Share News

Journey Through Hills and Valleys : బిరసాడొల్స కొండదారి

ABN , Publish Date - Oct 06 , 2025 | 06:09 AM

అమరాయొల్స తగలకండా సింతలొల్స నుండి‌ జమితెల్లాలంతే కనబడీది ఈ అడ్డదారి బిరసాడొల్స నుండి ఆల్తిపేరంటాల గుడి దాకా ఉంతాదంతాం కదా...

Journey Through Hills and Valleys : బిరసాడొల్స కొండదారి

అమరాయొల్స తగలకండా

సింతలొల్స నుండి‌ జమితెల్లాలంతే

కనబడీది ఈ అడ్డదారి

బిరసాడొల్స నుండి ఆల్తిపేరంటాల గుడి దాకా

ఉంతాదంతాం కదా

అదే ఈ బతుకు దారి

ఇప్పలొల్స బస్సునేకమునుపు

ఎవులైనా

దేశమెల్లిపోతే

నెత్తి మీన మూట బరువేగాదు

బారమైపోయిన గుండె బరువూ

దీనికి అనుబవమే

కూలికెల్లే సైకిల్ సెక్రాలు ఎత్తుపల్లాలు ఓరవలేనపుడు

పడిపోయిన కేరేజీని చూసి

తెల్లగా గడ్డకట్టీసిన దుక్కమైపోయీదీ‌ దారి

అప్పడే దించిన‌ జీరుక్కల్లు

పూటుగా తాగీసి పడిపోయినోడ్ని

ఓ పక్కన పడుకోబెట్టుకొని

సెట్టుగొడుగు తొడిగే అమ్మవొడైపోయీది

జమితిలో పెల్లయితే

సెంపావతిలో దిగొచ్చిన పిట్టాడనేత్తాల

అరికాల్లతో ఊసులాడి

నది సంగతులు తెలుసుకొని

పక్కనే పారుతున్న కాలవలో

సేపపిల్లయి సంబరపడిపోయీది

మెంటాడ నాలం‌ పెద్దోడి

మలారం‌ ఇలగే నడిసీది

గజంగుడ్డొల్స కొండదొర్ల ఆడబొట్టి

సేతిని‌ గాజుపువ్వై మెరిసీది

శీతాకాలం తెల్లారినుండి పొద్దోయిందాకా

కొత్తబట్టల మూటల్ని కొండమీదకి

ఎల్లండర్రా అన్నట్టు పంపి

ఎక్కడెక్కడో పండుగుల్ని‌ ఇక్కడే కలగనీసీది

సముద్రాన్నెండబెట్టి

తట్టకెత్తకొచ్చిన కోనాడ సేపలమ్మని

నెలకోపాలి కీసురాయి గొంతుతో పలకరించీసీది

పంచరు సామాన్లొట్టుకొని

ఊరూరు తిరిగే అప్పారావుని

ఒక్కరోజు సూడప్పోయినా

కోసీసి తిన్నగా పరిసిన

గాల్లేని సైకిల్ సూపునాగ అయిపోయీది

అట్టాటిదారి

మట్టిదారి

మందిదారి

ఇప్పుడేటైపోనాదనుకుంతన్రా

అనుకున్నదే అయింది

అడివిని నొల్లీసుకోడానికి

బూకంపం నాగొచ్చీసి‌

మడిసిని సూత్తే బగ్గుమంతన్న పేద్దరోడ్డొకటి‌

దీన్ని‌ మింగీసింది

మాది గానిది

మేమంటే ఒప్పన్ది

ఎంతగొప్పదైతే మాకేటి

ఎంత పెద్దదైతే మాకేటి

రాజ్జెమా

ఇంకేటి సేత్తాం సెప్పిమి

నీ దారి నీది

మా దారి మాది

పాయల‌ మురళీకృష్ణ

83094 68318

ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 06:09 AM