అవినీతి స్మారకంగా అలా వదిలేయాల్సిందే
ABN , Publish Date - May 07 , 2025 | 05:09 AM
కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయ్యాక నీరు లేదనే సాకుతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీ–ఇంజనీరింగ్, రీ–డిజైనింగ్ పేరిట దాన్ని మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష కోట్లకు చేర్చారు. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం...
కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయ్యాక నీరు లేదనే సాకుతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీ–ఇంజనీరింగ్, రీ–డిజైనింగ్ పేరిట దాన్ని మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష కోట్లకు చేర్చారు. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి, 2019లో దానిని ప్రారంభించారు. నాలుగేళ్ళ లోపే, అక్టోబర్ 21, 2023న ఏడవ బ్లాకులోని పియర్లు (piers) ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి.
కుంగిన మేడిగడ్డను జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ – ఎన్‌డీఎస్‌ఏ) పరిశీలించింది. ఈ సంస్థ ఇంజనీర్ల బృందం ఇక్కడ నీటి నిలవ ప్రమాదమని గ్రహించి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదేశించి, అన్ని బ్యారేజీలలో పూర్తి నీటిని అత్యవసరంగా ఖాళీ చేయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తన పూర్తి స్థాయి నివేదికలో ఏడవ బ్లాకులోని 11 పియర్లు మొత్తం కూల్చి, నిర్మించడం తప్ప గత్యంతరం లేదని పేర్కొంది. కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పులను నిగ్గు తేల్చింది. ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం పునాదులకు సంబంధించిన భూగర్భ పరీక్షలు చేయలేదని, బలహీనమైన ఇసుక పునాదులపై బ్యారేజీలు నిర్మించారని వెల్లడించింది.
బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి, ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన ఈ మూడు బ్యారేజీల్లో ప్రాజెక్టుల లాగ భారీ ఎత్తున నీటిని నిలువ చేశారు. బ్యారేజీలను డ్యాముల్లా నిర్వహించారు. ఆ భారీ నీటి నిలువ ఒత్తిడికి పునాదులు దెబ్బతిన్నాయి. దోపిడీయే లక్ష్యంగా ఆగమేఘాల మీద సాగిన ఈ నిర్మాణం వల్ల నిరంతరంగా ఇసుక కొట్టుకుపోతున్నది. స్పిల్‌వే నిట్టనిలువుగా మూడు అడుగుల వెడల్పుతో చీలిపోయి రెండు చెక్కలైంది. భూమిలో ఐదు అడుగులు కుంగిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా అసలే పనికిరావని ఎన్‌డీఎస్‌ఏ తన నివేదికలో పేర్కొన్నది. ఏడవ బ్లాక్‌లోని పియర్లు భూమిలో కుంగడానికి నిర్మాణ, నాణ్యత లోపాలే ప్రధాన కారణమని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసింది. సీకెంట్ ఫైల్స్ అమరిక సరిగా లేకనే పునాదిలో ఇసుక జారిందనీ పేర్కొంది. దీన్నిబట్టి విశ్లేషిస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించడం కూడా అసాధ్యం. పునరుద్ధరించినా మరికొన్ని బ్లాకులు, పియర్లు కుంగవన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఈ మూడు బ్యారేజీలను కేసీఆర్ అవినీతికి స్మారక చిహ్నంగా పురావస్తు శాఖకు అప్పగించటమే ఎవరైనా చేయగలిగింది!
ఇప్పటిదాకా జరిగిన నష్టం ఇక్కడితో ఆగదని, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం బ్యారేజీలకి ప్రమాదం జరుగుతుందని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేర్కొంది. మూడు బ్యారేజీలలో ప్రతి ఒక్కటీ ప్రమాదపుటంచులలో ఉన్నాయని తెలిపింది. సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ చేయాలని, జియో ఫిజికల్ పరీక్షలు, జియో సాంకేతిక పరీక్షలు చేసి, ఆధునిక హైడ్రాలిక్ నమూనాలను (నీటి ప్రవాహ ఒత్తిడికి సంబంధించిన నమూనాలను) ఉపయోగించి పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. ఘోరమైన ఇంజనీరింగ్ ప్రమాణాల ఉల్లంఘన వల్ల బ్యారేజీలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. తేలియాడే నిర్మాణాలుగా ఉండవలసినవి, రిజిడ్ స్ట్రక్చర్స్‌గా మారాయి.
మేడిగడ్డ బ్యారేజీలో 20, 21 పియర్స్ దగ్గర, దిగువ భాగంలో ఏడవ పియర్ దగ్గర భారీ రంధ్రాలు పడ్డాయి. బ్యారేజీ కట్ ఆఫ్ గోడల్లో ఇంకా కనిపించని రంధ్రాలు ఉండి ఉండవచ్చు. ఒకసారి నీళ్లతో నిండితే అవన్నీ బైటపడతాయి. బ్యారేజీలోని అన్ని బ్లాకులూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. భారీ జల ప్రవాహ శక్తి ముందు అవినీతితో నాణ్యత కొరవడిన నిర్మాణం నిలవగలదా? ఇంత ప్రమాదకర స్థితిలో వీటిని పునరుద్ధరించడం ఎందుకు? ఒక బ్లాక్‌ను కూల్చి పునర్నిర్మాణం చేస్తే, మరొకటి మళ్లీ కుంగితే, అది కూడా కూల్చవలసిన పరిస్థితి వస్తే, ఇక పునర్నిర్మాణం చేసుడెందుకు? మూడు బ్యారేజీలకు చెందిన రూ.30 వేల కోట్లు గంగలో కలిసినట్టే! మళ్లీ భారీ వృథా ఖర్చు ఎందుకు?
సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యూసి) అనుమతి తీసుకున్నాకే మేడిగడ్డలో ఏడో బ్లాకు నిరుపయోగంగా మారింది. ఇవే సమస్యలు మిగిలిన బ్లాకుల్లోనూ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా ఉన్నాయి. ఈ బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని, ఎన్‌డీఎస్‌ఏ అన్నదాని ప్రకారం పునర్నిర్మాణం చేసినా– మూడు బ్యారేజీలకు సుస్థిరత చేకూరుతుందని, చెక్కుచెదరకుండా ఉంటాయన్న గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు పునరుద్ధరణ ఎందుకు? రూ.30వేల కోట్ల ఖర్చుతో చేసిన భారీ మౌలిక సదుపాయం కదా అని పునర్నిర్మాణం చేసినా అది మూడు నాళ్ళ ముచ్చటే కావచ్చు.
నాటి ప్రభుత్వం బ్యారేజీలో పియర్లు కుంగిపోయే వరకు మెయింటెనెన్స్ పనులు చేపట్టలేదు. భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించాలన్న నిబంధన కూడా అమలు కాలేదు. 2019 నుంచి అన్నారం సుందిళ్ల బ్యారేజీల దిగువ భాగంలో సిమెంట్ కాంక్రీట్ బ్లాకులన్ని చెల్లాచెదురు అవుతున్నాయి. 20, 21 పియర్లలో సీపేజీ కట్టడికి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. సీపేజీలకు శాశ్వత పరిష్కారం చెప్పకుండా తాత్కాలిక చర్యలు తీసుకోవడం విచారకరం అని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొంది. ఎన్ని ఉల్లంఘనలు! ఎంత విధ్వంసం! కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి దుర్గంగా, దోచుకున్న వారికి దోచుకున్నంత స్వర్గంగా నడిచింది.
ఈ నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. అధునాతన పరీక్షల అనంతరమే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వినియోగంపై నిర్ణయం తీసుకోవాలనీ ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. మూడు బ్యారేజీలూ విపత్తులో ఉన్నాయని, పునరుద్ధరణ సాధ్యమయ్యే పరిస్థితులు లేవని ఎన్‌డీఎస్‌ఏనే చెబుతుంది. మేడిగడ్డ ఇక ముగిసిన అధ్యాయం. తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే దీనికి నిజమైన ప్రత్యామ్నాయం.
నైనాల గోవర్దన్
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి