింగులను భద్రపరిచి మనకు అందిస్తున్నది. శాస్త్రీయ, జానపద, లలిత సంగీత, నాటక కళాకారులు ఆకాశవాణి గ్రేడింగ్‌నే ప్రామాణికంగా తీసుకుని రేడియో ద్వారా ఇతర ప్రసార మాధ్యమాలకు అనుసంధానంగా మారుతున్నారు. ఆకాశవాణి హైదరాబాద్, కడప, విజయవాడ, విశాఖ కేంద్రాలకు తోడుగా, తెలుగు గాలిని శబ్ద పరిమళాలతో నింపుతున్న స్థానిక తెలుగు రేడియో కేంద్రాలు ఆయా మట్టి పరిమళాలను వెదజల్లుతున్నాయి. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, అనంతపురం, తిరుపతి, కర్నూల్, మార్కాపురం... వంటి లోకల్ రేడియో స్టేషన్లు మొబైల్ యాప్ మాధ్యమం వలన ‘లోకల్ టు గ్లోబల్ వోకల్’గా వినిపిస్తున్నాయి. ప్రసారమే ప్రాణం అన్న నానుడిని సార్థకం చేస్తూ, ఆకాశవాణి ప్రస్థానం నిత్య నూతనంగా కొనసాగాలని ఆశిద్దాం!
మడిపల్లి దక్షిణామూర్తి
(నేడు జాతీయ ప్రసార దినోత్సవం)
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి