Modi succession debate: మోదీ 75 భగవత్ మాటలో మర్మమేమిటి
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:17 AM
మా కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు బహిరంగంగా జరుగుతాయి. ఎటువంటి దాపరికం ఉండదు. భారతీయ జనతా పార్టీలో కలహాలు, కుమ్ములాటలు అన్నీ మూడోవాడి కంటికి కనిపించకుండా గుట్టుగా...
‘మా కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు బహిరంగంగా జరుగుతాయి. ఎటువంటి దాపరికం ఉండదు. భారతీయ జనతా పార్టీలో కలహాలు, కుమ్ములాటలు అన్నీ మూడోవాడి కంటికి కనిపించకుండా గుట్టుగా సంభవిస్తుంటాయి’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు వాపోయారు. బహిరంగ ఆరోపణలు, ప్రత్యారోపణలతో స్వీయ లక్ష్యాలు సాధించుకోలేకపోగా ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనాలు చేకూర్చడమనే ప్రవృత్తి కాంగ్రెస్ నేతలలో మెండుగా కనిపిస్తోంది. కేరళలో శశిథరూర్, పీసీసీ నాయకుల మధ్య వాగ్వాదాలు; కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల పరస్పర నిందలు అందుకు తాజా నిదర్శనాలు. కాంగ్రెస్‌కు విరుద్ధంగా బీజేపీ, సంఘ్ పరివార్‌లో అధికారానికి, ఆధిపత్యానికి అంతర్గత పోటీలు చాలా చాలా అరుదుగా మాత్రమే ప్రజల దృష్టికి వస్తాయి. కారణమేమిటి? చిన్నపాటి జగడం సైతం మీడియా దృష్టికి వెళ్లకుండా సంఘీయులు, బీజేపీ శ్రేణులు అత్యంత జాగ్రత్త వహించడమేనని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ పాలనా వ్యవహారాలలో పెత్తనానికై అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ మధ్య ఎడతెగని పోటీ, బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో నెలల తరబడి జాప్యానికి ఆరెస్సెస్, బీజేపీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం పతాక శీర్షికలుగా కాదు కదా వార్తలుగా కూడా కనిపించడం అరుదే. అంతర్గతంగా జరుగుతోన్న వాదోపవాదాల గురించి ఏమి మాట్లాడితే ఏమి ముప్పు వాటిల్లుతుందో అన్న భయాందోళనలు సంఘ్, బీజేపీ శ్రేణులను కట్టడి చేయడం పరిపాటి.
ప్రజా జీవితంలో ఉన్నవారు 75 ఏళ్ల వయస్సు రాగానే బాధ్యతల నుంచి వైదొలగాలని, పదవీ విరమణ చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ సలహా ఇవ్వడం పలువురిని విస్మయపరిచింది, ఎంతో మందిని దిగ్భ్రాంతిపరిచింది, కొంత మందికి కించిత్ అసంతృప్తి కలిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 75వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అదే నెలలో మోహన్ భగవత్ సైతం 75వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. సంఘ్ అధినేత వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు వెన్వెంటనే ఆనందోత్సాహాలతో ప్రతిస్పందించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారసుడు ఎవరో తక్షణమే నిర్ణయించేందుకు సంఘ్ నాయకత్వం ఆరాటపడుతోందని అనేందుకు భగవత్ వ్యాఖ్యలే తార్కాణమని విపక్షాలు గట్టిగా అభిప్రాయపడుతున్నాయి. ‘మోదీ తరువాత, ఎవరు?’ దశాబ్దాల క్రితం నాటి ‘నెహ్రూ తరువాత, ఎవరు?’ అన్న చర్చను జ్ఞాపకం చేస్తోంది. మోదీ తరువాత ఎవరు అన్నది చాలా ఆసక్తికరమైన విషయం, సందేహం లేదు. చర్చలు మొదలయ్యాయి, ముమ్మరమయ్యాయి. అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే వాద్‌నగర్ నుంచి ప్రభవించిన వ్యక్తి చాలా మంది ఆశిస్తున్నట్టుగా చాలా తొందరగా ఆ ప్రతిష్ఠాత్మక పదవి నుంచి వెళ్లిపోతారా? పోరు, కచ్చితంగా. 2024 సార్వత్రక ఎన్నికలపై నేను రాసిన పుస్తకంలో పేర్కొన్న ఒక ఆసక్తికరమైన ఉదంతాన్ని ఇక్కడ కూడా ప్రస్తావిస్తాను. ఆరు నూరైనా సరే అధికారంలో కొనసాగడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢంగా ఆకాంక్షిస్తారనేది ఆ ఉదంతం విశదం చేస్తుంది. నవ యువకుడిగా ఉన్నప్పుడు మోదీ అహ్మదాబాద్‌లో తన బాబాయి టీ స్టాల్‌లో కొంతకాలం పనిచేశారు. వాద్‌నగర్ నుంచి అహ్మదాబాద్‌కు రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులో వెళుతుండేవారు. అదే బస్సులో తిరిగి వాద్‌నగర్‌కు వెళ్లేవారు.. అహ్మదాబాద్ చేరగానే తిరిగి వెళ్లేందుకు సీటు రిజర్వేషన్‌కై తన బ్యాగ్‌ను బస్సులోనే వదిలివేసేవారట! ఈ కథ నుంచి తెలుసుకోవల్సిన విషయమేమిటి? మోదీ ఒకసారి ఒక కుర్చీలో కూర్చుంటే దాన్ని మరెవరూ ఆయన నుంచి లాక్కోలేరు! గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఈ ఆసక్తికరమైన కథను నాకు చెప్పారు. నిజం కావచ్చు, కాకపోవచ్చు.
అయితే దానిలో అంతర్లీనంగా ఉన్న సందేశమిది: అధికారం చెలాయించడం, పెత్తనం చేయడం మోదీ సహజ స్వభావం. తన భవిష్యత్తుపై తనకు పూర్తి నియంత్రణ లేకపోవడమనేది ఆయనకు సుతరామూ నచ్చని విషయం. అటువంటి నాయకులు పదవీ విరమణ చేయడం కాదు కదా అప్రధానంగా ఉండడానికి కూడా ఏ మాత్రం ఇష్టపడరు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు ఏ విషయం పైన అయినా ఆచితూచి మాట్లాడుతారు. మరి మోహన్ భగవత్ హఠాత్తుగా పదవీ విరమణకు 75 సంవత్సరాల వయస్సు గురించి ఎందుకు ప్రస్తావించారు? సంఘ్‌లో ఒక వర్గంవారు బీజేపీలో తరం మార్పును కోరుకుంటున్నారని అధికార నడవాలలో గుసగుసలు గట్టిగా విన్పిస్తున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్ నాయకత్వాల మధ్య గుంజాటన 2024 సార్వత్రక ఎన్నికల సందర్భంలో బహిర్గతమయింది. ఆరెస్సెస్ మద్దతు తప్పనిసరిగా అవసరమైన నాటి కాలం నుంచి బీజేపీ ఇప్పుడు బాగా ఎదిగిందని, తన వ్యవహారాలను తానే బాగా చక్కదిద్దుకోగల శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా సంతరించుకున్నదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. నడ్డా వ్యాఖ్యలు సంఘ్ పరివార్ నాయకత్వ శ్రేణుల్లో ఆందోళనను రేకెత్తించాయి. మోదీ ఆరాధన కేంద్రంగా పెంపొందిన రాజకీయ పరిస్థితుల పట్ల ఆరెస్సెస్ నాయకత్వంలో నెలకొన్న అసంతృప్తి, చిరాకును ఆ ఆందోళన ప్రతిబింబించింది. పెచ్చరిల్లిపోతున్న మోదీ వ్యక్తిపూజ పట్ల మోహన్ భగవత్ తన ఆవేదనను గత సెప్టెంబర్‌లో వెలువరించిన ఒక ఉపన్యాసంలో ఇలా వ్యక్తం చేశారు: ‘ప్రజాహిత కృషి ద్వారా ప్రతి ఒక్కరూ గౌరవాదరాలు పొందవచ్చు. అయితే మనం అటువంటి సమున్నత స్థితికి చేరామా లేదా అన్నది నిర్ణయించవలసింది ఇతరులే కాని మనకు మనమే కాదు. ఎవరైనా సరే తనకు తానుగా భగవంతుడనని ఎట్టి పరిస్థితులలోను ప్రకటించుకోకూడదు’. మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని నిశ్చితంగా చెప్పవచ్చు.
అయితే తమ రాజకీయ, భావజాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే మోదీ నాయకత్వం తప్పనిసరి అన్న విషయం ఆరెస్సెస్‌కు బాగా తెలుసు. 2024 సార్వత్రక ఎన్నికల అనంతరం సీఎస్‌డీఎస్ నిర్వహించిన ఒక సర్వేలో మోదీకి లభిస్తున్న ప్రజాదరణ బీజేపీకి ఉన్న ప్రజా మద్దతు కంటే అధికంగా ఉన్నదని వెల్లడయింది. ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ప్రధానమంత్రి నాయకత్వం కారణంగానే తాము బీజేపీకి ఓటు వేశామని చెప్పారు. మోదీ నాయకత్వం లేకపోతే బీజేపీ దుర్బలమైపోవడం ఖాయమని ఆ సర్వే స్పష్టం చేసింది. బ్రాండ్ హిందుత్వకు రాజకీయ చిహ్నం మోదీ. హిందుత్వ శ్రేణులకు ఆయన సర్వసేనాధిపతి. ప్రజలను హిందుత్వ వైపు ఆకర్షించే ప్రధానశక్తి ఆయనే. ఒక విధంగా మనం ‘మోదిత్వ’ యుగంలో ఉన్నాం. వ్యక్తిపూజ మెల్లమెల్లగా మతపరమైన మెజారిటేరియనిజంగా పరిణమిస్తున్న శకమిది. విస్తృత వ్యాప్తి, పెరిగిన పలుకుబడితో సంఘ్ పరివార్‌లో సైతం ప్రభావ శక్తుల నాయకత్వ ధోరణులలో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. తన వంద సంవత్సరాల మనుగడలో ఆరెస్సెస్, సంఘ్ పరివార్ భావజాల గంగోత్రిగా ఉన్నది సంఘ్ మాటే తుది మాట. ఇది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో రంగంలోకి వచ్చిన తరువాత, సంఘ్, బీజేపీల మధ్య సంబంధాలలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే బీజేపీ ఇప్పటికీ తనకు అవసరమైన మద్దతును అట్టడుగు స్థాయిలో సువ్యవస్థితంగా పాదుకుపోయిన సంఘ్ శాఖల నుంచే పొందుతున్నది. అయితే నాయకత్వ స్థాయిలో ఇప్పుడు బీజేపీకి ప్రధాన ఆలంబన ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే, సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ కాదు. భగవత్ సమానుల్లో ప్రథముడు మాత్రమే. వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం నాటికి మోదీ ప్రధానమంత్రిత్వ కాలం నాటికి మధ్య సంభవించిన మార్పు ఇది. నాడు ఇరవైకి పైగా పార్టీలు భాగస్వాములుగా ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న వాజపేయిని సంఘ్ ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై విమర్శిస్తుండేది. మోదీ సైతం ఆరెస్సెస్ ప్రచారక్ స్థాయి నుంచి జాతీయస్థాయి రాజకీయవేత్తగా పరిణమించిన అనితరసాధ్యుడు అనేది ఎవరూ విస్మరించరు, విస్మరించలేరు. వాజపేయి హయాంలో ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్‌గా ఉన్న కేఎస్ సుదర్శన్ బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శించేవారు.
వాజపేయి పాలనా నిర్ణయాలు తీసుకొంటున్న తీరుతెన్నులను ఆయన ఆక్షేపించేవారు. వాజపేయిని బహిరంగంగానే విమర్శించేవారు. సుదర్శన్ వ్యవహరిస్తున్న తీరుకు వాజపేయి చిరాకుపడేవారు. సహనం కోల్పోయిన వాజపేయి ఒకసారి, ‘నేను అలసిపోలేదు, పదవీ విరమణ చేయను’ అని స్పష్టంగా ప్రకటించారు. వాజపేయి పట్ల సుదర్శన్ వ్యవహరించినట్లుగా మోదీని తాను నేరుగా ఎదుర్కోలేనన్న విషయం మోహన్ భగవత్‌కు బాగా తెలుసు. ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ చేయగలిగిందల్లా ఒక లక్ష్మణ రేఖ గీయడమే. తద్వారా మోదీ–షా ద్వయం నిరంకుశాధికార నాయకత్వానికి పరిమితులు ఉన్నాయని స్పష్టం చేయడం మాత్రమే. 75 ఏళ్ల వయసు వచ్చినవారు పదవుల నుంచి నిష్క్రమించాలని ప్రకటించడం ఒక ప్రారంభ ఎత్తుగడ మాత్రమే. మొదటి ఎత్తుగడే ఆట కట్టిస్తుందా? అసాధ్యమన్న విషయం భగవత్‌కు తెలుసు. 75 ఏళ్ల వయసు పైబడిన ఎల్‌కే ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషీ లాంటి పార్టీ అతిరథ మహారథులను రంగం నుంచి తొలగించేందుకు మోదీ–షా నాయక ద్వయం 2015లో ‘మార్గదర్శక్ మండల్’ అనే భావనను ప్రవేశపెట్టడం ద్వారా ఆ ఇరువురు సీనియర్ నాయకులను పూర్తిగా విశ్రాంత జీవితంలోకి పంపించారు. అది పదేళ్ల కిందటి మాట. అయితే ప్రస్తుత దశలో ‘మార్గదర్శక్’ లాంటి పాత్రకు పరిమితమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బలవంతం చేయలేమన్న యథార్థాన్ని ఆరెస్సెస్ గ్రహించింది. మోదీ అనంతర బీజేపీకి యువ నాయకత్వాన్ని సమకూర్చేందుకు మరింత సర్వ జనామోద మార్గాన్ని సృష్టించాలని సంఘ్ అభిలషిస్తోంది. ‘కౌన్ బనేగా జీజేపీ ప్రెసిడెంట్’ అన్న క్లిష్టమైన ప్రశ్న ఇప్పుడు అటు సంఘ్‌కు ఇటు బీజేపీకి చిరాకు కలిగిస్తోంది. ఈ ప్రశ్నకు లభించే సమాధానం– ఆధిపత్యానికి చాలా గుట్టుగా జరుగుతున్న అంతర్గత పోరులో సానుకూలతలు ఎవరికి ఉన్నాయనేది స్పష్టం చేస్తుంది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి