Komaram Bheem: ఆదివాసీ విప్లవ పోరాట జ్వాల
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:35 AM
అడవితల్లి ముద్దుబిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం, భూమి కోసం ఆరాటపడుతుంటే చలించిపోయి... వారి హక్కుల కోసం, జల్–జంగిల్–జమీన్ కోసం తెల్లదొరలపైనా, నల్లదొరలపైనా, నైజాం సర్కార్‌పైనా...
అడవితల్లి ముద్దుబిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం, భూమి కోసం ఆరాటపడుతుంటే చలించిపోయి... వారి హక్కుల కోసం, జల్–జంగిల్–జమీన్ కోసం తెల్లదొరలపైనా, నల్లదొరలపైనా, నైజాం సర్కార్‌పైనా సమరశంఖం పూరించిన గోండ్ పోరాట యోధుడు కొమరం భీమ్. గిరిజనేతర అస్తిత్వం దోపిడీపైనా, గిరిజనేతర సామ్రాజ్యవాదంపైనా పోరాడి బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరజీవి అయ్యారు.
దేశంలో, రాష్ట్రంలో చరిత్ర పరిణామ క్రమంలో ఆధిపత్యం అణచివేతకూ వ్యతిరేకంగా సంప్రదాయకమైన ఆయుధాలు చేపట్టి... సాయుధ పోరాటాల ద్వారానే స్వయంపాలన వస్తుందని దృఢంగా నమ్మి, నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలు చేస్తున్న పోరాటాల చరిత్ర ఘనమైనది. 1240–1749 మధ్య కాలంలో స్వేచ్ఛగా విలసిల్లిన గోండ్వానా రాజ్యాలు ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమయ్యాయి. ఆదివాసీల జీవన విధానం, అస్తిత్వం దెబ్బతిన్నది. 1836 నుంచి 1860 వరకు రాంజీ గోండ్ నాయకత్వంలో ఆదివాసీలు వీరోచితంగా పోరాడారు. ఆ పోరాట వారసత్వంగా ఆదిలాబాద్ అడవితల్లి ఒడి నుంచి ఆవిర్భవించిన ఆణిముత్యం, ఆదివాసీ విప్లవ పోరాట జ్వాల కొమరం భీమ్. 1900, అక్టోబరు 22న ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారాయన. ఆంగ్లేయులు, నైజాం నవాబులు కొనసాగిస్తున్న దోపిడి, దుర్మార్గాలు, అరాచకాలు, అణచివేతకు వ్యతిరేకంగా ఆసిఫాబాద్ పరిసర 50 ఆదివాసీ గ్రామాలలో యువకులను కూడగట్టి గెరిల్లాసైన్యం ఏర్పాటు చేశారు. జోడేఘాట్ కేంద్రంగా నిజాం సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1940 సెప్టెంబర్ ఒకటిన రాత్రివేళ కొండలలో నిజాం సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటంలో వెన్నుపోటు రాజకీయాల ద్వారా దొంగదెబ్బ తీసి బూటకపు ఎన్‌కౌంటర్‌లో కొమరం భీమ్‌ను నిజాం సైనికులు కాల్చి చంపారు. ఆయన వీరమరణం పొంది, నేడు ఆదివాసీ అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్నారు. ఆయన వర్ధంతిని ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆదివాసీలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. స్వయంపాలన ఉద్యమాల కోసం ఆదివాసీలను మేల్కొలిపి, సామాజిక న్యాయం కోసం సమరశంఖం పూరించి, ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాలకు ప్రాణం పోసిన వ్యక్తి కొమరం భీమ్.
నీళ్లు, నియామకాలు, నిధులు, స్వయంపాలన, ఆత్మగౌరవంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆదివాసీలకు స్వయంపాలన కల్పించాలనే కొమరం భీమ్ ఆశయాన్ని నేటి పాలకులు పట్టించుకోవడం లేదు. 5వ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా ఆదివాసీ భూభాగాన్ని ఆంధ్ర, తెలంగాణగా విభజించటమే కాక; జిల్లాల పునర్విభజన పేరుతో ఆదివాసీ ప్రాంతాలనూ మైదాన ప్రాంతాలలో కలిపి ఆదివాసీల అస్తిత్వాన్ని పాలకులు దెబ్బతీసారు. హరితహారం పేరుతో ఆదివాసీల భూములను బలవంతంగా లాక్కొని, వాటిలో మొక్కలు నాటి, ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలో సాదాబైనామా కోసం జీవో 53 తీసుకువచ్చి, ఏజెన్సీలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆదివాసుల భూములను గిరిజనేతరులకు దోచిపెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు.
గిరిజనేతర సామ్రాజ్యవాదం నేడు దేశంలో, దండకారణ్యంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో అడుగుబెట్టి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న సహజవనరులు, ఖనిజ సంపదనూ దొడ్డిదారిలో దోచుకుంటున్నారు. దండకారణ్యంలో ఆదివాసీలపై నరమేధం కొనసాగుతోంది. ఆదివాసీ మహిళలపై అంతులేని అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ఆదివాసీ ప్రజాప్రతినిధులు గిరిజనేతర రాజకీయ పార్టీలలో కీలు బొమ్మలుగా మారారు. ఏజెన్సీలో ఆదివాసీలను దోపిడీ చేస్తూ వారిపై పెత్తనం చెలాయిస్తున్న గిరిజనేతరులు... నేడు ఆదివాసీల రిజర్వేషన్స్ కబ్జా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. మరోవైపు చెల్లప్ప కమిషన్ ద్వారా మరో మూడు కులాలను ఎస్టీ జాబితాలో కలిపి, ఆదివాసులను నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు ఆదివాసీల రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఆదివాసీల జీవన విధానం విధ్వంసమవుతున్నా ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు నోరు మెదపటం లేదు.
ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలి, వారి వలసలు అరికట్టాలి. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలనూ తొలగించాలి. ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. ఇందులో అటెండరు నుంచి ఐఏఎస్ వరకు ఆదివాసీలనే నియమించాలి. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పీసా చట్టాన్ని, జీవో నెం.3ని పకడ్బందీగా అమలు చేయాలి. ఏజెన్సీలో పోలీస్ శాఖనూ ఐటీడీఏ నియంత్రణలోకి తీసుకురావాలి. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి. ఏజెన్సీలో ఆదివాసీలు సాగుచేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి. అలాగే గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. పై డిమాండ్స్ సాధన కోసం కొమరం భీమ్ స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన కలలు కన్న ఆదివాసీల స్వయంపాలన సాధ్యమవుతుంది.
వూకె రామకృష్ణ దొర
(నేడు కొమరం భీమ్ 125 జయంతి, ఖమ్మంలో విగ్రహావిష్కరణ)
ఇవి కూడా చదవండి
సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం