Share News

Indian Elections: మన ప్రజాస్వామ్య కురుక్షేత్రం ధర్మక్షేత్రమేనా

ABN , Publish Date - Sep 26 , 2025 | 02:40 AM

భారతదేశ ఎన్నికలు స్వేచ్ఛాయుతమూ, న్యాయబద్ధమైనవేనా? పాలక పక్షం పాల్పడుతున్న ఎన్నికల అక్రమాలు ఓటర్‌ జాబితాలను రూపొందించే దశ నుంచే ప్రారంభమవుతున్నాయని, ఇందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తోడ్పడుతోందని ఆరోపిస్తూ ఆ రాజ్యాంగ సంస్థకు...

Indian Elections: మన ప్రజాస్వామ్య కురుక్షేత్రం ధర్మక్షేత్రమేనా

భారతదేశ ఎన్నికలు స్వేచ్ఛాయుతమూ, న్యాయబద్ధమైనవేనా? పాలక పక్షం పాల్పడుతున్న ఎన్నికల అక్రమాలు ఓటర్‌ జాబితాలను రూపొందించే దశ నుంచే ప్రారంభమవుతున్నాయని, ఇందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తోడ్పడుతోందని ఆరోపిస్తూ ఆ రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చేస్తున్న రాజీలేని పోరాటంతో ప్రారంభమైన చర్చ అది. ప్రశస్త సేవలు అందిస్తున్న ఒక ప్రజాస్వామిక సంస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకే కాంగ్రెస్‌ నాయకుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మోదీ ప్రభుత్వ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన ప్రశ్నలు సంధించేందుకు సాహసించిన ఏకైక నాయకుడు రాహుల్‌ అని ఆయన విధేయులు వాదిస్తున్నారు. ఈ వాదప్రతివాదాల రణగొణ ధ్వనిలో మన మౌలిక ప్రశ్న– భారతదేశంలో ఎన్నికలు నిజంగా స్వేచ్ఛాయుతంగా, పక్షపాతరహితంగా జరుగుతున్నాయా? అన్నదానిపై నిష్పాక్షిక సమాధానాన్ని కోల్పోయింది.

ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను: భారతదేశంలో ఎన్నికలు చాలావరకు స్వేచ్ఛాయుతమే కానీ అవి తప్పకుండా నిష్పాక్షికంగా జరుగుతున్నాయని చెప్పలేము. జవహర్‌లాల్‌ నెహ్రూ (అవును, ఇప్పుడు విమర్శలు అవహేళనలకు గురవుతున్న ఆదర్శవాది నెహ్రూజీ) స్వాతంత్ర్యానంతరం సమస్త భారత ప్రజలకు వయోజన ఓటు హక్కు లభింపచేయడంలో ప్రముఖపాత్ర వహించారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించడం చరిత్రలోనే అతి పెద్ద జూదం అని రాజ్యాంగ సభలో చాలామంది కొట్టివేశారు. భారత గణతంత్ర రాజ్యం మరింతగా విచ్ఛిన్నమయ్యేందుకే అది దారి తీస్తుందని కూడా వారు హెచ్చరించారు. 18 సార్వత్రక ఎన్నికల అనంతరం ఎన్నికల ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధత ‘జూదం’ కాదని, భవిష్యత్‌ను సముజ్వలంగా నిర్మించేందుకు ఉద్దేశించిన ప్రజాస్వామిక పెట్టుబడి అని, అది సమున్నత చరిత్రాత్మక లబ్ధిని సమకూర్చిందని గట్టిగా వాదించే సౌలభ్యాన్ని నెహ్రూకు చరిత్ర సమకూర్చింది.


1952లో ప్రప్రథమ సార్వత్రక ఎన్నికలు ఆరు నెలల పాటు జరిగాయి. వాతావరణ సంబంధమైన, ఏర్పాట్ల పరమైన సవాళ్ల కారణంగా ఆ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. దేశవ్యాప్తంగా 1.96 లక్షల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో 27,527ను మహిళలకు రిజర్వ్‌ చేశారు. ఆనాడు దేశంలో 17.32 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. వారిలో 45 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2024లో 18వ సార్వత్రక ఎన్నికల నాటికి దేశంలో అర్హులైన ఓటర్లు 96.8 కోట్ల మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్‌ కేంద్రాల నేర్పాటు చేశారు. అర్హులైన ఓటర్లలో 64.6 కోట్ల మంది ఓటర్లు అంటే, 65.9 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కిరాయి గూండాలు పోలింగ్‌ బూత్‌లను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజులు, దేశంలోని కొన్ని ప్రాంతాలలో బోగస్‌ ఓటింగ్‌ అనేది ఒక పరిపాటిగా ఉన్న రోజులు కూడా గుర్తు చేసుకుందాం. ఒక పోలింగ్ బూత్‌ను ‘స్వాధీనం’ చేసుకున్న ఘటనకు నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. 1990లో మహారాష్ట్ర విధానసభ ఎన్నికలలో ముంబైలోని ఉమేర్‌ఖాది ప్రాంతంలో ఆ ఘటన చోటుచేసుకుంది. మతపరమైన భావోద్రేకాలు ప్రబలంగా ఉన్న పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరిగాయి. ముంబైలోని ఒక నియోజకవర్గంలో శివసేన, ముస్లింలీగ్‌ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇరుపక్షాలవారు పోలీసులను లెక్కచేయకుండా పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకుని బ్యాలెట్‌ పత్రాలపై తమ అభ్యర్థికి అనుకూలంగా ముద్రలు వేశారు. అప్పటికి ఇంకా ఈవీఎమ్‌లు లేవు. టీవీ చానెల్స్‌ ముందునాటి రోజులవి.

ఓటర్లు ఇప్పుడు గతంలో కంటే చాలా చైతన్యశీలురుగా ఉన్నారు. తమ ప్రజాస్వామ్య హక్కుల గురించి వారికి మెరుగైన అవగాహన ఉన్నది. గత కాలంలో జాట్‌ దబాంగ్‌ (శక్తిమంతులు)లు సృష్టించిన దౌర్జన్యపూరిత పరిస్థితుల కారణంగా తమ తమ అవ్వలు, తాతలు, తల్లిదండ్రులు ఓటు వేయలేకపోయేవారని హర్యానాలో నా పర్యటనల సందర్భంగా గ్రామీణ దళితులు పలువురు వివరించారు. అణగారిన కులాల వారిలో ప్రజాస్వామిక చైతన్యం బాగా ఉన్న రోజులివి. ప్రస్తుత కాలంలో అందునా 24 గంటల న్యూస్‌ చానెల్స్‌ యుగంలో అటువంటి ఘటనలు జరగడం అసంభవమే. అనేక అసమానతలు ప్రబలంగా ఉన్న మన సమాజంలో ఓటింగ్‌ రోజు ఒక విధంగా అరుదైన పౌర సమానత్వం వర్ధిల్లే శుభదినంగా ఉన్నది. ఆ రోజున జామ్‌నగర్‌ ఆయిల్‌ రిఫైనరీ కార్మికుడికి, ముకేశ్‌ అంబానీకి ఒకే విధమైన ఓటింగ్‌ హక్కు ఉంటుంది. ముంబైలోని ధారావి మురికివాడ వాసి కూడా గౌతమ్‌ అదానీలా ఠీవిగా పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశిస్తాడు.


భారత ఎన్నికలు చాలా వరకు స్వేచ్ఛాయుతమైనవే అయినప్పటికీ అవి తక్కువ నిష్పాక్షికతతో జరుగుతున్నాయి. సమానవకాశాలు కల్పించడం అనేది ఎన్నికల ప్రజాస్వామ్య ప్రాథమిక విశ్వాసం. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి విజయావకాశాలు సమానంగా ఉండాలి. అయితే ఇప్పుడు అసమ పోటీలు మాత్రమే జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి తన ప్రత్యర్థుల కంటే అనేక ఎక్కువ అనుకూలతలు కలిగి ఉంటున్నాడు. అపార ధన బలం, సదా అందుబాటులో ఉండే ప్రభుత్వ వ్యవస్థల కారణంగా అధికార పార్టీ అభ్యర్థికి అనేక అనుకూలతలు సమకూరుతున్నాయి. ధన బలం అనేది మొదటి నుంచీ ఉన్నది. కాంగ్రెస్‌ ఆధిపత్య పార్టీగా ఉన్న కాలంలో ఆ పార్టీకి అపార ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేవి. కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అటువంటి అవకాశాలు ఉండేవి కావు. ధనబలమే గెలుపోటములలో నిర్ణయాత్మకశక్తి కానప్పటికీ డబ్బు అపరిమితంగా ఉన్న పార్టీలకు చెప్పుకోదగ్గ విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి.

వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఆర్థిక వనరులు ఏదో ఒక విధంగా అన్ని పార్టీలకు లభిస్తాయి. అయితే ప్రభుత్వ వ్యవస్థలను ఎలా ‘ఆయుధీకరణ’ చేస్తున్నారన్నదే గెలుపోటములను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఏజెన్సీలను నిస్సిగ్గుగా దుర్వినియోగపరిచి అధికారపక్షం అభ్యర్థులు పోటీలో ముందుండేలా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, స్థానిక పోలీసుల సహకారంతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులు పూర్తిగా అందుబాటులో ఉండటం అధికారంలో ఉన్నవారికి ఒక ప్రధాన అనుకూలత. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార పార్టీ పన్ను చెల్లింపుదారుల సొమ్మును సంక్షేమ ప్రయోజనాల పేరిట సంభావ్య అనుకూల ఓటర్లకు పంపిణీ చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘రేవడి’ (ఉచితాలు) రాజకీయాలపై చర్చ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిత్రమేమిటంటే ‘ఓట్లకు నోట్లు’ ఆటలో ఇప్పుడు బీజేపీయే అగ్రగామిగా ఉన్నది. మహారాష్ట్రలో ‘లడ్కీబహిన్‌’ పథకం లేదా బిహార్‌లో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన కింద మహిళలకు పదివేల రూపాయలు ఇవ్వడం మొదలైనవి అందుకు నిదర్శనాలు. మీడియా కథనాలను ప్రభావితం చేసేందుకు, నియంత్రించేందుకు ప్రభుత్వాధికారాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో భాగంగా వాణిజ్య ప్రకటనలతో మీడియా సంస్థలకు విశేష ఆర్థిక లబ్ధి సమకూరుస్తున్నారు. దీనివల్ల ప్రతిపక్షాలకు మీడియాలో న్యాయంగా లభించవలసిన ప్రాధాన్యం లభించడం లేదు.


భారత ఎన్నికల సంఘం విషయానికి వద్దాం. ఎన్నికల సమయంలో అపరిమిత అధికారాలు చెలాయించగల ఈ రాజ్యాంగ సంస్థ అన్ని పార్టీలకు సమానవకాశాలు లభించకపోవడంపై దృష్టి పెట్టేందుకు నిరాకరిస్తోంది. 2024 సార్వత్రక ఎన్నికలకు ముందు ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్‌ పార్టీకి 1990ల నాటి వ్యవహారాలకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేసింది. ఈసీఐ మౌనంగా ఉండిపోయింది. ఎన్నికల ప్రచారంలో మతపరమైన భావోద్రేకాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినవారిపై చర్యలు చేపట్టలేదు. పెయిడ్ న్యూస్‌ అనే దురాచారం బాగా ప్రబలిపోయింది. ఇక ఇప్పుడు ఓటర్‌ జాబితాలలో మార్పులు, చేర్పుల్లో అవకతవకల గురించి వార్తలు ముమ్మరంగా వెలువడుతున్నాయి. వీటికి ప్రతిస్పందనగా ఈసీఐ ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది. తొలుత ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్న బిహార్‌లోనే దానిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకలో ఓటర్‌ జాబితాలలో మోసాలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలయినప్పటికీ పోలీసు దర్యాప్తునకు సహకరించేందుకు ఈసీఐ నిరాకరిస్తోంది. ఎన్నికల సంఘం అధికారపక్షం ఒత్తిళ్లకు లొంగకుండా సక్రమంగా వ్యవహరించడమే కాకుండా, తన విధ్యుక్త ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నట్టు కనిపించడం కూడా నిష్పాక్షిక ఎన్నికలకు చాలా ముఖ్యం. తటస్థ మధ్యవర్తిగా ఉండవలసిన రాజ్యాంగ సంస్థ ఇప్పుడు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈసీఐ వైఖరి భారత ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.

తాజా కలం: భారతదేశ ప్రప్రథమ ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ జీవితకథ ఆధారంగా ఒక బయోపిక్‌ను నిర్మించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సంకల్పించింది. గణితశాస్త్రవేత్తగా శిక్షణ పొంది, ఐసిఎస్‌ అధికారి అయిన విద్వజ్ఞుడు సుకుమార్‌ సేన్‌. ఆధునిక భారత ప్రజాస్వామ్య నిర్మాతగా ఆయన వారసత్వం సమున్నతమైనది. నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించే ఆయన బయోపిక్‌ విడుదల అయినప్పుడు ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఆయన సహచర ఎన్నికల కమిషనర్లు, ఈసీఐ ఇతర ఉన్నతాధికారులు తప్పక చూస్తారని, చూడాలని ఆశిస్తున్నాను. సుకుమార్‌ సేన్‌ నుంచి వారు స్ఫూర్తి పొందాలి. మానవ దేహంలోని ఒక కీలక భాగం– వెన్నెముక–ను ఈసీఐ పునః పొందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

Updated Date - Sep 26 , 2025 | 02:40 AM