Judicial Delays In India: : న్యాయ జాప్యం ప్రజాస్వామ్యానికి శాపం
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:21 AM
అపరిష్కృత వ్యాజ్యాలు భారీగా పెరిగిపోతుండటం భారత న్యాయ వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం – దేశవ్యాప్తంగా సివిల్, క్రిమినల్....
అపరిష్కృత వ్యాజ్యాలు భారీగా పెరిగిపోతుండటం భారత న్యాయ వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం – దేశవ్యాప్తంగా సివిల్, క్రిమినల్ వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టులో 88 వేల వ్యాజ్యాలు, హైకోర్టుల్లో 63.65 లక్షల దావాలు, కింది స్థాయి కోర్టుల్లో సుమారు 4.70 కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు సైతం ఏళ్ల తరబడి పెండింగులో ఉండి పోతున్నాయి. 750 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఉన్నప్పటికీ, విచారణ దశలో ఉండిపోతున్న దావాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం న్యాయపరమైన చిక్కులు, కాలయాపన వలన భారత్ ఏటా సుమారు రూ.50 వేల కోట్లు నష్టపోతోంది. భారత న్యాయ వ్యవస్థ ఆధునికీకరణకు కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చినప్పటికీ వాటితో అపరిష్కృత కేసులన్నీ పరిష్కారం అవుతాయన్న భరోసా లేదు. కొత్త పెండింగ్ కేసులు రావన్న గ్యారెంటీ లేదు. న్యాయమూర్తులు, మౌలిక వసతుల కొరతే ఇందుకు ప్రధాన కారణం.
2007 నాటికి దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండేలా చూడాలని 2002లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ, కేంద్ర న్యాయశాఖ లోక్‌సభలో వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం 10 లక్షల జనాభాకు కేవలం 21 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అదే ఆస్ట్రేలియాలో 58 మంది, బ్రిటన్‌లో 100, అమెరికాలో 150 మంది ఉన్నారు. ప్రస్తుత న్యాయమూర్తులతో దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ వ్యాజ్యాలపై తీర్పులు వెలువడడానికి 350 ఏళ్ళు పడుతుందనేది నిపుణుల అంచనా!
వకీళ్లు కోరిందే తడవుగా వాయిదాలపై వాయిదాలు పడుతున్న కేసుల మూలాన కక్షిదారులు ఎంతో నష్టపోతున్నారు. న్యాయం కోరి కోర్టు తలుపు తట్టడమే నేరమవుతోందని వారు విలపించే దుస్థితి నెలకొంది. కోర్టుల విచారణ, తీర్పుల వెల్లడిలో జరుగుతున్న విపరీత జాప్యం వలన నిర్దోషులు ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గిపోతుంటే, నిజమైన దోషులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దేశంలోని వివిధ కారాగారాల్లో 77 శాతం మంది విచారణ ఖైదీలుగానే సుదీర్ఘకాలం ఉండి పోతుండడం ఎంత సిగ్గుచేటు! ‘ఆలస్యంగా న్యాయం జరిగినా న్యాయం జరగనట్టే’ అని న్యాయశాస్త్రం చెపుతున్నప్పుడు నిర్దోషులకు ఇంత అన్యాయం జరిగితే నిజమైన న్యాయానికి ఇక అర్థమేముంది?
ఒకప్పుడు తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందనే ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోయిన నేటి రోజుల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ప్రత్యర్థుల్ని లొంగదీసుకునే క్రమంలో వారిని ఆర్థికంగాను, శారీరకంగానూ ఇబ్బందులకు గురిచేసేలా అక్రమ కేసులు పెట్టడం మామూలు విషయమైపోయింది. దాంతో ఎంతో మంది యువత బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతోంది.
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామం.
ఓ వైపు విపరీతంగా పేరుకుపోతున్న కేసులను, న్యాయస్థానాల్లో సిబ్బంది కొరతను పరిష్కరించడానికి యూనియన్ ప్రభుత్వం కొన్ని చట్టసవరణలనూ, కొత్త శాసనాలను తీసుకొస్తున్నది. దీనిలో భాగంగానే యూనియన్ ప్రభుత్వం, సుప్రీంకోర్టు, దాని ఆధ్వర్యంలోని మధ్యవర్తిత్వ ప్రాజెక్టు కమిటీ, జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థలు సంయుక్తంగా మొన్న జూలై నుంచి దేశవ్యాప్తంగా తొంభై రోజుల పాటు ‘మీడియేషన్ ఫర్ ది నేషన్’ పేరిట మధ్యవర్తిత్వ డ్రైవ్‌ను చేపట్టాయి. దీనిలో భాగంగా ఆస్తి, వైవాహిక, కుటుంబ తగాదాలు, గృహహింస కేసులు, వాణిజ్య, ఉద్యోగ సంబంధమైన తగాదాలు, రోడ్డు ప్రమాద క్లెయిమ్‌లూ పరిష్కరించుకోవచ్చు. మరోవైపు చిన్నచిన్న నేరాలను నేరరహితం (డీక్రిమినలైజ్) చేసేందుకు ఉద్దేశించిన జన్ విశ్వాస్ బిల్లు 2.0ను ఎన్డీయే ప్రభుత్వం 2022 డిసెంబర్ 22న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మొత్తం 288 నేరాలను ఇందులో చేర్చింది. 2023లో ఇలా 183 నేరాలను జన్ విశ్వాస్ బిల్లు ద్వారా తొలగించారు. సులభతర జీవనాన్ని ప్రోత్సహించి, వ్యాపార అనుకూల వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఈ రెండో బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లును సమగ్ర పరిశీలన నిమిత్తం లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపించారు.
గత తీర్పులు, నిందితుల పూర్వాపరాలతో కూడిన అపార సమాచారాన్ని మధించడంలో కృతిమ మేధ, బక్‌చెయిన్ సాంకేతికతలను వినియోగిస్తున్న దేశాలు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో న్యాయస్థానాలను సమీకరించడంలో యూకే, ఎస్తోనియా, లిథువేనియా వంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. ఇప్పడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి.
ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయడం తక్షణావసరం. అలాగే, న్యాయమూర్తుల నియామకానికి ఎన్‌జేఏసీ, జవాబుదారీతనానికి జ్యుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ చట్టం, సామర్థ్యానికి ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్లతో శాశ్వత రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు, కింది కోర్టులలో న్యాయమూర్తుల సంఖ్య పెంచడం, న్యాయ విచారణ పద్ధతుల్ని సులభతరం చేయడం, స్థానిక న్యాయస్థానాలను బలోపేతం చేయడం, నేరపరిశోధనలో, పోలీసు యంత్రాంగాన్ని సంస్కరించడం, రాజకీయ జోక్యాన్ని దూరం చేయడం వంటివి చేపట్టాలి. ఏకపక్ష అరెస్టులను నిలువరించడానికి న్యాయ నిబంధనలను కఠినంగా అమలుచేయాలి. వీటితో పాటు అవసరమైన మౌలిక వసతులు సమకూరిస్తే సకాలంలో న్యాయం అందించాలన్న లక్ష్యసాధన వేగంగా సుగమమవుతుంది. నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం వ్యవస్థ బాధ్యతగా గుర్తించిననాడే ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయత పెరుగుతుంది.
కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇవీ చదవండి:
అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
థ్రిల్లింగ్ ఫైట్.. పాము ముంగిసల పోరాటంలో విజేత ఎవరో చూడండి..