Indira Gandhi Indian Politics: సమరాంగణ సూత్రధారి ఇందిర
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:04 AM
ఇరవయ్యవ శతాబ్ది నాటి దూరదృష్టి గల పాలకుల్లో నెహ్రూ ఒకరు. వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడం ద్వారానే త్వరితంగా దేశ స్వాతంత్ర్యం, సమగ్రతలను కాపాడుకోవడం, పేదరికాన్ని నిర్మూలించడం..
ఇరవయ్యవ శతాబ్ది నాటి దూరదృష్టి గల పాలకుల్లో నెహ్రూ ఒకరు. వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడం ద్వారానే త్వరితంగా దేశ స్వాతంత్ర్యం, సమగ్రతలను కాపాడుకోవడం, పేదరికాన్ని నిర్మూలించడం, సామాజిక సంక్షేమం సాధించడం వీలవుతుందని ఆయన గట్టిగా విశ్వసించారు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలోనే ఆయన ఆలోచనా స్థాయి అర్థమవుతుంది. అందుకే ఆయన పాలనా కాలంలో అన్ని రంగాల్లోనూ సత్ఫలితాలు గణనీయంగా సంభవించాయి.
ఇక, 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన నాటికి దేశంలో ఆర్థిక మాంద్యం, పారిశ్రామిక ఉత్పత్తుల పతనం, ఎగుమతులు తగ్గడం, ఆహారధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డెఫిసిట్ పెరగడం, విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962, 1965నాటి యుద్ధాలు, పాకిస్థాన్– చైనా కూటమి ఏర్పాటులో సైన్యంపై ఖర్చు పెంచడం వంటివీ జరిగాయి. వర్షాలు లేక కరువు ఏర్పడింది. ధరలు పెరిగాయి. పాలనా ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు. అయినా, యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి, ప్రజలకు పంచి, వారి ప్రాణాలు కాపాడగలిగారు.
అందరు నాయకుల్లో ఉన్నట్టుగానే ఇందిరాగాంధీలోనూ కొన్ని బలమైన అంశాలు, కొన్ని బలహీన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు: ఎందరి నుంచి సలహాలను ఆహ్వానించినా, తన స్వీయ నిర్ణయానికే ప్రాధాన్యమిచ్చే గుణం ఆమెది. ఇది ఆమె రాజకీయ చతురత. అంతేకాదు, ఎలాంటి నిర్ణయాన్నైనా ధైర్యంగా, త్వరితంగా, సరైన సమయంలో తీసుకోవడం ఆమెకు అలవాటు. ఆమె తీసుకున్న చాలా నిర్ణయాల్లో మనం దీన్ని గమనించవచ్చు. ‘1969లో కాంగ్రెస్ చీలినప్పుడైనా కావచ్చు, 1971 నాటి బంగ్లాదేశ్ సందర్భమైనా కావచ్చు. అదే ఏడాది భారత్‌ను బెదిరించడానికి బంగాళాఖాతంలోకి అమెరికా పంపిన సెవెంత్ ఫ్లీట్‌ను ఎదురించడంలోనైనా కావచ్చు’. 1966లో ‘పంజాబీ సుబా’ను సృష్టించారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమర్జెన్సీ పొడిగింపుతో నిరంకుశంగా పాలించే అవకాశమున్నా, ప్రజాస్వామ్య విలువలకు ప్రాణం పోయాలని భావించి ధైర్యంగా సాధారణ ఎన్నికలకు వెళ్లారు. 1977–79 మధ్య ఎంక్వైరీ కమిషన్ల ద్వారా జనతా ప్రభుత్వం వేధించిన సమయంలోనూ ఆమె సంయమనాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు.
దేశ ప్రజలపైన ఇందిరాగాంధీకి వల్లమాలిన ప్రేమ ఉండేది. ‘నా దేశం గొప్పది’ అనే గర్వం ఆమెలో ప్రస్ఫుటంగా అగుపడేది. భారత్ ఎదగబోయే స్థాయిని అంచనా వేసుకుని ఉప్పొంగిపోయేవారు. అందుకే, దేశ ప్రాధాన్యాలు, దేశ గౌరవం కాపాడ్డంలో ఇందిర రాజీపడేవారు కాదు. దేశీయంగా బలంగా ఉంటేనే జాతి గౌరవం, స్వాతంత్ర్యాలు భద్రంగా ఉంటాయని ఆమె గట్టిగా నమ్మేవారు. ఎన్ని అడ్డంకులు పుట్టుకొచ్చినా ఆ దిశగా శ్రమించేవారు. దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాంకేతికంగా, సైనికంగా స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా నిలిపి ఉంచేందుకై కృషి చేసేవారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. 1970 దశకంలో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడినా భారత్‌ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.
గ్రీన్ రెవల్యూషన్ విజయం ద్వారా దేశంలో ఆహారధాన్యాల కొరతను దూరం చేశారు. పాశ్చాత్య పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో సంభవించే ఆర్థిక మాంద్యాల ప్రభావాలు భారత్ దరిదాపులకు కూడా రాకుండా చూడడంలో తన తండ్రి నెహ్రూను మరపించారు. భారత అంతర్గత విషయాల్లో ఇతర దేశాల ప్రమేయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే, కోల్డ్‌వార్ కూటముల నుంచి భారత్‌ను దూరంగా ఉంచారు. అణు కార్యకలాపాలను శాంతియుత కార్యక్రమాలకే పరిమితం చేసినా, అణ్వాయుధాల తయారీ నిషేధ ఒప్పందంపై సంతకానికి మాత్రం నిరాకరించారు. నెహ్రూ ఏర్పరచిన అలీన విధానాన్నే అనుసరించారు. దేశాన్ని శక్తిమంతమైనదిగానూ, స్వయం సమృద్ధ దేశంగానూ నిలబెట్టారు. అనేక సంస్కరణలు తెచ్చారు. మిశ్రమ ఆర్థిక విధానాలను అనుసరించి ప్రైవేట్ సెక్టార్ ఆరోగ్యకరమైన అభివృద్ధికి విధాన నిర్ణయాలు తీసుకున్నారు.
సెక్యులర్ భావజాలానికి అంకితమై, రాజకీయాల్లో మత భావజాలాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అట్టి విధానం ప్రజల్ని చీలుస్తుందని, దేశాన్ని బలహీనపరుస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే, జాకీర్ హుస్సేన్ వంటి వారిని దేశాధ్యక్షులుగా చేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ కారణంగా తన సిక్కు బాడీగార్డ్స్ చేతుల్లో 1984 అక్టోబర్ 31న ఇందిర అస్తమించారు. దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది. బడుగు, మైనార్టీ ప్రజలంతా తమ ‘అమ్మ’ను కోల్పోయినట్లుగా బాధపడ్డారు. దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన ఇందిర చిరస్మరణీయురాలు.
దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్సిటీ
(నేడు ఇందిరాగాంధీ వర్ధంతి)
ఇవి కూడా చదవండి
ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..
ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..