Share News

Indian Monsoon 2025: ఈ విపత్తులు, విలయాలు మన స్వయంకృతమే

ABN , Publish Date - Sep 26 , 2025 | 02:32 AM

జడివాన, గాలివాన, తెరిపిలేని వర్షం, తెరిపిచ్చినా ముసురు, వదలని ముసురు, మళ్లీ కుంభవృష్టి, హో... ఇవి సాధారణ వానలా? కావు. ‘చిల్లుబడ్డ’ ఆకాశం కుమ్మరిస్తున్న విషాదాలు, మనలను చుట్టివేస్తోన్న విపత్తులు. ఈ వర్షాకాలంలో భారత ఉపఖండం...

Indian Monsoon 2025: ఈ విపత్తులు, విలయాలు మన స్వయంకృతమే

జడివాన, గాలివాన, తెరిపిలేని వర్షం, తెరిపిచ్చినా ముసురు, వదలని ముసురు, మళ్లీ కుంభవృష్టి, హో... ఇవి సాధారణ వానలా? కావు. ‘చిల్లుబడ్డ’ ఆకాశం కుమ్మరిస్తున్న విషాదాలు, మనలను చుట్టివేస్తోన్న విపత్తులు. ఈ వర్షాకాలంలో భారత ఉపఖండం ఉత్తరాది ప్రాంతాలలో సంభవించిన వరద బీభత్సం, జీవన విధ్వంసాన్ని వర్ణించేందుకు నా వద్ద మాటలు లేవు. రాష్ట్రాలకు రాష్ట్రాలు వరద తాకిడికి కుదేలయ్యాయి. గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయి; రోడ్లు, ఇతర ప్రాథమిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సువిశాల సస్యశ్యామల క్షేత్రాలు నీట మునిగిపోయాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో వరుసగా సంభవించిన మేఘ విస్ఫోటనాలతో భూమి సంద్రమయింది. కొండలు కూలిపోయాయి. ఆస్తినష్టం సరేసరి. స్వల్ప స్థాయిలోనే అయినప్పటికీ ప్రాణ నష్టం ఎంత బాధాకరం. కొండ అంచున సముద్రం, కష్టాల నావలో మనుగడ. మరోసారి నొక్కి చెప్పుతున్నాను: ఉపఖండ ఉత్తరాది ప్రాంతాలలో వర్షించిన కుంభవృష్టి తీవ్రత సాధారణమైనది కాదు. గత ఆగస్టులో పంజాబ్‌లో 24 రోజుల పాటు భారీ వర్షపాతం, అతి భారీ వర్షపాతం సంభవించింది. 24 గంటలలో 115 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే అది భారీ వర్షపాతం అని, 204 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తే అది అతి భారీ వర్షపాతమని భారత వాతావరణ విభాగం వర్గీకరించింది. అది కుండపోత కాదు, జలప్రళయమే సుమా!

హిమాలయాలు పరివేష్టితమై ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ–కశ్మీర్‌లు వర్ష విలయసీమలై పోయాయి. గత మూడు నెలల్లో ఇంచుమించు 80 రోజుల పాటు హిమాచల్‌ప్రదేశ్‌ కొండ వాలు ప్రాంతాలన్నీ భారీ వర్షాల తాకిడికి గురయ్యాయి. ఈ ఉపద్రవానికి తోడు మేఘ విస్ఫోటనాల కారణంగా మెరుపు వరదలు! ప్రభుత్వ సమాచారం ప్రకారం 13 మేఘ విస్ఫోటనాలు సంభవించగా, వీటికి అదనంగా మరో పది మేఘ విస్ఫోటనాలు వాటిల్లినట్టు మీడియా వెల్లడించింది. ఈ విధ్వంసం ఎందుకు జరుగుతోంది? వాతావరణ అత్యవసర పరిస్థితి, సందేహం లేదు. అయితే అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పనుల ఫలితమే ఈ ప్రళయాలు అన్న వాస్తవాన్ని కూడా విస్మరించకూడదు. ప్రకృతికి వాటిల్లే హానిని లక్ష్యపెట్టకుండా సాధిస్తున్న అభిృవృద్ధే ఈ విధ్వంసంగా పర్యవసిస్తోంది అనడం ఎంత మాత్రం సత్య దూరం కానేకాదు.


సరే, వాతావరణం ఎలా మారుతుందో తొలుత అర్థం చేసుకుందాం. వాస్తవమేమిటంటే ఈ వర్షాకాలం దుఃఖ రుతువుగా మారిపోవడానికి ప్రధాన కారణం వాతావరణ వ్యవస్థకు తీవ్ర అంతరాయమేర్పడడమే. ఈ విపరిణామం వాతావరణ మార్పుతో ముడివడివున్నది. భూ తాపం పెరిగిపోతున్న కొద్దీ వర్షపాతం మితిమీరుతోంది. కొన్ని రోజుల పాటు మరీ అత్యధికంగా ఉంటున్నది. ఇదే ఈ వర్షాకాలంలో మనం చూసింది. ఒక వర్షరుతువు అంతా సంభవించే మొత్తం వర్షపాతం కొద్ది గంటలలోనే వాటిల్లింది! ఈ విపరీత వాతావరణ పోకడలకు మరిన్ని కారణాలు ఉన్నాయి. పడమటి తుపానులు (మధ్యధరా సముద్రంలో పుట్టి భారత్‌, పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, నేపాల్‌ మొదలైన దేశాలకు శీతాకాలంలో అకస్మాత్తుగా వర్షం, మంచును తీసుకువచ్చే అల్పపీడన తుపానులు) సాధారణ వాతావరణ పరిణామమనే విషయమని మనకు తెలుసు. ఈ వానాకాలం అవి మరింత తీవ్రమయ్యాయి. నైరుతి రుతుపవనాల కాలంలో అప్పుడప్పుడు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సంభవించే ఈ పడమటి తుపానులు ఈ సెప్టెంబర్ మొదటివారం దాకా 19 పర్యాయాలు సంభవించాయి. ఈ పడమటి తుపానులు రుతుపవనాలతో ఘర్షించడం వల్లే ఉపఖండం ఉత్తరాది ప్రాంతాలలో ప్రళయకారక వర్షపాతం సంభవించింది.

ఆర్కిటిక్‌ మహాసముద్రం నుంచి వీచే జెట్‌ ప్రవాహం (ట్రోపో ఆవరణలో 12 కిలోమీటర్ల కంటే ఎత్తులో అతివేగంగా ప్రవహించే పశ్చిమ పవనం. దీని వేగం గంటకు 120 నుంచి 370 కిలోమీటర్ల వరకు ఉంటుంది) అనే పవనాలతో పడమటి తుపానులు అనుసంధానమవడం వల్లే ఈ విలయం సంభవించిందని చెప్పవచ్చు. వాతావరణ మార్పు కారణంగా ఈ ఆర్కిటిక్‌ వాయు వ్యవస్థ బలహీనపడింది. ఈ పరిణామం ప్రపంచ వాతావరణ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది.


ఈ ఏడాది అరేబియా సముద్రం నుంచి ప్రభవించే వాయు వ్యవస్థలకు సైతం అంతరాయం ఏర్పడింది. అవి బంగాళాఖాతం నుంచి వచ్చే రుతుపవనాలకు వ్యతిరేకంగా తీవ్ర ఒత్తిడి కలిగించాయి. మొత్తం మీద సముద్రాలు వేడెక్కడం నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం వరకు, భూమధ్యరేఖ, ఉత్తర ధ్రువ ప్రాంతం మధ్య ఉష్ణోగ్రతలలో తేడా తగ్గిపోవడం దాకా ఎన్నో కారణాల ఫలితంగా వాయు వ్యవస్థల్లో తీవ్ర అస్తవ్యస్తత నెలకొన్నది. ఈ అస్థిరతే ఇప్పుడు కుండపోత వర్షాలు, వరదల రూపంలో మనకు తీవ్ర తాకిడిని కలిగిస్తున్నాయి. చూస్తుంటే ప్రకృతి మనపై పగ తీర్చుకుంటున్నట్టుగా ఉన్నది. ఈ విపత్కర పరిస్థితి ఇప్పుడిప్పుడే సమసిపోదు. పైగా అది మరింతగా విషమిస్తుంది. ఇది ఖాయం.

మన కష్టాలకు వాతావరణ మార్పును తప్పుపట్టడం వల్ల ప్రయోజనం లేదు. అలాగే కర్మవాద వైఖరి– ప్రకృతి ఇలా వ్యవహరిస్తుంటే మానవులం మనమేం చేయగలం? –అన్న వైఖరిని కూడా విడనాడాలి. ఇది భగవంతుడి పని కానేకాదు. ఇది మనకు మనం కొనితెచ్చుకున్న సంక్షోభం. అది ఇప్పుడు పూర్తిగా మన వాకిట ఉన్నది. ఆర్థికాభివృద్ధికై మన వాతావరణంలోకి మితం లేకుండా మనం విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల ఫలితమే వాతావరణ మార్పు కదా. వ్యక్తుల, దేశాల దురాశ ఇందుకు అపరిమితంగా కారణమవుతోంది. ఎన్ని అని చెప్పను ఈ విషాదాల వృత్తాంతాలు?! ‘అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా మనం మేల్కోవాలి’ అని నేను చెప్పినప్పుడు నా మాటల్లోని ఆవేదనను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

Updated Date - Sep 26 , 2025 | 02:32 AM