Seven Ages Of Globalization: ప్రపంచీకరణ రథచక్రం వెనక్కేనా
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:35 AM
మూడున్నర దశాబ్దాల చరిత్రను ఒక్కమాటలో చెప్పుకోవటం కష్టం. కానీ ఆ ఒక్కమాట చుట్టూనే ఎన్నో వివాదాలూ విమర్శలూ విరామం లేకుండా చెలరేగుతూనే ఉన్నాయి. అందరూ వింటున్న పదమే...
మూడున్నర దశాబ్దాల చరిత్రను ఒక్కమాటలో చెప్పుకోవటం కష్టం. కానీ ఆ ఒక్కమాట చుట్టూనే ఎన్నో వివాదాలూ విమర్శలూ విరామం లేకుండా చెలరేగుతూనే ఉన్నాయి. అందరూ వింటున్న పదమే అది. తేలికగా అర్థమయినట్లూ అనిపిస్తుంది. అందరి అనుభవంలోనూ ఉన్నట్లూ కన్పిస్తుంది. కానీ హాస్యం వెనకాల లోతైన గాంభీర్యం దాక్కొన్నట్లుగా ఆ పదం సూచించే పరిణామం ఆషామాషీ అయినది కాదు. గ్లోబలైజేషన్‌గా మనందరమూ పిలిచే ఆ పదం 1990ల నుంచి విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినా, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ పరిణామాలన్నీ దాని కేంద్రంగానే జరుగుతూనే ఉన్నా.. ఆ పదం విస్తృతార్థంలోకి వెళ్లగలిగితే వెనుకటి యుగాలు కనపడతాయి. 1990ల్లో బలం పుంజుకుని 2000ల నుంచి రాటుతేలిన గ్లోబలైజేషన్‌తో మనకు తెలిసేది ఒక యుగం చరిత్రే. ప్రపంచం చూసిన అనేక గ్లోబలైజేషన్లలో అది ఒకటి మాత్రమే.
మన అనుభవంలోని గ్లోబలైజేషన్ ఎంతో ప్రగాఢమైంది. కాదనలేం. అన్ని సంస్కృతులనూ అది రోడ్డురోలర్‌లాగా సమం చేసేస్తోంది. అలవాట్లలో, ఆకాంక్షల్లో, కట్టూబొట్టులో, వేషభాషల్లో, విశ్వసించే విలువల్లో ఏకత దిశగా మనుషులను పరుగులు పెట్టిస్తోంది. సొంత సంస్కృతులను కోల్పోతున్న వారిలో ఒక పట్టాన అర్థంకాని అశాంతికీ, అభద్రతకూ కారణమూ అవుతోంది. ఒక మార్పునకు అనుగుణంగా మనుషులు కుదురుకునే లోపలే మరో మార్పును గ్లోబలైజేషన్ వారి నెత్తిమీదకు తీసుకువస్తోంది. ఇవ్వాళ్టి ఉద్యోగం రేపు ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఈ ఏడాది టెక్నాలజీ వచ్చే ఏడు బతికి బట్టకట్టగలదా? లేదా? అన్నది ఎవ్వరూ చెప్పలేరు. వ్యక్తులూ, కంపెనీలతో పాటు దేశాలూ ఎగుడుదిగుడులకు గురవుతున్నాయి. అందుకే డీగ్లోబలైజేషన్ కావాలంటూ దాన్ని వ్యతిరేకించే ధోరణులూ పెరుగుతున్నాయి. దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డుగోడలు కట్టాలనే వాదనలూ ఎక్కువవుతున్నాయి. మనుషుల రాకపోకలపై కట్టడులూ మొదలవుతున్నాయి. ఇప్పటి గ్లోబలైజేషన్ అర్థంకావాలంటే దీనికంటే ముందు మనుషులను ప్రభావితం చేసిన ఆరు గ్లోబలైజేషన్ల వ్యవహారాలను తెలుసుకోవాలి. మొత్తంగా సప్త ప్రపంచీకరణల మంచిచెడులను స్థూలంగా అర్థం చేసుకుంటేనే భవిష్యత్తు రూపురేఖలు బోధపడతాయి. వర్తమానంలో ఏ అడుగులు వేయాలో తెలుసుకోగలం. కొందరు గాఢంగా కోరుకుంటున్నట్లుగా ప్రపంచీకరణ రథచక్రాన్ని వెనక్కి మళ్లించటం సాధ్యమో, అసాధ్యమో తేలిపోతుంది.
భౌగోళికంగా విడివిడిగా ఉన్న సమాజాల మధ్య వస్తువులూ, భావాలూ, సాంకేతిక పరిజ్ఞానాల మార్పిడులూ, మనుషుల రాకపోకలూ చరిత్ర పొడవునా ఏదో ఒకస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. అందుకే వస్తు, భావాల మార్పిడితో, మనుషుల రాకపోకలతో జన సమూహాల మధ్య సంబంధాలు బలంగా ఏర్పడటమే గ్లోబలైజేషన్ అని స్థూలంగా చెప్పుకోవచ్చు. అయితే అది అన్ని సందర్భాల్లోనూ ప్రశాంతంగా జరగలేదు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో మొదలవ్వలేదు. యుద్ధాలు, ఆధిపత్యాలు, అణచివేతలు, కిరాతకాలతో గ్లోబలైజేషన్లు ముడిపడిపోయాయి. రక్తాలూ, కన్నీళ్లతోనే దాని చరిత్ర తడిసింది. సుదీర్ఘ దృష్టితో చూస్తే మానవ సమాజాలన్నీ కాలక్రమంలో ప్రగతిమెట్లు ఎక్కినట్లు కనపడతాయి. కానీ ప్రతి ప్రగతిమెట్టు కిందా కొందరు నలిగిపోయారు. విజేతలూ, పరాజితులూ లేకుండా గ్లోబలైజేషన్ లేదు. సప్తప్రపంచీకరణల్లో ఈ రెండు సమూహాలూ ఉన్నాయి. వేల సంవత్సరాల చరిత్రలో ప్రపంచీకరణలు అనదగిన పరిణామాలను విడివిడిగా వివరించే రచనలు బోలెడు ఉన్నాయి. వాటికి భిన్నంగా ప్రపంచీకరణను ఏడుయుగాలుగా (ద ఏజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్) వర్గీకరించి బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జఫరీ డి.శాక్స్ అనే చెప్పుకోవాలి.
ఏడు గ్లోబలైజేషన్లలో మొదటిది పాతరాతియుగం, రెండోది కొత్తరాతియుగం... మూడోది గుర్రాల యుగం. నాలుగోది సంప్రదాయ (క్లాసికల్) యుగం. అయిదోది సముద్రాన్వేషణ యుగం. ఆరోది పారిశ్రామిక యుగం. ఏడోది డిజిటల్ యుగం. పాతరాతియుగంలో మానవసమూహాలు ఆహార అన్వేషణ కోసం ఒకచోట నుంచి ఇంకోచోటికి వెళ్లటం చాలా సాధారణం. ఆ క్రమంలోనే కొత్త వాతావరణ పరిస్థితులనూ, కొత్త జంతుప్రపంచాన్నీ, కొత్త సూక్ష్మక్రిములనూ, కొత్త వైరస్‌ల లోకాన్నీ ఎదుర్కొన్నారు. వాటి ప్రభావానికీ గురయ్యారు. వారికి తారసపడ్డ నియాండర్తల్, డెనిసోవన్స్ లాంటి పురాతన మానవ జాతులు కొన్ని అంతరించిపోయాయి. కొత్తవారితో యుద్ధాలూ, కొట్లాటలూ జరిగాయి. బతికిబట్టకట్టిన వారితో క్రమేపీ సాంస్కృతిక, శారీరక సంపర్కాలూ జరిగాయి. క్రీస్తుపూర్వం 70వేల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకూ అంటే 60 వేల ఏళ్లు మనుషులు రాతి ఆయుధాలతో కొత్త ప్రాంతాలకు సంచరిస్తూనే ఉన్నారు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. మానవప్రమేయం లేకుండానే జరిగిన ఒక పరిణామం రెండో గ్లోబలైజేషన్‌కు కారణమైంది. క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాటికి మంచుయుగం ముగిసింది. వాతావరణం వేడెక్కింది. వ్యవసాయానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జంతువులను మచ్చికచేసుకోవటం మొదలైంది. ఆహార అన్వేషణ పోయి ఆహార ఉత్పత్తి మొదలైంది. స్థిరనివాసం కోసం గ్రామాలు ఏర్పడ్డాయి. శ్రమవిభజన సర్వసామాన్యమైంది. దీన్నే కొత్తరాతి యుగంగా పిలిచారు. ఇది ఏడువేల ఏళ్లు (క్రీస్తుపూర్వం 10,000 నుంచి 3,000 వరకూ) కొనసాగింది. సుదూరప్రాంతాలతో వ్యాపారాలు కూడా మొదలయ్యాయి. గ్రామాల మధ్య వస్తుమార్పిడులూ సాధారణమయ్యాయి. వ్యవసాయ గ్రామాలు విస్తరిస్తున్న కొద్దీ ఆదిమతెగలతో యుద్ధాలూ మొదలయ్యాయి. మార్పును అంగీకరించకుండా పాతజీవితాన్ని అంటిపెట్టుకున్న తెగలు ఆ యుద్ధాల్లో అంతరించటమో, దూర ప్రాంతాలకు తరలివెళ్లటమో జరిగింది. కొత్త జీవితాన్ని అంగీకరించిన తెగలు వ్యవసాయాన్ని నేర్చుకుని గ్రామాల్లో కుదురుకున్నాయి.
రాగి, కాంస్యం లాంటి లోహాల వాడకంతో సమాజం కొత్త మలుపు తిరిగిందని మనందరమూ భావిస్తాం. కానీ వాటి కంటే గుర్రాలను మచ్చికచేసుకోవటంతోనే ప్రపంచీకరణ మూడో యుగం మొదలైందని శాక్స్ కొత్త ప్రతిపాదన చేశారు. ఆ అశ్వయుగం క్రీస్తు పూర్వం 3000–1000 వరకూ అంటే రెండువేల ఏళ్లు కొనసాగింది. దీని అర్థం తదనంతర కాలంలో గుర్రాల పాత్ర తగ్గిందని కాదు. వేరే ఇతర పరిణామాలకు ప్రాధాన్యం లభించింది. అశ్వయుగంతో రథాలు వాడుకలోకి వచ్చాయి. గుర్రాలపై సవారీ మొదలైంది. సుదూర ప్రాంతాల మధ్య సమాచార సౌకర్యాలు మెరుగుపడ్డాయి. నేలను దున్నటంలో గుర్రాలు కీలకపాత్రను పోషించాయి. ఇక గుర్రాల ప్రవేశంతో యుద్ధరీతులే మారిపోయాయి. తెగల పెద్దల పెద్దరికం స్థానంలో రాజులు వచ్చి రాజ్యాలు ఏర్పడటంలో గుర్రాలు కీలకపాత్రను పోషించాయి. మంచి గుర్రాలు అందుబాటులో ఉన్న రాజ్యాలు ఇతర ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని సంపాదించాయి. గుర్రాలతోనే గ్రామాలపై ప్రభుత్వాలు అదుపుఆజ్ఞలను సాధించగలిగాయి.
క్రీస్తుపూర్వం 1000 ఏళ్ల నుంచి క్రీస్తుశకం 1500 దాకా కొనసాగిన సంప్రదాయ యుగంలో రాజ్యాలూ సామ్రాజ్యాలూ విజృంభించాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రబలంగా ఉన్న మతాలన్నీ ఈ యుగంలో పుట్టి, బలపడి, విస్తరించినవే. తత్వశాస్త్రాలు, రాజకీయ సిద్ధాంతాలు అప్పుడే తలెత్తాయి. రాజరికాలు నిలదొక్కుకునేందుకు అవి ఎంతగానో తోడ్పడ్డాయి. రాజులు దైవాంశసంభూతులనే భావాలకు ప్రాచుర్యం అలాగే వచ్చింది. సామ్రాజ్యాలతో విడివిడి సమాజాల మధ్య సంబంధాలు బలపడి సంస్కృతులు విపరీతంగా ప్రభావితం అయ్యాయి. మధ్యప్రాచ్యంలో పుట్టిన క్రైస్తవం యూరప్ అంతటా విస్తరించటమూ అందులో భాగమే. ఇస్లాం ఆసియా, ఆఫ్రికాలకు శరవేగంగా పాకింది. బౌద్ధం భారత్‌ను దాటి తూర్పు, ఆగ్నేయాసియాలను విపరీతంగా ప్రభావితం చేసింది. సముద్రయాన యుగంలో (1500–1800) యూరప్ దేశాలు అమెరికా ఖండాన్ని కనుగొనటమే కాదు ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధిపత్యాన్ని సాధించాయి. బానిసలుగా లక్షలాది ఆఫ్రికన్లను అమెరికాకు తరలించారు. ఖండాతర యుద్ధాలు మొదలయ్యాయి. యూరోపియన్లు అంటించిన జబ్బులతో, చేసిన యుద్ధాలతో అమెరికా ఖండంలో స్థానికజాతులన్నీ అంతర్ధానమైపోయాయి. బలవంతపు వ్యాపారలావాదేవీలు అన్నిచోట్లా మొదలయ్యాయి. చైనా, భారత్ లాంటి సుదీర్ఘ నాగరికత గల దేశాల ప్రాబల్యం క్షీణించింది. తుపాకీ, మరఫిరంగులు, శతఘ్నుల ధాటికి ఆసియా, ఆఫ్రికాలు కకావికలయ్యాయి. పారిశ్రామిక యుగంతో (1800–2000) ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. బొగ్గు వినియోగంతో మొదలైన పారిశ్రామిక విప్లవం ఆవిరియంత్రంతో వడివడిగా అడుగులు వేసి.. మోటారు వాహనాలు, కరెంటు, రైళ్లు, విమానాలు, టెలిఫోన్లు, అత్యాధునిక యుద్ధ ఆయుధాల వినియోగంతో ప్రపంచ చిత్రాన్నే మార్చివేసింది. రెండు వందల ఏళ్ల చరిత్రలో రెండు దేశాలకు (బ్రిటన్, అమెరికా) అది ప్రపంచ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తాయి. వలసపాలనలు అంతమయ్యాయి. ఆ రెండు వందల ఏళ్లలోనే ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. దేశాల మధ్య అసమానతలు గతంలో ఎన్నడూ లేనంతగా తలెత్తాయి. పర్యావరణ విధ్వంసమూ పతాకస్థాయికి చేరింది.
2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఉన్నది డిజటల్ యుగం. కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, మొబైల్స్, కృత్రిమమేధతో దేశాల మధ్యా, దేశాల లోపలా సంబంధాలు, పరస్పర ఆధారితాలు పెరిగిపోయాయి. బొగ్గు స్థానంలో సౌర, పవన విద్యుత్తు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏ దేశమూ మరో దేశంపై ఆధారపడకుండా మనగలిగే పరిస్థితి వచ్చేసింది. ఏకదేశ ఆధిపత్యానికీ కాలం చెల్లుతోంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల మీద గుత్తాధిపత్యం కొనసాగించే పరిస్థితి కనపడటం లేదు. అమెరికాను అన్నింటా సవాల్ చేస్తున్న చైనా పురోగతే దీనికి నిదర్శనం. ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించిన అమెరికా, బ్రిటన్‌లకు ఉన్న అనుకూల పరిస్థితులు చైనాకు ఎన్నడూ లేవు. దోపిడీ చేయటానికి బ్రిటన్‌లాగా వలసరాజ్యాల్లేవు. అమెరికాకు లభించిన ఆఫ్రికా బానిసల శ్రమ చైనాకు లేదు. విలువైన వనరులున్న సువిశాల భూభాగాన్ని స్థానిక జాతుల నుంచి అమెరికాలాగా దక్కించుకునే అవకాశమూ రాలేదు. అయినా చైనా అమెరికాను అన్నింటా దాటిపోయే పరిస్థితే కనిపిస్తోంది.
ఏడో ప్రపంచీకరణ యుగం అంతులేని సంపదను సృష్టిస్తోంది. అదే సమయంలో ఆదాయంలో తీవ్ర అసమానతలు, పర్యావరణ విధ్వంసం, అణ్వస్త్ర యుద్ధభూతం అనేవి తీవ్ర అస్థిరతకు కారణం అవుతున్నాయి. ప్రపంచాన్ని ప్రమాదం అంచున నిలబెడుతున్నాయి. వీటిని పరిష్కరించగలిగిన స్థాయిలో సామాజిక, వైజ్ఞానిక అవగాహనా సంపద మనకుంది. ధనిక వర్గాల మితిమీరిన స్వార్థం, లాభకాంక్షలు ఆ సంపదను ఉపేక్షిస్తే భవిష్యత్తు అగమ్యగోచరమే! ప్రపంచీకరణ రథాన్ని వెనక్కితిప్పలేం. కానీ నిర్లక్ష్యం వహించి, యథాతథస్థితిని కొనసాగిస్తే దాని రథచక్రాల కింద అందరమూ నలిగిపోయే ప్రమాదాన్నీ కొట్టేయలేం!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News