వారిని కాదనుకుంటే కష్టమే!
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:42 AM
కల్తీ లేని పాలు కావాలనుకునేవాళ్లు గేదెలను పెంచేవారి నుంచి నేరుగా కొంటూ ఉంటారు. అమెరికాలోనూ గేదెలను పెంచే డెయిరీ ఫార్మ్ వద్దకు వెళ్లి తెచ్చుకోవచ్చు....

కల్తీ లేని పాలు కావాలనుకునేవాళ్లు గేదెలను పెంచేవారి నుంచి నేరుగా కొంటూ ఉంటారు. అమెరికాలోనూ గేదెలను పెంచే డెయిరీ ఫార్మ్ వద్దకు వెళ్లి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మొన్నమొన్నటిదాకా ఒక గ్యాలను (మూడున్నర లీటర్లకంటె కాస్త ఎక్కువ) పాల ధర 8–9 డాలర్లు ఉండేది. తరువాత, అది 15 డాలర్లు అయింది. మరువారానికి 18 డాలర్లకు చేరుకుంది. హఠాత్తుగా ధర రెట్టింపు అయిందేమిటని కుతూహలం కొద్దీ అతడిని అడిగాను. ‘ఇప్పుడు వాళ్లు పనికి రావడం లేదు. స్థానికులతోనే చేయించాల్సి వస్తోంది’ అన్నాడు. ‘వాళ్లు’ అంటే– ట్రంప్ ప్రభుత్వం ఎవరినైతే ‘డిపోర్ట్’ చేసేస్తున్నదో వాళ్లన్నమాట. ‘స్థానికులు’ అంటే అమెరికన్లే!. అక్రమ వలసదారులందరినీ ‘డిపోర్ట్’ చేయడం.. అమెరికాను ఖాళీ చేయించడం అనే మాటలు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ, ఆ నిర్ణయం పర్యవసానాలు అమెరికాలోని ప్రజాజీవితం మీద భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ.
‘అక్రమ వలసదారులు’ అనే పదం ద్వారా వారి గురించి దురభిప్రాయాన్ని సృష్టించడం చాలా సులువు. కానీ అమెరికన్ శ్రామిక వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్న వీరిని ఆ స్థానంనుంచి తొలగించడమంటే ఏకంగా ఆ వ్యవస్థను కుప్పకూల్చేయడమే. ఇందుకు అమెరికా అనేక రకాల విపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్పాదనల ధరలు అమాంతం పెరిగి, అంతిమంగా అమెరికన్లలో అసహనానికి దారితీయవచ్చు. అమెరికాలో చిన్నచిన్న ఉద్యోగాల్లో ఇలాంటివారే ఉంటారు. కెనడా, మెక్సికో తదితర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం సరిహద్దు దాటి పెద్దసంఖ్యలో వచ్చేస్తుంటారు. ఆ రెండు దేశాలు మాత్రమే కాదు. మెక్సికోలోకి సులువుగా ప్రవేశించగల భూమార్గాలు ఉన్న గ్వాటిమాలా,
ఎల్ సాల్వడార్ తదితర దక్షిణ అమెరికా దేశాలకు చెందినవారు కూడా తొలుత మెక్సికోలోకి, తర్వాత మంచి అవకాశం చూసుకుని అమెరికాలోకి నడుచుకుంటూ వచ్చేస్తుంటారు. ఈ అక్రమ వలసదారులనే కేటగిరీలో భారతీయులు కూడా అత్యధికంగానే ఉన్నారు. పంజాబ్, గుజరాత్‌లకు చెందిన అనేకమంది తొలుత మెక్సికోకు వెళ్లి అక్కడి నుంచి అమెరికాలోకి వస్తారు. తర్వాతి స్థానం తెలుగువారిదే. తనిఖీల కన్నుగప్పగల తెలివితేటలు, చాకచక్యం ఉన్నవారు నేరుగా వచ్చేయగలరు. మెక్సికోలో సరిహద్దు దాటించి అమెరికాలోకి పంపడానికి కొన్ని ముఠాలు కూడా పనిచేస్తుంటాయి.
వీళ్లందరూ పొట్ట చేతబట్టుకుని కడుపుకూటి కోసం తరలివచ్చేవాళ్లు. పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు వచ్చేస్తారు. బెదిరించిన వారికి తృణమో పణమో సమర్పించుకుని వస్తారు, గుట్టుచప్పుడు కాని బతుకులే బతుకుతూ ఉంటారు. వ్యవసాయ పనుల్లో, డెయిరీ ఫార్మ్‌లలో, భవన నిర్మాణ కార్మికులుగా, ఆతిథ్య, సేవారంగాల్లో అతి తక్కువ కూలికి వీరు పనిచేస్తుంటారు. ల్యాండ్ స్కేపింగ్, రవాణా, వేర్ హౌసింగ్, చైల్డ్ కేర్, ఇంటి పనులు వంటి వాటిల్లో కూడా వీరి సేవలు అధికం. ఈ రంగాలన్నీ మానవ వనరులు విస్తృతంగా అవసరమయ్యేవి. ఇవి తరచూ కూలీల కొరతతో ఇబ్బంది పడుతుంటాయి. ఈ రంగాలు స్థిరంగా కొనసాగడంలో ఈ అన్ డాక్యుమెంటెడ్ లాటినో వర్కర్స్‌గా పరిగణనలో ఉండేవారి భాగస్వామ్యమే ఎక్కువ.
దాదాపు 90 శాతం హోటళ్లలో, ఇతరత్రా తక్కువ వేతనాలు ఇవ్వజూపే వృత్తుల్లో వీరే ఉంటారు. గంటల వంతున చెల్లించే వేతనాలను తక్కువ మొత్తాల్లో ఇస్తూ, వీరి నుంచి నాణ్యమైన పనిని పొందడం ఆయా వ్యాపారాల యజమానులకు సాధ్యమవుతుంది. వేతనాలకు సంబంధించి వారి నుంచి అతిగా డిమాండ్లు ఉండవు. అలాగే ఒళ్ళు దాచుకోకుండా శ్రద్ధగా పనిచేస్తారని పేరుంది. అలాగే అన్ని రకాల చిల్లర పనులు చేస్తూ, నిత్యం అందుబాటులో ఉండే వారిని అమెరికాలో ‘హ్యాండీ మెన్’ అని వ్యవహరిస్తారు. వీరు ఎలక్ట్రికల్, ప్లంబింగ్, గార్డెనింగ్, క్లీనింగ్ తదితర సకల డొమెస్టిక్ పనులకు గంటల వారీ వేతనానికి అందుబాటులో ఉంటారు. ఈ హ్యాండీ మెన్‌లుగా పనులు చేసేవాళ్లలో అత్యధికులు ఈ వర్గానికి చెందినవారే. వారిని దేశం నుంచి పూర్తిగా తుడిచిపెట్టడం అంటూ జరిగితే అమెరికాలో చిరువ్యాపారాలు, వ్యవసాయ రంగాల రూపురేఖలు మారిపోతాయి. వారి స్థానంలో అమెరికన్లనే నియమించుకోవాల్సి వస్తే, ప్రతి పనికీ ఆ వ్యాపార యజమాని గతంలో ఇస్తున్న వేతనం కంటే కనీసం రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రభావం ఉత్పత్తుల ధరల మీద పడుతుంది. అంతిమంగా నష్టం జరిగేది అమెరికన్ పౌరులకే. అమెరికాలోని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ ఎస్టిమేట్స్ వారి నివేదిక ప్రకారం ఈ ఇమిగ్రెంట్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా వందల బిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరుస్తుంటారు. వారు చెల్లించే వివిధ రకాల పన్నులే కాదు, వీరిలో కొందరు సొంతంగా చిరువ్యాపారాలు కూడా ప్రారంభించి ఆర్థికవృద్ధిలో భాగం అవుతుంటారు.
నేరచరిత్ర ఉన్నవారిని వెనక్కు పంపడాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ స్వస్థలాలను, సొంత మనుషుల్ని వదులుకుని.. ఇక్కడ బతుకుతెరువు కోసం వచ్చిన అందరిమీద సమానంగా కక్ష కట్టడం విజ్ఞత కాదు. డెమోక్రాట్ల నుంచి మాత్రమే కాకుండా.. వీరి సేవలను వాడుకుంటున్న చిరు వ్యాపారులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, ఉత్పాదక వర్గాల నుంచి కూడా ట్రంప్ నిర్ణయం పట్ల వ్యతిరేకత వెల్లువెత్తే అవకాశం ఉంది. ట్రంప్, విశాల దృక్పథంతో అమెరికన్ల జీవితాలపై పడే భారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, తన నిర్ణయాలను సమీక్షించుకోవాలి.
డీపోర్టేషన్ జరుగుతున్న సమయంలో భారత్‌లో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే అనేక అర్థంపర్థంలేని సోషల్ మీడియా ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ విద్యార్థులను తక్షణం వెనక్కు పంపాలనేంత దుర్మార్గమైన పోకడలు ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. అక్రమంగా ఉంటున్నవారి మీదనే ఐస్ (ఐసీఈ– ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) దృష్టి ఉంటోంది. అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని డీపోర్ట్ చేయడం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. ఐస్ నిరంతరాయంగా అదే పనిమీద ఉంటుంది. కాకపోతే, ఇప్పుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంచెం ఉధృతంగా జరుగుతోంది.
కృష్ణమోహన్ దాసరి
జర్నలిస్ట్, డల్లాస్
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
For National News And Telugu News