Share News

లాలూ అపరాధం

ABN , Publish Date - Jun 21 , 2025 | 07:49 AM

కాళ్ళుజాపుకొని కూర్చొనివున్న లాలూ యాదవ్‌కు, బారులుతీరిన భక్తులంతా అతివినయంగా వరుసపెట్టి వందనాలు చేస్తున్న ఆ విడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా, విపరీత వ్యాఖ్యలతో ప్రచారం అవుతున్నాయంటే, దానర్థం బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడ్డాయని.

లాలూ అపరాధం

కాళ్ళుజాపుకొని కూర్చొనివున్న లాలూ యాదవ్‌కు, బారులుతీరిన భక్తులంతా అతివినయంగా వరుసపెట్టి వందనాలు చేస్తున్న ఆ విడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా, విపరీత వ్యాఖ్యలతో ప్రచారం అవుతున్నాయంటే, దానర్థం బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడ్డాయని. మరో ఐదునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున లాలూ 78వ పుట్టినరోజు వేడుకకు ఎనలేని ప్రచారం వచ్చింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఓ నమస్కారం పెట్టి, వినయంగా ఫోటోలు తీయించుకోవడమే తప్ప వారు తెచ్చిన పుష్పగుచ్ఛాలు ఆయన అందుకున్నదీ లేదు, వారివైపు కన్నెత్తిచూసిందీ లేదు. ఏ కదలికలూ, ఏ కవళికలూ లేకుండా ఎదుటికుర్చీలో ఆయన కాళ్ళుపెట్టి కూర్చొని ఉండగా, ఆ కుర్చీమీద ఓ కార్యకర్త అంబేడ్కర్‌ ఫోటోను ఉంచి, ఫోటో దిగిన ఆ ఘట్టం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది. దేవుడి ఫోటోను కూడా కాళ్ళదగ్గర పెట్టుకోగల అహంభావిగా ఆయనను విమర్శిస్తూ ఈ విడియోను బీజేపీ పోస్టుచేసింది. అంబేడ్కర్‌ చిత్రాన్ని కాళ్ళ దగ్గర పెడుతూంటే కనీసం అభ్యంతరం చెప్పలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అది అంబేడ్కర్‌ పటం అని లాలూకు తెలుసో తెలియదో కానీ, ఆ విడియో చూసినవాళ్లకు మాత్రం ఇది తెలిసి జరిగిన తప్పులాగా కనిపించడం లేదు. ఆరోగ్యం బాగోలేని ఒక వృద్ధుడి విషయంలో బీజేపీ అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆర్జేడీ మండిపడినంత మాత్రాన అపరాధం చెరిగిపోదు. ఎదురుదాడిచేసినప్పటికీ రాజకీయంగా ఎంతోకొంత నష్టం తప్పదు.


ఈ ఆయుధాన్ని సాక్షాత్తూ ప్రధానమంత్రే శుక్రవారం నాటి సివాన్‌ సభలో వినియోగించుకున్నారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలకు అంబేడ్కర్‌ బద్ధవ్యతిరేకి కనుక, ఆయనంటే గిట్టని ఆర్జేడీ నేతలు ఆ చిత్రపటాన్ని తమ కాళ్ళదగ్గరపెట్టుకున్నారని మోదీ విమర్శించారు. తాను అంబేడ్కర్‌ను మనసులో ప్రతిష్ఠించుకున్నానని, చిత్రపటాన్ని గుండెలకు దగ్గరగా ఉంచుకుంటానని చెప్పుకొచ్చారు. బిహార్‌ ప్రజలంతా డిమాండ్‌ చేస్తున్నా లాలూ కుటుంబం క్షమాపణలు కోరడం లేదని, వారికి దళితులు, ఓబీసీలు, ఈబీసీలంటే చిన్నచూపని, అంబేడ్కర్‌కంటే తామే గొప్పవాళ్ళమని అనుకుంటారని మోదీ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలపేరిట రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ అసలు రంగు ఇదేనని, అంబేడ్కర్‌ను అవమానించినవారిని బిహార్‌ ప్రజలు క్షమించబోరని ఆయన గద్గదస్వరంతో వ్యాఖ్యలు చేశారు. తాము సబ్‌కా వికాస్‌ అంటూంటే ఆర్జేడీ అధినేతలు పరివార్‌కా వికాస్‌ అంటున్నారని, చేతిలో లాంతర్లున్నవారు బిహార్‌ను చీకట్లో ముంచేస్తే, తాము వేలాదికోట్ల కేటాయింపులతో రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చామని మోదీ చెప్పుకున్నారు. కొత్తప్రాజెక్టుల ఆరంభం, బిహార్‌కు ఇచ్చినదేమిటన్న వివరాలకంటే, ఈ చిత్రపటం వివాదం ప్రభావవంతంగా పనిచేస్తుందని బీజేపీ నాయకులు నమ్ముతున్నట్టుంది.


11.jpg

ఎన్నికల వేళ లాలూను విమర్శించడం, కుటుంబ, వంశపారంపర్య పాలనంటూ తప్పుబట్టడం, రెండుదశాబ్దాలనాటి జంగిల్‌రాజ్‌ ప్రస్తావనలతో జనాన్ని భయపెట్టేందుకు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. కానీ, అంబేడ్కర్‌ చిత్రపటం ఘటనను బీజేపీ పైస్థాయిలో సైతం వాడుకోవడం వెనుక మంగనీలాల్‌ భయం ఉన్నదని ఆర్జేడీ నాయకుల వాదన. ధనుక్‌ కులానికి చెందిన మంగనిలాల్‌ మండల్‌ను ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించి లాలూపార్టీ అత్యంత వెనుకబడిన కులాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. లాలూ, నితీశ్‌ లాగానే మంగనీలాల్‌ కూడా సోషలిస్టు నేత కర్పూరీఠాకూర్‌ శిష్యుడే. ఉత్తరబిహార్‌లో అత్యంత వెనుకబడిన కులాల్లో ఈయనకు మంచిపేరుంది. రాష్ట్ర జనాభాలో మూడోవంతున్న ఈ కులాలు లాలూను వదిలి నితీశ్‌వైపు మళ్ళిన నేపథ్యంలో, వెనక్కురప్పించేందుకు వీలుగా ఈ తరహా నాయకులకు పెద్దపీటవేసే పని ఆరంభించారు తేజస్వియాదవ్‌. మంగనీలాల్‌ నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఆరెస్సెస్‌వాళ్ళే కుట్రచేసి కర్పూరీఠాకూర్‌ ప్రభుత్వాన్ని కూల్చేశారని, ఇప్పుడు బీజేపీ ఆరెస్సెస్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టి తేజస్విని ముఖ్యమంత్రి చేయాలని లాలూ గురువారం బిహారీలను అభ్యర్థించారు. మోదీ అదేపనిగా బిహర్‌లో పర్యటించడాన్ని అపహాస్యం చేస్తున్న ఆర్జేడీకి పోరాటం సులభం కాదన్న వాస్తవం తెలియకపోదు. ‘ఆమ్‌ బిహారీ ప్రవాసీకీ జాన్‌కారీ’ పేరుతో, దేశవ్యాప్తంగా వలసపోయిన రెండున్నరకోట్ల పైచిలుకు ఓటర్లను గుర్తించి, ఎన్నికలవేళ రప్పించి ఓట్లేయించుకొనే ఒక బృహత్తర పథకాన్ని సైతం బీజేపీ చేపట్టింది. కుమారుడి పట్టాభిషేకం చూడాలన్న 78 ఏళ్ళ లాలూ కల నిజమౌనో లేదో నవంబరులో తేలిపోతుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల

Read Latest Telangana News and National News

Updated Date - Jun 21 , 2025 | 07:49 AM