Kakani Venkata Ratnam: ఆంధ్రా కురియన్ కాకాని
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:15 AM
స్వర్గీయ కాకాని వెంకటరత్నం మరణించి డిసెంబర్ 25కి 53 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ స్మరించుకుంటూనే ఉన్నారు. దేశ...
స్వర్గీయ కాకాని వెంకటరత్నం మరణించి డిసెంబర్ 25కి 53 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ స్మరించుకుంటూనే ఉన్నారు. దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన గ్రామీణ రైతు, కూలీ బంధువుగా వారికి చేయూతనందించిన ప్రజల మనిషి ఆయన. ప్రజానాయకునిగా అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకాని వెంకటరత్నం.
తన వృత్తే ప్రజాసేవ అని నమ్మి జీవితమంతా ప్రజలతోనే గడిపిన ఆదర్శ నాయకుడు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమంత్రిగా చేసిన కాలంలో ఆయన స్థాపించిన పాల సేకరణ కేంద్రాలు, శీతలీకరణ కేంద్రాలు, జిల్లా పాడి పరిశ్రమ కేంద్రాలు గ్రామీణ రైతాంగ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అందుకే కాకానిని చాలా మంది ‘ఆంధ్రా కురియన్’గా పిలుచుకుంటారు.
తదనంతర రాజకీయ పరిణామాలలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించే అరుదైన అవకాశం కాకానికి లభించింది. మహోధృతంగా జరిగిన ఆ ఉద్యమ ఫలం ఆయన మరణించిన 42 సంవత్సరాల తరువాత సాకారమైంది. రాష్ట్రం నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందడుగు వేస్తోంది. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం కారణం. అదే 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన త్యాగమూర్తి కాకాని. 1972 డిసెంబర్ 24 తలపెట్టిన సమైక్యవాదుల సమావేశానికి వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రజా ఉద్యమంపై అజంతా హోటల్, ఏలూరు రోడ్డు సెంటరులో జరిగిన పోలీసు కాల్పులలో మరణించిన ఉద్యమకారుల శవాలను చూసి, ‘నా బిడ్డలను పిట్టలలాగా కాల్చేస్తున్నారన్న’ తీవ్ర ఆవేదనతో అదే రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు కాకాని. అటువంటి నిస్వార్థ నాయకునికి స్మృతి చిహ్నంగా నూతన రాజధాని అమరావతిలో ఒక కట్టడానికి గాని, కృష్ణా జిల్లా నుంచి అమరావతి ప్రాంతాన్ని కలిపే ఐకానిక్ బ్రిడ్జికి గాని రాష్ట్ర ప్రభుత్వం కాకాని పేరు పెట్టాలి. కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులందరూ ఇందుకోసం కృషి చేయాలి.
కలపాల వినయసాగర్
కాకాని వెంకటరత్నం మెమోరియల్ ట్రస్ట్,
ముదునూరు, కృష్ణా జిల్లా
(డిసెంబర్ 25: కాకాని వెంకటరత్నం వర్ధంతి)
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News