Kaleshwaram Corruption: కాళేశ్వరానికి నేతలు అధికారుల అవినీతి హారతి
ABN , Publish Date - Aug 15 , 2025 | 02:02 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని, అలక్ష్యం ఏరులై పొంగిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని, అలక్ష్యం ఏరులై పొంగిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి. కాదు, ప్రకృతే బయటేసింది. ఓ పెను ప్రమాదం నుంచి తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేసింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, నియంతల పాలన సాగుతున్న దేశాల్లో కూడా లేని విధంగా, ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆద్యంతం తానే అయి పోషించిన పాత్ర చర్చనీయాంశం అయింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. ఎలా కట్టాలీ, ఎంత నీరు నిల్వ చేయాలీ, ఎలా నిర్వహించాలీ అన్న విషయాలతో పాటు, ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను మార్చేసింది కూడా ఆయనే. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనల్ని నామమాత్రంగా కూడా పట్టించుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్‌రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తమ విధుల నిర్వహణలో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారని ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కాళేశ్వరం నిర్మాణం కోసం ఇచ్చిన ప్రధాన జీవోల్ని అసలు క్యాబినెట్ ముందే ఉంచలేదన్న నిజాన్ని కూడా కమిషన్ బయటపెట్టింది.
రూ.38,500 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు అంచనాల్ని ఓసారి రూ.71,436కోట్లకు ఆపై రూ.1,10,248.48 కోట్లకు పెంచారు. కాళేశ్వరం లోగుట్టు అంతా ఇక్కడే ఉంది. ఆ పెరిగిన అంచనాలు తలా కొందరు పంచుకున్న కారణంగానే అప్పటి అధికారులు నేతల్ని మించి చురుగ్గా వ్యవహరించి కాళేశ్వరం పూర్తి చేశారు. అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి స్వయంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం వద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టి కేసీఆర్ మౌఖిక ఆదేశాలకు జీహుజూర్ అన్నారు. నాటి సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజెక్టుకి సంబంధించి ఫైళ్లను కాబినెట్ ముందుకు రాకుండా చూసుకున్నారు. ఈఎస్‌సీగా ఉన్న సి. మురళీధర్ కేంద్ర జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. నాటి ఈఎన్‌సీ హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎండీగా ఉండి విచారణ కమిషన్ ముందు బ్యారేజీల గురించి తనకేమీ తెలియదని సిగ్గులేకుండా చెప్పుకున్నారు. వీళ్ళతోపాటు నరేందర్‌రెడ్డి, కె.ఎస్.ఎస్ చంద్రశేఖర్, బసవరాజు, టి. శ్రీనివాస్, ఓంకార్ సింగ్ లాంటి ఉన్నతాధికార్లు కుప్పలు కుప్పలుగా తప్పులు చేసినట్టు ఘోష్ కమిషన్ తేల్చింది. వీరిలో కొందరు అధికారులపై ఏసీబీ దాడులు చేసింది. ఒకొక్కరి దగ్గర రూ.300 నుంచి 500 కోట్ల దాకా అక్రమాస్తులు ఉన్నట్టు తేలింది. అధికారుల వద్దే ఇంత డబ్బు మూలుగుతుండగా కాళేశ్వరానికి అసలు అవినీతి మకిలి అంటనేలేదని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అవినీతి అధికారుల వల్ల మొత్తం అధికార వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది.
సహజంగా అధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుపరిచే విధానంలో కీలకంగా ఉంటారు. రాజకీయ నాయకుల కన్నా అధికారులకే సంబంధిత సబ్జెక్టులో సాధికారత ఉంటుంది. ఈ సాధికారత వల్ల ప్రభుత్వాధినేతలు రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి తెలిసో తెలియకో చేసే తప్పుల్ని ఒకప్పుడు అధికారులు నియంత్రించేవాళ్ళు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వై.ఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి వాళ్లు సైతం సదరు ఐఏఎస్ అధికారుల మాటని గౌరవించి తమ నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భాలు అనేకం. 1966 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్, ఐఏఎస్ అధికారి శంకరన్, ఈ తరానికి సుపరిచితమైన జయప్రకాష్ నారాయణ... వీరి నిజాయితీ నిబద్ధతల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. వీరి ఈ తరహా వ్యవహారశైలి వల్ల అంతిమంగా ప్రజలే లబ్ధి పొందారు. సర్వీసెస్ నుంచి వచ్చిన అధికారులకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతలకు మధ్య సమన్వయం సమాజానికి హితం చేయడం ఎంత సహజమో, ఆ బంధం దారి తప్పితే ఎదురయ్యే పరిణామాలు సమాజానికి అంతే చేటు.
ఆస్తులు డబ్బు మూటలు కూడగడుతున్న ఉన్నతాధికారులు కొందరు ఆ తర్వాత ఆత్మగౌరవం పోయి, ఆత్మవిశ్వాసం లోపించి, సమాజం దృష్టిలోను ఒక్కోసారి కుటుంబం దృష్టిలోను కూడా దోషులుగా నిలబడుతున్నారు. విచారణల్లో బైటపడే వారి తప్పులు మొత్తం వ్యవస్థ మీదే నమ్మకం పోయేలా చేస్తున్నాయి. దీంతో ప్రజలు సైతం ఒక మోస్తరు అవినీతిని సహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవ్వగానే తృణమో, పణమో ఇవ్వడానికి పెద్దగా ఆలోచించడం లేదు. కానీ డిమాండ్లతో తమ నడ్డి విరగగొట్టే అధికారం మీదే వీరి ఆక్రోశం. అవసరార్థం జరిగే అవినీతి కన్నా అవినీతి కోసమే అవసరాలు, ఆలోచనలు ముందుకొస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో తేలికైన ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్!
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News