MGNREGA Rural Employment Guarantee: నరేగా నడ్డి విరిగినట్టేనా
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:57 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత్ భారత్–రోజ్‌గార్ & అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (VB–G RAM G)ను తీసుకురావడంపై దేశవ్యాప్త చర్చ...
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత్ భారత్–రోజ్‌గార్ & అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (VB–G RAM G)ను తీసుకురావడంపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఈ మార్పు వల్ల తెలుగు రాష్ట్రాలు ఏమి కోల్పోతాయన్న మూల ప్రశ్నను ఇంకా ఎవరూ తగినంతగా పట్టించుకున్నట్టు లేదు. అసలు విషయానికి వెళ్లే ముందు, నరేగాలోను, కొత్త చట్టంలోను ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం.
నరేగా చట్టం ‘పని హక్కు’ అనే విప్లవాత్మక సూత్రంపై నిర్మితమైంది. దీన్ని అనుసరించి– ఏ గ్రామీణ కుటుంబమైనా పనిని డిమాండ్ చేయగలదు; నిర్ణీత గడువులోపు పని కల్పించాల్సిన చట్టబద్ధ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి, సకాలంలో వేతన చెల్లింపులు, బాధ్యతలు ఉల్లంఘించినప్పుడు చట్టపరమైన పరిష్కారాలు... ఇవన్నీ నరేగా మూల ఆధారాలు.
అయితే, 2005 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ‘VB–G RAM G’ని తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టంలోని కీలకాంశాలను పరిశీలిస్తే– 1) కేంద్రం ఉపాధిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతామని చెబుతోంది. చట్టంలో ‘హామీ’ అనే పదం 92సార్లు ఉన్నా, నరేగా మాదిరి చట్టపరమైన హక్కుగా ఉపాధి లభించే హామీ మాత్రం లేదు. ఉపాధి ప్రాప్తి కార్మికుల డిమాండ్‌పై కాకుండా పరిపాలనా నిర్ణయాలపై ఆధారపడుతుంది. హామీ హక్కుగా లేకపోతే, పని కల్పించడమో నిలిపివేయడమో అధికార యంత్రాంగ విచక్షణపై ఆధారపడే ప్రమాదం పెరుగుతుంది. 2) నరేగా లాగా దేశమంతటా సార్వత్రిక అమలు అనే హామీ ఈ కొత్త చట్టంలో లేదు. కార్యక్రమం ఎక్కడ అమలవుతుందో కేంద్రం నోటిఫై చేస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది కొన్ని జిల్లాలు/ మండలాలు/ ప్రాంతాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. 3) ఈ కొత్త చట్టం ప్రకారం క్షేత్రస్థాయిలో డిమాండ్ ఎంత ఉన్నా, కేటాయించిన బడ్జెట్ అయిపోతే అదనపు డిమాండ్‌కు స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉండదు. 4) సాంకేతికత పరిపాలనకు సహాయక సాధనంగా కాకుండా, పని–వేతనాలకు ముందస్తు షరతుగా చట్టంలోనే నిక్షిప్తమవుతుంది. 5) ‘వ్యవసాయ పీక్ సీజన్’ పేరుతో ఉపాధిని నిలిపివేయడం/తాత్కాలిక విరామం అనే భావనను చట్టం తెస్తోంది (అమలులో ఇది 60 రోజుల విరామంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన ఉంది). 6) నిధుల భాగస్వామ్యంలో రాష్ట్రాలపై భారం పెరుగుతుంది. నరేగాలోని 90:10 నిష్పత్తి నుంచి 60:40కి మారడం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా పెంచుతుంది.
ఈ మార్పులన్నీ కలిపి చూస్తే, పనిని హక్కుగా డిమాండ్ చేసే ఉపాధి హామీ వ్యవస్థ ఇక మీదట ఒక పాలనాపరమైన కేటాయింపుల వ్యవస్థగా మారుతుంది. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా పడనున్నది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు ప్రతి పదిమందిలో ఆరుగురు వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై జీవనోపాధి కోసం ఆధారపడుతున్నారు. అందువల్ల గ్రామీణ ఉపాధి హామీ ఈ రాష్ట్రాల్లో ఆర్థికంగా చాలా ముఖ్యమైన వ్యవస్థ. వ్యవసాయ ఆఫ్–సీజన్‌లో వ్యవసాయ కార్మికులే ఉపాధి హామీ కార్మికులుగా మారడం ఇక్కడ సాధారణం.
వాతావరణ వైవిధ్యం, యాంత్రీకరణ, అసమాన నీటిపారుదల వంటి కారణాలతో వ్యవసాయ ఉపాధి మరింత అనిశ్చితంగా మారుతోంది. మరోవైపు వ్యవసాయేతర ఉపాధి ఇంకా బలంగా నిలబడలేదు. ఈ పరిస్థితుల్లో నరేగా కేవలం సంక్షేమ పథకం కాదు; ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపే మూలస్తంభం.
2024–25 లెక్కల ప్రకారం, నరేగా కింద ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 1.1 కోట్ల మంది కార్మికులు నమోదు కాగా, తెలంగాణలో కోటి మందికి పైగా నమోదయ్యారు. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం పని– దినాల్లో 60శాతం కంటే ఎక్కువ మహిళలవే. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే స్థానికంగా ఆదాయం పొందేందుకు మహిళలకు నరేగా కీలక అవకాశం ఇచ్చింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనాభా వాటాతో పోలిస్తే ఉపాధి హామీలో అధిక ప్రాతినిధ్యం కలిగి ఉంది. 2024–25లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1.23 లక్షల మంది వికలాంగులు నరేగా ద్వారా ఉపాధి పొందారు. గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వేతనాల రూపంలో సుమారు రూ.41,000 కోట్లు కార్మికులకు చేరాయి. మెటీరియల్ పనులు సుమారు రూ.25,000 కోట్లు విలువైనవిగా కొనసాగాయి. రోడ్లు, సచివాలయ భవనాలు వంటి నిర్మాణాలకు దోహదపడ్డాయి.
ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి హామీ లేని, కేటాయింపు మీద ఆధారపడిన కొత్త చట్టం రావడం వల్ల స్పష్టమైన పరిణామాలు ఉంటాయి: 1) కార్మికుల ఆదాయ నిశ్చయత తగ్గుతుంది. మహిళలకు స్థానికంగా అనువైన ఉపాధి తగ్గుతుంది; ఆదివాసీలకు వేసవిలో ప్రధాన జీవనోపాధి బలహీనమవుతుంది; ఎస్సీ/ఎస్టీ కార్మికుల కొనుగోలు శక్తి తగ్గుతుంది; వృద్ధులు, వికలాంగులకు అందుబాటులో ఉన్న పని అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం ఉంది. చట్టపరమైన హామీ లేకపోతే, ఉపాధి ‘హక్కు’ నుంచి ప్రభుత్వం యొక్క ‘విచక్షణ’గా మారుతుంది. 2) గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కోల్పోతుంది. నరేగా వేతనాలు నేరుగా గ్రామీణ మార్కెట్లలోకి ప్రవహించి వినియోగాన్ని నిలబెట్టాయి. కోవిడ్ వంటి షాక్‌ల సమయంలో అవే పెద్ద మద్దతయ్యాయి. ఇదిలేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత పెళుసుగా మారుతుంది. 3) రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 30,000 మంది సిబ్బంది (ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్, టెక్నికల్ సిబ్బంది, MIS సిబ్బంది) నరేగాతో అనుసంధానమై ఉన్నారు. కార్మికులకు పనులు/వేతనాలు సక్రమంగా అందేందుకు వీరే సంస్థాగత వెన్నెముక. కొత్త చట్టం వీరి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతుంది.
కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై అదనపు ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. రెండు రాష్ట్రాలు ఇప్పటికే రుణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 60:40 వ్యయ– భాగస్వామ్య నియమం రాష్ట్రాలపై భారీ భారం పెడుతుంది.
జాతీయ నరేగా బడ్జెట్‌లో దాదాపు 15 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఖర్చవుతోంది. 2024–25లో తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి హామీ కోసం సుమారు రూ.12,500 కోట్లు ఖర్చయ్యాయి; ఇందులో రాష్ట్రాల వాటా కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే. కొత్త చట్టం ప్రకారం ఉపాధి 2024–25 స్థాయిలోనే కొనసాగితే, రాష్ట్రాల వాటా సుమారు రూ.3,750 కోట్లకు పెరుగుతుంది.
అలానే కవరేజ్, స్కేల్, ఉపాధి వ్యవధి వంటి కీలక అంశాలపై రాష్ట్రాలకు ఎలాంటి స్వాతంత్రం లేదు. కానీ వాటిపై అదనపు భారం మోపడం అన్యాయం. నరేగా లాగా గ్రామీణ డిమాండ్‌ను బలోపేతం చేసే ప్రత్యక్ష వేతన ప్రవాహం ఈ చట్రంలో సమానంగా ఉంటుందన్న హామీ లేదు. కాబట్టి, 60:40 వ్యయ–భాగస్వామ్యంతో ‘హామీ’ని బలహీనపరచడం ఆర్థిక ఒత్తిడిని తగ్గించదు, మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది.
ఈ ప్రమాదకర పరిస్థితుల్లో మౌనానికి అవకాశం లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థలు, అలాగే నరేగా తొలి దశలో ముసాయిదా/ అమలులో కీలక పాత్ర పోషించిన మాజీ అధికారులు, నిర్వాహకులను భాగస్వాములుగా నిర్మాణాత్మక సంప్రదింపులను ఏర్పాటు చేయాలి. వారి సలహాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. కొత్త చట్టంలో పని హక్కుకు వ్యతిరేకంగా ఉన్న అంశాల తొలగింపునకు ఒత్తిడి తేవడం కొనసాగిస్తూనే, తెలుగు రాష్ట్రాల అనుభవాన్ని నమోదు చేయడం, రాష్ట్ర–నిర్దిష్ట నష్టాలను అంచనా వేయడం, కేంద్రం ముందు ఆధారాలతో కూడిన సిఫార్సులను ఉంచడం ఈ ప్రక్రియ లక్ష్యం కావాలి.
‘వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు అజీవిక మిషన్ (గ్రామీణ్)’ చట్టం ఎలాంటి మినహాయింపులు లేకుండా రెండు రాష్ట్రాలలో పూర్తిగా అమలు జరిగేటట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
వ్యవసాయంపై ఆధారపడిన తెలుగు రాష్ట్రాలకు ఇది కేవలం విధానపరమైన ప్రాధాన్యం కాదు. ఇది జీవనోపాధిని, కార్మిక మార్కెట్లను, అలాగే కష్టపడి నిర్మించిన పాలనా నిర్మాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఉపాధి హామీ ఒక సంక్షేమ పథకం కాదు. గ్రామీణ భారతదేశంలో సామాజిక న్యాయాన్ని చట్టబద్ధంగా అమలు చేసిన అరుదైన హామీ అది.
చక్రధర్ బుద్ధ
సీనియర్ పరిశోధకులు
లిబ్‌టెక్ ఇండియా
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News