Share News

India Taliban Diplomacy: ట్రంప్‌ బాధిత భారత్‌కు దౌత్యవిజయం

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:39 AM

ఏ దేశ దౌత్య నీతి అయినా దాని సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. అన్ని దేశాలూ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదుపుతూ దౌత్యంలో చదరంగం ఆడుతుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా తాలిబాన్లతో చిగురిస్తున్న భారత మైత్రి ఒక ఆసక్తికరమైన పరిణామం...

India Taliban Diplomacy: ట్రంప్‌ బాధిత భారత్‌కు దౌత్యవిజయం

ఏ దేశ దౌత్య నీతి అయినా దాని సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. అన్ని దేశాలూ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదుపుతూ దౌత్యంలో చదరంగం ఆడుతుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా తాలిబాన్లతో చిగురిస్తున్న భారత మైత్రి ఒక ఆసక్తికరమైన పరిణామం.

మతం పేర మానవతకు మచ్చగా, ధర్మం పేర అధర్మ క్రూరత్వానికి ప్రతీకగా ఉన్న అఫ్ఘానిస్తాన్ పాలకులు ఇస్లామిక్‌ ఉన్మాద తాలిబాన్లతో హిందూత్వ రాజకీయాలు కేంద్రబిందువుగా మనుగడ సాగించే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెలిమి చేయడం అశేష భారతీయులకు సహజంగా అశ్చర్యం కలిగిస్తోంది. హిందువులు, సిక్కులను ఊచకోత కోసిన తాలిబాన్ల నాయకుడికి ఉత్తరప్రదేశ్‌లో యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం పోలీసు కవాతుతో స్వాగతించింది. తెలుగువాడయిన దౌత్యవేత్త వి.వేంకటేశ్వరరావును కాబూల్‌లో దారుణంగా చంపిన ఉన్మాదుల నాయకుడికి న్యూఢిల్లీలో ఆరెస్సెస్ అనుబంధ సంస్ధ ఒకటి సాదర స్వాగతం చెప్పడం సామాన్య జనానికి దిగ్భ్రాంతి కలిగించింది. అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్లకు చేరువ కావడానికి భారతదేశం గత కొంత కాలంగా గల్ఫ్ దేశాల పాలకుల అండదండలతో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ లక్ష్యాన్ని సాధిస్తోంది. అఫ్ఘానిస్తాన్‌లోని మత ఛాందస తాలిబాన్ల ప్రభుత్వాన్ని రష్యా మినహా భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఏవీ గుర్తించలేదు, అయినా పాకిస్థాన్‌లో పెరిగి అక్కడి మదరసలో విద్యనభ్యసించి తాలిబాన్ల అగ్రనాయకత్వగణంలో ఒకడుగా ఎదిగిన అఫ్ఘానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్‌ఖాన్ ముత్తఖీని మోదీ సర్కారు ఎర్రతివాచీ పరిచి స్వాగతించడం శరవేగంగా మారుతోన్న దౌత్య సమీకరణాలకు సంకేతం.

పాకిస్థాన్ బలం, బలహీనత రెండూ అఫ్ఘానిస్తానే. అసలు తాలిబాన్లు అనేవారు పాక్‌ సైనిక దళాల నిఘా సంస్థ ఐఎస్ఐ ఉత్పాదిత ఒక క్రూర గెరిల్లాల గుంపు. అఫ్ఘానిస్తాన్‌లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలన్నీ కలిసికట్టుగా పాక్‌ సహకారంతో తాలిబాన్లను ప్రభవింపచేసి పెంపొందించారు. భారత మిత్రుడు అయిన నజీబుల్లాను 1992లో ముజాహిదీన్లు పదవీచ్యుతిడిని చేశారు. దేశం విడిచి పారిపోలేని నిస్సహాయుత స్థితిలో అతడు కాబూబ్ నగరంలో ఐక్యరాజ్యసమితి శరణుజొచ్చాడు. 1996లో తాలిబాన్లు ఐరాస కార్యాలయం నుంచి నజీబ్‌ను అపహరించి కిరాతకంగా హతమార్చి మరీ అధికారాన్ని చేపట్టారు. తొలుత ముజాహీదిన్లతో గానీ, ఆ తరువాత తాలిబాన్లతో గానీ భారతదేశం ఏ విధమైన దౌత్య సంబంధాలు పెట్టుకోలేదు. భారత్‌ వైఖరి అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయింది. ఆ తర్వాత నజీబుల్లా ప్రత్యర్థులు అయిన ముజాహిదీన్లు కొందరితో స్నేహం చేయడం భారత్‌కు అనివార్యమైంది. నజీబుల్లాను కూలద్రోసిన అహ్మద్ షా మసూద్ భారత్‌కు ఆప్తుడయ్యాడు. తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్‌కు భారత్ అన్ని విధాలుగా సహాయమందించింది.


తాలిబాన్ల మొదటి ప్రభుత్వ హయాం (1996–2001)లో అఫ్ఘానిస్తాన్‌లో పాకిస్థాన్‌కు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. ఆ తర్వాత అమెరికా, నాటో దేశాల చేతుల్లో కీలు బొమ్మలు అయిన పాలకులు 2021 వరకు అఫ్ఘానిస్తాన్‌ను పరిపాలించినా తాలిబాన్లను నిర్మూలించలేకపోయారు. అమెరికా నిష్క్రమణ అనంతరం 2021లో అప్ఘానిస్తాన్‌లో మళ్లీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు ఈ సారి పాక్‌ పాలకుల కనుసన్నలలో కాకుండా స్వతంత్రంగా బాహ్య ప్రపంచం వైపు చూడడం మొదలుపెట్టారు. పాకిస్థాన్‌తో విబేధిస్తూ తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. తమకు ఆలంబనగా ఖతర్‌ను ఎంచుకున్నారు. తరం మారడంతో అలోచన సరళి కూడా మారింది. గతంలో పాకిస్థాన్ చెప్పినట్లుగా తాలిబాన్ల అధినాయకుడు ముల్లా ఉమర్ నడువగా ఇప్పుడు అతని కుమారుడు, ప్రస్తుత రక్షణమంత్రి ముల్లా యాఖూబ్ అలా నడువాలనుకోవడం లేదు. ఖతర్‌లో భారత విదేశాంగ శాఖ అధికారులతో ముల్లా యాఖూబ్ సమావేశం కావడం ఆ తర్వాత దుబాయిలోనూ అఫ్ఘానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ముత్తఖీ సమావేశం కావడం పాకిస్తాన్‌ను కలవరపరిచింది. పహల్గాంలో ఉగ్రదాడిని పాకిస్థాన్ పేరు ప్రస్తావిస్తూ పొరుగున ఉన్న నేపాల్ ఖండించలేదు కానీ అఫ్ఘానిస్తాన్ మాత్రం నిర్ద్వంద్వంగా ఖండించింది, ఇది మాములు విషయం కాదు. భారత దౌత్యనీతికి విజయం. అయినా మోదీ ప్రభుత్వం ఈ విజయాన్ని బహిరంగంగా చెప్పుకోలేని ఇరకాటంలో ఉన్నది.

దాయాది దేశానికి ఊపిరాడనివ్వకుండా చేస్తోన్న తాలిబాన్లతో భారత్‌ వ్యూహాత్మక స్నేహం మన దేశ ప్రయోజనాలు లక్ష్యంగా ఉన్నదే, సందేహం లేదు. భారత్‌కు చెప్పుకోదగ్గ ఈ దౌత్య విజయం డోనాల్డ్ ట్రంప్ చేసిన గాయాల తర్వాత ఒక ఉపశమనం. దేశీయ రాజకీయాల విషయానికి వస్తే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే తాలిబాన్లతో ఇటువంటి మైత్రి చేసి ఉన్నట్టయితే బీజేపీ అగ్గిరాజేసేదని ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 01:40 AM