Share News

Artificial Intelligence: కృత్రిమ మేధతో ముప్పు తప్పదా

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:49 AM

మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సు(ఏఐ)తోనే పోటీ అన్నది నేటి మాట. మనిషి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న ఏఐ ఇప్పుడు మనిషి ఉనికికే సవాలు విసురుతోంది. ఒకవైపు కృత్రిమమేధతో మానవ సామర్థ్యాలు...

Artificial Intelligence: కృత్రిమ మేధతో ముప్పు తప్పదా

మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సు(ఏఐ)తోనే పోటీ అన్నది నేటి మాట. మనిషి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న ఏఐ ఇప్పుడు మనిషి ఉనికికే సవాలు విసురుతోంది. ఒకవైపు కృత్రిమమేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటాయనే అభిప్రాయాలు, మరోవైపు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘కృత్రిమమేధ అణుబాంబు కంటే ప్రమాదకరం, ఆ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అంటే ఇంకాస్త త్వరగా మానవాళి తన వినాశనానికి ముహూర్తం పెట్టుకోవడమే’ అంటూ ప్రముఖ అంతరిక్ష పరిశోధకులు స్టీఫెన్‍ హాకింగ్స్ గతంలోనే హెచ్చరించారు. కృత్రిమమేధ ఇప్పటికే అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‍ కార్ల విషయంలోనూ అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతోనో, ఇంకేదో కారణంతోనో సదరు వాహనాలు కలిగించే ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరు తీసుకోవాలన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. తమ లోపాల్ని తాము తెలుసుకునే యంత్రాలు వచ్చేదాకా ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరకదంటున్నారు నిపుణులు. కృత్రిమమేధతో రూపొందించిన రోబోలతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం మరింతగా పెరుగుతుందని ఐరాస ఇప్పటికే హెచ్చరించింది. కృత్రిమ మేధ, ఆటోమేషన్‍ వల్ల మన దేశంలో 54శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ‘వరల్డ్ ఎకనామిక్‍ ఫోరం’ నివేదిక హెచ్చరించింది. ఏఐను నియంత్రించకుంటే వచ్చే రెండేళ్లలో మానవాళి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టెక్నాలజీ రంగ నిపుణులు. ఒక సమూహంగా మానవాళి ప్రాణాలు తీయగల సైబర్, బయోలాజికల్ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉందంటున్నారు. కృత్రిమమేధను అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించకుంటే, ఆ తరువాత మానవుడు నియంత్రించలేని అత్యంత శక్తిమంతమైన వ్యవస్థ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో ఏఐ కారణంగా మానవాళికి పెనుముప్పు తప్పదన్నది నిపుణుల ఆందోళన.

ఎస్‌. అబ్దుల్‌ఖాలిక్

ఈ వార్తలు కూడా చదవండి:

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Updated Date - Nov 18 , 2025 | 07:05 AM