Share News

Lingampally Bikshapathi: సమరశీల పోరాటయోధుడు

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:54 AM

జీవితాంతం ఎర్ర జెండా పోరులో వెలుగై ప్రకాశించిన సమరశీల పోరాటయోధుడు లింగంపల్లి బిక్షపతి. ఆయన పోరాట జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ఎల్లంపేట గ్రామంలో 1942లో...

Lingampally Bikshapathi: సమరశీల పోరాటయోధుడు

జీవితాంతం ఎర్ర జెండా పోరులో వెలుగై ప్రకాశించిన సమరశీల పోరాటయోధుడు లింగంపల్లి బిక్షపతి. ఆయన పోరాట జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ఎల్లంపేట గ్రామంలో 1942లో బిక్షపతి జన్మించారు. నాలుగో తరగతి వరకు చదివినా, నాలుగు పదుల వయసులో ఎస్.ఎస్.సి. పరీక్షకు హాజరయ్యారు. రేపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్‌ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించారు. 34 ఏళ్ల వరకు ఆధ్యాత్మిక భావజాలంలో కొనసాగుతూ పౌరాణిక నాటకాలు, కోలాటాలు, జడ కొప్పులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను రంజింపజేశారు. మంగలి కులంలో పుట్టి క్షౌర వృత్తి, ఆయుర్వేద వైద్యం, సంగీతంతో పాటు అభ్యుదయ పద్య గీతాలు రాయడం, పాడడం చేశారు. హార్మోనియం, తబలా, డోలక్ వంటి సంగీత పరికరాలు వాయించడమే కాక ఇతరులకు వాటిని నేర్పించారు. ఎల్లంపేట దొరల, భూస్వాముల దోపిడీ, పెత్తందారి దళారీల పీడన, వెట్టిచాకిరి చూసి చలించిపోయి తిరుగుబాటుకు దారులు వెతకడం ఆరంభించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎర్ర జెండాకు ఆకర్షితులై 1976లో సీపీఎం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి, ఓంకార్ మార్గదర్శకత్వంలో ఎల్లంపేట పరిసర ప్రాంతాలలో కమ్యూనిస్టు (మార్క్సిస్ట్) పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. భూస్వాముల, దొరల గడీలకు వ్యతిరేకంగా 50 మంది సభ్యులతో గుత్పల సంఘాన్ని ఏర్పాటు చేసి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అనేక రకాల ప్రజా పోరాటాలు నిర్వహించారు.


‘భూస్వామి వీధి బాగోతం’, ‘పంజరంలో చిలుక’, ‘మాయ’ వంటి నాటకాలను ప్రదర్శిస్తూ, ప్రజలను చైతన్యం చేశారు. వివిధ సభలలో లెనిన్ వేషధారణతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షించారు. వ్యూహాత్మకంగా తన పోరాటానికి పదును పెడుతూ దొరల భూస్వాములను హడలెత్తించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బిక్షపతి పోరాటాన్ని ఆపలేదు. వరంగల్ సెంట్రల్ జైల్లో మూడుసార్లు జైలు జీవితం గడిపారు. ఒక సంవత్సరం పాటు అజ్ఞాతంలో ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించారు. చదువుల ద్వారానే సామాజిక మార్పు సిద్ధిస్తుందని భావించి ఎల్లంపేటలో నేతాజీ ప్రజా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి కార్యదర్శిగా కొనసాగారు. రాత్రి బడి నిర్వహిస్తూ తోటి వారికి విద్యతో పాటు పాటలు నేర్పించారు. ఎల్లంపేట హైస్కూల్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. మద్యపానం, ధూమపానం వంటి సాంఘిక దురాచారాలను మాన్పించడానికి ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆయుర్వేద వైద్య వృత్తితో అనేక మంది ప్రాణాలను కాపాడుతూ మంచి డాక్టర్‌గా కీర్తి గడించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పు కోసం నిరంతరం పనిచేస్తూ, తన 82వ ఏట జూన్‌ 29న మరణించారు. సమాజ మార్పు కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే తన కొడుకు దయానంద్‌ను ఉన్నత చదువులు చదివించి, ప్రజాతంత్ర ఉద్యమాల వైపు నడిపించారు. దయానంద్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా ఉన్నారు. వైద్య వృత్తిపై మక్కువతో తన భౌతికకాయాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. బిక్షపతికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. జీవితాంతం ఆచరణాత్మక పోరాటాన్ని కొనసాగించిన బిక్షపతి పోరాట స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే ఘన నివాళి.

విశ్వ జంపాల

వ్యవస్థాపకులు, విశ్వసమాజం

ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 01:54 AM