Narendra Modi Telangana Strategy: కమల సరోవరంపై మోదీ సూర్యుడు
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:31 AM
ఈ నెల 10వ తేదీన తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. వచ్చీ రాగానే ఆయన అత్యంత ఆగ్రహంతో మాట్లాడారు. ఎంపీల గుండెలు బితుకుబితుకుమన్నాయి....
ఈ నెల 10వ తేదీన తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. వచ్చీ రాగానే ఆయన అత్యంత ఆగ్రహంతో మాట్లాడారు. ఎంపీల గుండెలు బితుకుబితుకుమన్నాయి. ఎంపీల్లో ప్రతి ఒక్కరికీ తగిలే విధంగా మోదీ తీవ్రంగా మందలించారు. ‘1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి కేవలం రెండే సీట్లు లభించాయి. గుజరాత్ లోని మెహసానా సీటు నుంచి ఏకే పాటిల్ ఎన్నికయ్యారు. హనుమకొండ సీటు నుంచి జంగారెడ్డి గెలిచారు. నాడు రాజీవ్‌గాంధీ బీజేపీని హమ్ దో, హమారే దో అని ఎద్దేవా చేశారు. ఇవాళ గుజరాత్‌లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నది, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నది?’ అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటలకు ఎవరికీ నోరు పెగల్లేదు. ‘మీ కంటే ఒవైసీ బెటర్’ అని మోదీ నిష్ఠూరమాడడం అన్నిటి కంటే అవమానకమని ఒక ఎంపీ అన్నారు.
తెలంగాణ ఎంపీలను మోదీ ఎందుకు టార్గెట్ చేశారు? ఎంపీలకు మోదీ క్లాస్ తీసుకునేందుకు అయిదు రోజుల ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వెళ్లి వచ్చారు. పార్టీలో అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతున్న నేతలను ఆయన తీవ్రంగా మందలించారు. ‘ఉంటే ఉండండి. పోతే పోండి’ అని ఆయన హెచ్చరించారు. బహుశా సంతోష్ ద్వారా నివేదిక అందిన తర్వాతే మోదీ ఇలా విరుచుకుపడ్డట్లు సమాచారం.
మోదీ అంతటితో ఆగలేదు. పార్లమెంటు సమావేశాలు ముగిసేందుకు రెండు రోజుల ముందు బీఆర్ఎస్ ఎంపీలను పిలిచి మాట్లాడారు. ఆయన పిలిపించి మాట్లాడారా, లేక వారే కలుసుకునే ప్రయత్నం చేశారా అన్నది స్పష్టంగా తెలియదు. కరీంనగర్, వరంగల్ సమస్యల గురించి మాట్లాడేందుకు మంత్రుల ద్వారా అపాయింట్‌మెంట్ కోరితే మోదీ వెంటనే పిలిపించారని బీఆర్ఎస్ ఎంపీ ఒకరు చెప్పారు. విచిత్రమేమంటే మోదీ ఈ సమావేశంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తాను ఏదో సోషల్ మీడియాలో చూశానని, కేసీఆర్ బాగా బరువు తగ్గినట్లు కనపడ్డా కోలుకుంటున్నట్లు తెలిసిందని మోదీ వారికి చెప్పారు. కేసీఆర్ కోలుకోవడం చాల మంచి పరిణామం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
కేసీఆర్ గురించి మోదీ మాట్లాడిన మరో మూడు రోజులకు కేసీఆర్ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు అన్నిటినీ తుత్తునియలు చేస్తూ దాదాపు గంటన్నరకు పైగా తన ఒరిజినల్ శైలిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దీనితో ఇంతకాలం స్తబ్దంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏ విషయాలు ప్రస్తావించారు, అన్నీ నిజాలే మాట్లాడారా అన్నది ప్రశ్న కాదు. మళ్లీ విజృంభిస్తానని కేసీఆర్ చెప్పడం చర్చనీయాంశమైంది. జూబిలీహిల్స్ ఓటమి తర్వాత క్రుంగిపోయిన పార్టీకి మరోసారి ఆశలు రేకెత్తాయి.
తెలంగాణకు బీఎల్ సంతోష్ వెళ్లిరావడం, మోదీ తమ పార్టీ ఎంపీలను విమర్శించడం, బీఆర్ఎస్ ఎంపీలను పిలిచి మాట్లాడడం, ఆ తర్వాత కేసీఆర్ రంగప్రవేశం చేయడం... ఈ నాలుగు ఘటనలకు ఏమైనా అంతస్సంబంధం ఉన్నదా? అంతకు ముందే తెరవెనుక ఇంకా ఏమైనా పరిణామాలు జరిగాయా?
ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టం: మోదీ పూర్తిగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఒకవైపు వచ్చే ఏడాది ప్రథమార్థంలో పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరగాల్సి ఉండగా, తెలంగాణపై మోదీ ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారు? పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర వ్యతిరేక విమర్శలు గుప్పించుకుంటుండగా, ఆ రాష్టాన్ని వదిలి తెలంగాణను పట్టించుకోవాల్సిన తక్షణ అవసరం ఏమున్నది? తెలంగాణలో రేవంత్‌రెడ్డి రోజురోజుకూ బలోపేతం కావడం, కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా ఆయన అన్ని విధాలా అండదండలివ్వడం మోదీ దృష్టికి వచ్చే ఉంటుంది. తెలంగాణ బీజేపీ నేతలు పరస్పరం ఘర్షించుకోవడం, స్థానిక పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావుపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేయడం మొదలైన వాటిని మోదీ హర్షించడం లేదు. కేసీఆర్ ఆరోగ్యం గురించి చాలా మందికి తెలియని సమాచారం మోదీకి ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలు, రేవంత్‌రెడ్డి ఎదుగుతున్న తీరు ఆయన గమనించకుండా ఉంటారా? అయితే మోదీ తదుపరి ఎత్తుగడ ఏమిటో ఎవరు అంచనా వేయగలరు? మోదీ గురి ఎక్కడో ఉన్నట్లు కనిపించినా అది ఎక్కడ తగులుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇలాంటి పరిణామాలు పట్టకపోవచ్చు కానీ రేవంత్‌రెడ్డి మాత్రం అంచనా వేయకుండా ఉంటారా?
ఈ పరిణామాలన్నిటి వెనుక ఒక విషయం స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలోనే కాదు, భారతీయ జనతా పార్టీలో కూడా కర్త, కర్మ, క్రియ నరేంద్రమోదీ యే, సందేహం లేదు. ఆయనే అన్నీ. మోదీయే పార్టీ అధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి కూడా. బీజేపీలో సాధారణంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థానంలో ఉన్నవారు పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తూ పార్టీ అంతర్గత సమావేశాల్లో కీలక నాయకులతో చర్చించి వ్యూహరచన చేసేవారు. లాల్ కృష్ణ ఆడ్వాణీ, అటల్‌బిహారీ వాజపేయి, మురళీమనోహర్ జోషి, కుశాభావు థాక్రే, జానా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి వంటి హేమాహేమీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నంతవరకూ బీజేపీ కార్యాలయంలో ఒక రకమైన ప్రజాస్వామిక రాజకీయ వాతావరణం ఉండేది. వెంకయ్యనాయుడు పార్టీకి, ప్రభుత్వానికీ మధ్య వారధిలా ఉంటూ పార్టీని నిర్వహించేవారు. చాలా మంది కేంద్రమంత్రులు పార్టీ కార్యాలయానికి తమ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి తెలియజేసేవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో జాతీయ అధ్యక్షులే నిర్ణయం తీసుకునేవారు. ‘ఒక చేతిలో ఎన్డీఏ ఎజెండా, మరో చేతిలో బీజేపీ జెండా’ ఇత్యాది నినాదాలను వెంకయ్యే రూపొందించేవారు.
అయితే 2020లో పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జగత్ ప్రకాశ్ నడ్డా నియామకం తర్వాత పూర్తి నిర్ణయాధికారాలు మోదీ, అమిత్ షా చేతుల్లోకి వచ్చేశాయి. ఎవరిని ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించాలనేది నడ్డా చేతుల్లో లేకపోవడమే కాదు, కనీసం ఆయనను సంప్రదిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండేళ్ల క్రితం బాగా పనిచేస్తున్న ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అకస్మాత్తుగా తొలగించారు. ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలుసుకున్నారు. ‘నన్నెందుకు తొలగించారు సార్ చెప్పండి’ అని టీవీ చూస్తున్న ఆ జాతీయ అధ్యక్షుడిని అడిగారు. ఆయన ముఖం తిప్పకుండా రిమోట్తో ఛానెల్స్ మారుస్తూ. ‘నన్ను తొలగించమన్నారు.. నేను తొలగించాను. అంతే..’ అని జవాబిచ్చారట!
ఇదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను, ముఖ్యమంత్రులను నియమించే విషయం మోదీ, అమిత్ షాలకు తప్ప మరెవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. కొందరు బీజేపీ నేతలకు తమను ముఖ్యమంత్రులుగా నియమిస్తున్న విషయం చివరి వరకూ తెలియదట. ‘పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో నా పేరు నిర్ణయిస్తారని ముందే తెలుస్తే షర్టు మార్చుకుని వచ్చేవాడిని కదా!’ అని ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఒక నేత ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 14 మంది బీజేపీ ముఖ్యమంత్రుల్లో జాతీయ స్థాయిలో తెలిసిన వారి పేర్లు తక్కువే.
ఆసక్తికరమైన విషయం ఏమంటే ఇప్పుడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కూడా ఎవరూ ఊహించని, ఇప్పటి వరకూ ఎవరికి తెలియని 45 సంవత్సరాల నితిన్ నబిన్‌ను నియమించారు. పార్టీలో ఆయన కంటే సీనియర్లు, అనుభవజ్ఞులైన నేతలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలు ఒక జూనియర్ నేత ద్వారా వారందరికీ పనులు అప్పగిస్తారన్నమాట. ఈ నెల 16న నితిన్ నబీన్ తన కొత్త పదవీ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చినప్పడు హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. తద్వారా తాము నియమించిన వ్యక్తిని అందరూ ఆమోదించాల్సిందేనని నిక్కచ్చిగా సంకేతాలు పంపారు. అయినప్పటికీ ఒకరిద్దరు పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మరికొందరు నేతలు కొత్త అధ్యక్షుడికి స్వాగతం చెప్పకుండా ముఖం చాటేశారని సమాచారం. ఈ నియామకంపై జిల్లా అధ్యక్షులు కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. కాని వారు ఏమి చేయగలరు?
బిహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించడం స్పష్టంగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్‌తో ఏకాభిప్రాయం కుదురక పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఏడాదిగా వాయిదాపడుతూ వస్తోంది. నితిన్ నబీన్ నియామకంతో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనే సంకేతాలు మోదీ స్పష్టంగా పంపారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సంప్రదించకుండానే కేంద్రమంత్రి పంకజ్ చౌదరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారు. దీనిపై ఆదిత్యనాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఒకరకంగా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలో ప్రవేశించింది. పార్లమెంటులో బిల్లుల విషయంలో కూడా మునుపెన్నడూ లేని రీతిలో దూకుడు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్రాల్లో ఓటర్ జాబితాల సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)ను ఉధృతంగా అమలు చేస్తున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో అనేకమందికి ఉద్వాసన చెప్పనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడ్వాణీ వివిధ రాష్ట్రాల్లో అరుణ్ జైట్లీ, అనంతకుమార్, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, గోవిందాచార్య, ఉమాభారతి వంటి నేతలను ప్రోత్సహించి జాతీయ స్థాయికి తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి రెండోతరం నేతలెవరూ కనపడడం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే బీజేపీలో ఇతర పార్టీల్లో లాగా లుకలుకలు పైకి కనపడవు. నాయకుడు గెలిపిస్తున్నంతవరకూ ఎవరూ ఏమి మాట్లాడరు. మరి కొత్త సంవత్సరంలో పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News