My First Poetry Collection: ఎంత గొట్టుగా రాస్తే అంత మంచి కవిత అనుకునేవాడ్ని
ABN , Publish Date - Oct 06 , 2025 | 06:06 AM
అది 1974వ సంవత్సరం. అప్పుడు నాకు 18ఏళ్ళ ప్రాయం. కామారెడ్డి కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరంలో ఉన్నాను. మాకు ఇంటర్, డిగ్రీల్లో గుండి వేంకటాచార్య, కసిరెడ్డి వెంకటరెడ్డి గార్లు తెలుగు...
అది 1974వ సంవత్సరం. అప్పుడు నాకు 18ఏళ్ళ ప్రాయం. కామారెడ్డి కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరంలో ఉన్నాను. మాకు ఇంటర్, డిగ్రీల్లో గుండి వేంకటాచార్య, కసిరెడ్డి వెంకటరెడ్డి గార్లు తెలుగు బోధించేవాళ్ళు. అదే ఏట నా మొదటి కవితా సంపుటి ‘మానవుడా’ వచ్చింది. ఇందులో పదహారు గేయాలున్నాయి. దేశభక్తి గేయాలు, అభ్యుదయ గీతాలు, ప్రణయ గీతాలు మొదలైనవి అన్నీ దాదాపుగా తిస్ర చతురస్ర గతుల్లోని గీతాలు. వీటిపై సి. నారాయణరెడ్డి, కనపర్తి, చొప్పకట్ల, వడ్డెపల్లి ప్రభావాలు పడ్డాయి. పైగా అప్పటికి దాదాపు ప్రబంధాలు నేనే ఆసక్తికరంగా చదువుకున్నాను కనుక వాటి ప్రభావమూ ఉంది. చిన్నప్పుడు బాగా పాటలు పాడేవాణ్ణి! కాబట్టి ఆ అసర్ కూడా ఉంది, ఇంతో కొంతో. నా కవిత్వం ప్రతి అక్షరం చూసిన గురువు కసిరెడ్డి గారే నా ‘మాన వుడా’ గేయ సంపుటికి ముందుమాట రాసారు. గుండి వారు, అవధానం రంగనాథ వాచస్పతి గారి ముందు మాటలూ ఉన్నాయి. పుస్తకాన్ని మా కళాశాలకే అంకితం చేసాను. ప్రిన్సిపాల్ ఎ. నరసింహారెడ్డిగారు ఆర్థిక సాయం చేసారు. అప్పట్లో కవర్ పేజీలు ఇంత అందంగా లేవు. అచ్చులో పేరు చూసుకుంటే చాలు అనుకునే సంతృప్తి. సిరిసిల్ల విష్ణు ప్రెస్‌లో అచ్చయింది. ఆవిష్కరణ కళాశాలలోనే. గిరిజా మనోహర్ బాబు సమీక్షించారు. మొదటి ప్రతి ప్రిన్సిపాల్ గారికే. నిజామాబాద్ సిహెచ్.మధు ఏదో పత్రికలో సమీక్ష చేసారు.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ‘మానవుడా’ అనే టైటిల్ గేయం నాలుగు సార్లు ప్రసారితమైంది. వింజమూరి సోదరీమణుల సంగీతం. నరసింహరాజు ‘మానవుడా మానవుడా -– మానవతను మరచినావు -దారుణ తిమిరాన మునిగి దానవతకు మరగినావు’ అంటూ పాడారు. ‘రాడాయె వెన్నెల రేడు -లేడాయె మిన్నుల నేడు -ఎదురు చూసి కన్ను దోయి అలసిపోయె కనవోయి నిరీక్షణ’ కవిత. అప్పుడు ఎంత గొట్టుగా రాస్తే అంత మంచి కవిత అనే ఎరుక నాది. ‘తృణ సస్య పర్ణస్థిత తుషారమ్ము స్వచ్ఛంద మౌక్తిక సమ ప్రకాశితమ్ము–తరుణీకంకణ కల నినాదమ్ము-గృహ బహిర్ద్వారముల కలయంపి చిమ్ము’ అని చిమ్ముతూ ఉండేవాణ్ణి! లంచాలను, అక్రమ సంబంధాలను, అత్యాచారాలను కూడా గేయాలతో బలంగా గాయపరచాను
‘సంతోషము సంత్రాసము -వర్షమ్మును గ్రీష్మమ్మును- వాత్సల్యము మాత్సర్యము -రసఝరులను విష కీలల- కారుణ్యము కాఠిన్యము -ఒక్కరూపుగా తలచెడు -సమదర్శిని సమదర్శిని’ అంటూ నా గురించి చెప్పుకున్నాను. మొదటి ముద్దలో లేని, మొదటి ముద్దులో లేని, మొదటి పొగ గుక్కలో లభించని, చివరి అదృష్టపు డ్రాప్స్‌లో దొరకని అనుభవం సృజనకారులు తమ సిరాచుక్కల్ని మొదటి పుస్తకంలో చూసుకున్నప్పుడు పొందే అనుభూతితో కలుగుతుంది. అది చెప్పశక్యం కాని ఆనందపారవశ్యం.
నలిమెల భాస్కర్
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు