Share News

Village Development Telangana: కొత్త సర్పంచ్‌లూ... మీది పెద్ద బాధ్యత

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:22 AM

గ్రామాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను గ్రామ ప్రజలు కొత్త సర్పంచ్‌లకు ఇచ్చారు. ఇది చాలా గురుతరమైన కర్తవ్యం. సర్పంచ్‌ ఈ కర్తవ్యానికి తనకున్న అధికారాలకు తోడుగా సంకల్ప...

Village Development Telangana: కొత్త సర్పంచ్‌లూ... మీది పెద్ద బాధ్యత

గ్రామాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను గ్రామ ప్రజలు కొత్త సర్పంచ్‌లకు ఇచ్చారు. ఇది చాలా గురుతరమైన కర్తవ్యం. సర్పంచ్‌ ఈ కర్తవ్యానికి తనకున్న అధికారాలకు తోడుగా సంకల్ప బలాన్ని జోడిస్తే గ్రామ స్వరాజ్యం కలలు నెరవేరుతాయి. ఏ పనికైనా అధికారాలు మాత్రమే ఉంటే సరిపోవు. దాంతో పాటుగా ప్రజలందర్నీ ఐక్యం చేసి నడిపించే నాయకత్వం ఎంతో అవసరం. సర్పంచ్‌లు గ్రామానికి ఆమోదయోగ్యమైన పనులు చేస్తూనే ప్రభుత్వం చేసే మంచి పనులకు కూడా అండదండగా నిలబడాలి. గెలిచిన సర్పంచ్‌లలో అధికారపక్షం, ప్రతిపక్షం అన్న తేడాల్లేకుండా ప్రభుత్వం కూడా పెద్దమనసుతో గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరించాలి.

తెలంగాణ రాష్ట్రంలో 12,719 గ్రామరాజ్యాలను తీర్చిదిద్దే బాధ్యత గ్రామసర్పంచ్‌లకు వచ్చింది. కొత్త సర్పంచ్‌లు గ్రామరాజ్యాలను ఎట్లా పాలిస్తారో, గ్రామాల పునర్నిర్మాణంలో ఏ రకమైన పాత్ర పోషిస్తారోనని కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. కొత్తగా వచ్చినవారు చేసే కృషితో గ్రామాల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. గ్రామరాజ్యాల అభివృద్ధి దేశాభివృద్ధికి ముడిపడి ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు సరిపోతున్నాయా? అసలు గ్రామానికి నిధులను ఏ మేరకు కేటాయిస్తున్నారన్న విషయం కీలకమైనది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గ్రామాల పునర్నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది. ఈ పనిని మరింత ముందుకు తీసుకుపోయే బాధ్యతను సర్పంచ్‌ తమ భుజస్కందాలపై వేసుకోవాలి.

ఊరిని తీర్చిదిద్దుకునేటప్పుడు ఐదేండ్లలో చేయవలసిన పనులు దానికి సంబంధించిన ప్రణాళికలను ఏ గ్రామానికి ఆ గ్రామం రూపొందించుకోవాలి. గ్రామ సమావేశాలలో అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రణాళిక రచించుకోవాలి. గ్రామసభ ఇచ్చిన అభిప్రాయలను, సలహాలను, సూచనలను గ్రామపంచాయితీ సమావేశాల్లో సావధానంగా చర్చించుకుని అడుగులు వేయాలి. కొన్ని ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండవచ్చును. ఆర్థిక అంశాలు కానివీ ఉంటాయి. ఆర్థిక అంశాల విషయంలో ప్రభుత్వాల నుంచి వచ్చేవి ఏ మేరకు సరిపోతాయి? మిగిలిన నిధులలేమిని ఏ విధంగా సమకూర్చుకోవాలో మార్గాలను వెతుక్కోవాలి. గ్రామ పరిసరాలు ఆనుకొని ఏవైనా పరిశ్రమలు ఉంటే వాటి సాయాన్ని తీసుకోవచ్చును. సొంత ఊళ్ళపై ప్రేమ ఉన్నవాళ్ళ దాతృత్వాన్ని తట్టిలేపితే కొన్ని నిధులు వస్తాయి? ముందుగా ఆ ఊరు నుంచి ఎదిగివచ్చిన దేశ విదేశాలలో ఉన్నవారు ఆ ఊరు నుంచి వచ్చినవారు ఏ ఏ రంగాల్లో ఉన్నారో వారందరి పేర్లను రికార్డు చేయాలి. ఇందుకు గ్రామ కార్యదర్శి ఊర్లో చదువుకున్న యువత సాయం తీసుకోవచ్చును. కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు తమ ఊరు నుంచి బైటకు వెళ్లి స్థిరపడ్డ వారితో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకుని వాళ్ల సలహాలు, సూచనలే గాకుండా ఆర్థిక సాయాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.


నేటికినీ కులవృత్తులపై ఆధారపడి జీవించేవాళ్లు లక్షలాదిమంది ఉన్నారు. గ్రామస్థాయిలో నేటి సమాజ అవసరాలకు అవసరమైన పనిముట్లను చేసేవారి వృత్తులను ఆధునీకరించే పని పల్లెలు పునాదిగా జరగాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వృత్తికళల నైపుణ్యాన్ని బోధిస్తే అవి మంచి ఫలితాలను పొందవచ్చు. గ్రామీణ పరిశ్రమలకు చేతివృత్తుల సమూహాలకు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారిని నిలబెట్టే పనిని చేపట్టాలి. కింది కులాల వారికి సాయం చేస్తూ వారిని సొంతకాళ్లపై నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అనేక పథకాలను తెచ్చాయి. అనేక రాయితీలను ఇస్తాయి. వాటిపై గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామశాఖ కార్యదర్శి లోతుగా అధ్యయనం చేయాలి. జిల్లా పరిశ్రమల అధికారుల దగ్గరకు వెళ్లి తమ గ్రామ స్థితిగతులు, గ్రామంలో ఉన్న మానవ వనరులు తెలియజేసి గ్రామాభివృద్ధి ప్రాజెక్టులను తెప్పించే కృషి చేస్తే గ్రామాలకు ఆధునికత సమకూరుతుంది.

గ్రామంలో పార్టీల మధ్య, గుంపుల మధ్య, వర్గాల మధ్య ఉండే వైరుధ్యాలను సున్నితంగా జయించాలి. తాను సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర్నుంచి ఊరంతటినీ ఒకే దృష్టితో చూడాలి. తన ఊర్లో పంటలు, చెరువుల నుంచి వచ్చే జలసంపద పలు రాయితీలకు సంబంధించిన పనుల ద్వారా గ్రామ ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. ఊర్లో నీటి సంరక్షణ, వన సంరక్షణలో అందరినీ భాగస్వాములను చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాల పనితీరు సక్రమంగా అమలు జరిగే విధంగా చూసే కార్యక్షేత్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలి. గుడి, బడి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పశువుల ఆసుపత్రి సంరక్షణలు చూడాలి. గ్రామానికి సంబంధించిన అన్ని పనులను ఊరంతటి కళ్ళు చేసుకుని చూడాలి. గ్రామాన్ని గంజాయి నుంచి అన్ని విషసంస్కృతుల కాటు నుంచి సంరక్షించాలి. గ్రామాభివృద్ధిలో మహిళల, యువకుల పాత్రను పెంచాలి. అసాంఘిక శక్తులను ఎండగట్టాలి. ప్రజాస్వామ్య సంస్కృతిని పెంచి పోషించే కేంద్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలి.

జూలూరు గౌరీశంకర్‌

తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌

ఇవి కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 24 , 2025 | 02:22 AM