Hindu Marriage Act: బంధమా బతుకా దాంపత్యంలో ఏది ముఖ్యం
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:00 AM
ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పు హిందూ మహిళలకు భారత రాజ్యాంగ నీతి పూర్తిగా వర్తించే స్థితి ఇంకా ఏర్పడలేదని చాటుతున్నది. వివాహబంధంలో ఉండగా భర్త నుంచి...
ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పు హిందూ మహిళలకు భారత రాజ్యాంగ నీతి పూర్తిగా వర్తించే స్థితి ఇంకా ఏర్పడలేదని చాటుతున్నది. వివాహబంధంలో ఉండగా భర్త నుంచి విడిపోయి వేరొక పురుషునితో సహజీవనం చేస్తున్న మహిళకు ఆ మాజీ భర్త నుంచి, అతడి తరపు పోలీసు జోక్యం నుంచి రక్షణ కల్పించడానికి తిరస్కరిస్తూ నవంబర్ 15న ప్రయాగ్‌రాజ్ హైకోర్టు తీర్పు చెప్పింది. పురుషాధిక్య ఆధిపత్య భావజాల స్ఫూర్తితో రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించడం సాధ్యం కాదని ఈ తీర్పు అర్థం. భర్తల దుర్మార్గం నుంచి రక్షణ కోసం, వైవాహిక ‘జైలు’ నుంచి తప్పించుకొని పారిపోయేవారిని మెడపట్టుకొని తిరిగి ఆ జైలుకే పంపించడం మానవీయమా?
‘‘వర్గానికి వర్గానికి మధ్య, స్త్రీ పురుషుల మధ్య (జెండర్ల మధ్య) అసమానత హిందూ సమాజం ఆత్మ. దానిని విడిచిపెట్టి ఆర్థిక సమస్యలకు సంబంధించిన చట్టాలు చేసుకొంటూపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. పేడకుప్ప పైన మేడ కట్టడమే,’’ అని అంబేడ్కర్ తన హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్ తిరస్కరించినప్పుడు మంత్రి పదవి నుంచి తప్పుకొంటూ సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మహిళను విముక్తం చేయడమన్న తన లక్ష్యం నెరవేరనందుకు నిరసనగానే అంబేడ్కర్ రాజీనామా చేశారు.
సంప్రదాయ హిందూ సమాజంలో మహిళది రెండవ స్థాయి పౌరసత్వమే. దాని నిర్మాణం ప్రకారం ఆమె బతుకు ఆశయం పురుషుడి అడుగులకు మడుగులొత్తడమే. మన దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న శక్తుల గురువైన ఆరెస్సెస్ సంస్థ అధినేత మోహన్ భగవత్ చెప్పిన ధర్మ సూత్రమూ ఇదే. భర్తకు సేవ చేయడమే భార్య పని అని 2013 జనవరిలో ఆయన స్పష్టంగా చెప్పారు. పురుషునితో ఆమెకు గల సామాజిక ఒప్పందం ప్రకారం ఆమె ఇంటి పనులకి పరిమితం కావాలి. పురుషుడు బయటి బాధ్యతలు చూసుకుంటూ ఉండాలి. ఇలా ఇంటి ఇంతిగా ఆమె అతడిని సంతృప్తిపరచడంలో విఫలమైన వెంటనే ఆమె పోషణ బాధ్యత నుంచి అతడు తప్పుకోవచ్చని, అక్కడితో భార్య భర్తల మధ్య సామాజిక కాంట్రాక్టు ముగిసిపోతుందని భగవత్ అభిప్రాయపడ్డారు. ఆడవారిపై లైంగిక అత్యాచారాలు దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో అరుదుగాను, పట్టణ ప్రాంతాలలో తరచుగానూ సంభవిస్తున్నాయని ఆయన అంతకు ముందు అన్నారు. అంటే సంప్రదాయ సమాజం గట్టిగా వేళ్ళూనుకుని ఉన్న గ్రామాల్లోనే మహిళ సురక్షితంగా బతుకుతున్నదని, ఆధునిక పురోగామి పట్టణ సమాజంలోనే ఆమెకు భద్రత కరువైందని ఆయన నొక్కి వక్కాణించారన్నమాట. పురాతన హిందూ సమాజం ఈ విలువలనే ఇప్పటికీ పాటిస్తున్నది. హిందూ వివాహచట్టంలోని 9వ సెక్షన్ ఈ పునాదుల పైనే నిర్మితమైంది.
భార్య, భర్త విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు దాంపత్య హక్కుల పునరుద్ధరణను కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశాన్ని హిందూ వివాహ చట్టంలోని 9వ సెక్షన్ ఉభయులకూ కల్పిస్తున్నది. ఆయా పరిస్థితులను పరిశీలించి కోర్టు ఆ హక్కును పునరుద్ధరించవచ్చునని పేర్కొంటున్నది. వైవాహిక అక్రమ వర్తనకు పాల్పడి భాగస్వామికి దూరంగా బతుకుతుంటే అటువంటి భార్య లేదా భర్తపై తనకుగల లైంగికత సహా సంపూర్ణ దాంపత్య హక్కును తిరిగి కల్పించాలని కోరుతూ జిల్లా కోర్టుకు వెళ్లే హక్కును 9వ సెక్షన్ కల్పిస్తున్నది. ఇది నిజానికి భార్యా భర్తా సమానులన్న అభిప్రాయం నుంచి ఉత్పనమైనది. కానీ వాస్తవంలో ఇప్పటికీ భర్తది పైచేయి, భార్యది కింది చేయిగానే ఉన్నది. భర్తతో బాటు అతడి తల్లి, తండ్రి, సోదరులు, ఆడపడుచులు కూడా ఆమెపై పెత్తనాన్ని, హింసాయుతమైన అణచివేతను అమలు చేస్తున్నారు. అందుచేత భార్య తనకు దూరమైన తన భర్తను తిరిగి తన దగ్గరకు చేర్చుకొనేలా దాంపత్య హక్కు పునరుద్ధరణను అర్ధించడానికి, అదే పనిని భర్త స్థానంలోని వ్యక్తి చేయడానికి చాలా తేడా ఉంది.
రాజ్యాంగం హామీ ఇస్తున్న వ్యక్తిగత, జీవన స్వేచ్ఛలు తిరుగులేనివి కావని, విడాకులు తీసుకోనందున ఆమెపై తన మాజీ భర్తకు ఇంకా హక్కు ఉంటుందని అలహాబాద్ తీర్పు స్పష్టం చేసింది. మహిళ తాను కోరుకొన్నట్టు వేరొకరితో ఉండాలీ అనుకొంటే భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ఆ మహిళకు దిక్కు చూపింది. హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ మహిళకు శాపం వంటిదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎ.చౌదరి 1983 జూలైలో చలన చిత్ర నటి సరిత, వెంకటసుబ్బయ్య కేసులో తీర్పు ఇచ్చారు. ఈ సెక్షన్‌ను రద్దు చేస్తూ, ఇది జంటల వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాస్తున్నదని, వివాహ బంధాన్ని కాపాడే నెపంతో పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నదని జస్టిస్ చౌదరి తన తీర్పులో స్పష్టం చేశారు. అయితే జస్టిస్ చౌదరి విప్లవాత్మక తీర్పును సుప్రీంకోర్టు ఆ తర్వాత రద్దు చేసింది. అప్పటి నుంచి వివిధ కోర్టులు వివాహిత మహిళలకు విషం వంటి ఈ 9వ సెక్షన్‌ను ఆమె చేత బలవంతంగా తాగిస్తున్నాయి.
పెళ్లి అనే వ్యవస్థను కాపాడాలని, భార్యాభర్తలు ఆ బంధానికి జీవిత కాలమంతా కట్టుబడి ఉండాలని 9వ సెక్షన్ కోరుతున్నది. కాని మహిళ అక్షరాస్యతలోనే కాదు విద్యాబుద్ధులు, ఆధునిక నిపుణతలలోనూ పురుషునితో సమానమైన స్థాయికి చేరుకొంటున్న వర్తమానంలో ఇష్టంలేని మగవానితో కలిసి కాపురం చేయవలసిన అగత్యాన్ని ఆమె ధైర్యంగా ఎదిరిస్తోంది. అసలు పెళ్లినే కాదని ఇష్టపూర్వక సహజీవనాన్ని సాగించే జంటల సంఖ్య పెరుగుతున్నది. చదువుకున్న, స్వతంత్ర వ్యక్తిత్వమూ చైతన్యమూ గల పలువురు స్త్రీలు సంప్రదాయ వివాహ వ్యవస్థను తృణీకరిస్తున్నారు. ఒంటరి జీవనాన్ని కోరుకొనే మహిళలు ఎక్కువవుతున్నారు. వివాహేతర సహజీవన బంధం అక్రమమైనది, న్యాయవిరుద్ధమైనది కాదని కూడా సుప్రీంకోర్టు నిర్ధారించింది. సహజీవన జంటలకు పుట్టే పిల్లలకు ఆస్తి హక్కు ఉంటుందని ప్రకటించింది. అందుచేత ఇష్టపూర్వక సహజీవన స్వేచ్ఛకు గల సంకెళ్ళను పటాపంచలు చేయాలి. మన సంపూర్ణ ప్రజాస్వామిక లక్ష్యాన్ని, లక్షణాన్ని కాపాడుకోవాలి.
గార శ్రీరామమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News