Share News

డిజిటల్‌ విప్లవంతో వికసిత భారతం

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:48 AM

మహారాష్ట్రలోని బారామతిలో, ఒక చిన్న రైతు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి వ్యవసాయం రూపురేఖల్ని మార్చివేస్తున్నాడు. ఈ అసాధారణ ప్రయత్నం....

డిజిటల్‌ విప్లవంతో వికసిత భారతం

మహారాష్ట్రలోని బారామతిలో, ఒక చిన్న రైతు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి వ్యవసాయం రూపురేఖల్ని మార్చివేస్తున్నాడు. ఈ అసాధారణ ప్రయత్నం ఇపుడు మన కళ్ల ఎదుట రూపుకడుతున్నది. ఎరువుల వాడకం తగ్గిపోయింది. నీటిని సమర్థంగా వినియోగిస్తున్నారు. అలాగే అధిక దిగుబడీ సుసాధ్యం అయింది. ఇదంతా ఏఐ వల్లనే!

భారతదేశంలో ఏఐ సృష్టిస్తున్న విప్లవంలో ఇది ఒక భాగం మాత్రమే. అధునాతన సాంకేతికతలు, ఆవిష్కరణలు ఇక ఎంతమాత్రం ప్రయోగశాలలకే పరిమితం కావు. సాధారణ పౌరుల జీవితాలను అవి సమూలంగా మార్చివేస్తున్నాయి. రేపటి రోజున జరగబోయే పెనుమార్పులకు బారామతి రైతు కథ ఒక సూక్ష్మరూపం– అంటే.. 2047 వికసిత భారత్ దిశగా మనం వేస్తున్న తొలి అడుగులు.

డిజిటల్ గమ్యం దిశగా మన ప్రయాణం వేగవంతమవుతోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), ఏఐ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీపై ప్రధానంగా దృష్టిసారించిన భారత్ తన డిజిటల్ భవిష్యత్తును స్వయంగా రూపొందించుకుంటున్నది. దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారత్, ఇప్పుడు హార్డ్‌వేర్ తయారీలో కూడా పెద్ద అంగలు వేస్తూ ముందుకు సాగుతోంది.


ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ పాత్రను బలోపేతం చేస్తూ ఐదు సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. నేడు భారతదేశం ప్రధాన ఎగుమతుల్లో తొలి మూడూ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులే. అలాగే ఈ సంవత్సరం మరో అద్భుతం జరగబోతున్నది. మొట్టమొదటి ‘మేక్ ఇన్ ఇండియా’ చిప్‌ను మనం ఆవిష్కరించబోతున్నాం.

ఏఐ రూపకల్పన: కంప్యూట్, డేటా, ఆవిష్కరణలు : సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ దన్నుగా, భారతదేశపు సాంకేతిక విప్లవాన్ని డీపీఐ ముందుకు తీసుకువెళుతోంది. భారత్ తనదైన ఏఐ సాంకేతికత వ్యవస్థ ద్వారా దానిని ప్రజాస్వామ్యీకరిస్తూ అందరికీ అందుబాటులోకి తెస్తోంది.

ఈ విషయంలో 18,000లకు పైగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) గల భారత కామన్ కంప్యూట్ సౌకర్యం కీలక మైలురాయిగా నిలుస్తుంది. గంటకు 100 రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండడం ద్వారా, పరిశోధకులు, అంకురసంస్థలు, విద్యావేత్తలు, ఇతర సంబంధిత వ్యక్తులకు అత్యాధునిక పరిశోధనలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమైన ప్రాథమిక నమూనాలు, అనువర్తనాలు సహా ఏఐ–ఆధారిత వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి జీపీయూలను సులభంగా వినియోగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.


వైవిధ్యమైన, అధిక–నాణ్యమైన డేటాతో ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి భారత్ పెద్ద ఎత్తున వ్యక్తిగతేతర అనామక డేటాసెట్‌లను రూపొందిస్తోంది. పక్షపాతాన్ని తగ్గిస్తూ, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది, అలాగే ఇది ఏఐ వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమగ్రంగా అందరికీ చేరుస్తుంది. ఈ డేటాసెట్‌లు వ్యవసాయం, వాతావరణ అంచనాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి వివిధ రంగాల్లో ఏఐ–ఆధారిత పరిష్కారాలను రూపొందించేందుకు వీలు కల్పిస్తాయి.

భారత అవసరాలకు అనుగుణంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్‌లు), సమస్యకు సంబంధితమైన నిర్దిష్ట ఏఐ పరిష్కారాల వంటి సొంత ప్రాథమిక నమూనాల అభివృద్ధిని భారత ప్రభుత్వం అందిస్తుంది. ఏఐ పరిశోధనను ప్రోత్సహించడం కోసం అనేక ఎక్సలెన్స్ కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి.

డిజిటల్ ఆవిష్కరణల కోసం భారత డీపీఐ ఒక బ్లూప్రింట్‌ : డీపీఐ కోసం భారత్ తొలిసారిగా చేసిన కృషి ప్రపంచ డిజిటల్ రంగాన్ని గణనీయంగా మార్చివేసింది. కార్పొరేట్ లేదా ప్రభుత్వ నియంత్రిత నమూనాల మాదిరిగా కాకుండా, భారత్‌లోని అద్భుతంగా చేపట్టిన ప్రభుత్వ–ప్రైవేట్ విధానం ద్వారా ఆధార్, యూపీఐ, డిజీలాకర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడానికి ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తున్నారు. ప్రైవేట్ రంగంలోని నిపుణులు డీపీఐ ఆధారంగా– వినియోగదారుల హితమైన, అప్లికేషన్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తూ అద్భుతంగా ఆవిష్కరణలు చేస్తున్నారు.


యూపీఐ, డిజీలాకర్ వంటి ఆర్థిక, పాలనాపరమైన వేదికలను అద్భుతమైన పరిష్కారాలతో ఏకీకృతం చేస్తున్నారు. ఈ నమూనా ఇప్పుడు ఏఐ శక్తితో మరింత బలోపేతం అవుతున్నది. జీ20 సదస్సులో భారత డీపీఐ విధానం పట్ల ప్రపంచం అంతా ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నమూనాను అనుసరించాలనే కోరికను వివిధ దేశాలు వ్యక్తం చేశాయి. భారత యూపీఐ చెల్లింపు వ్యవస్థకు జపాన్ పేటెంట్ మంజూరు చేసింది. దీనిని ఎంత వరకైనా విస్తరించడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం.

సంప్రదాయం, సాంకేతికతల సంగమంగా మహాకుంభ్: ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సామాజిక వేడుకల్లో మొదటిది అయిన మహాకుంభ్ సజావుగా, విజయవంతంగా నిర్వహించడం కోసం భారత్ తన డీపీఐ, ఏఐ ఆధారిత నిర్వహణా విధానాన్ని ఉపయోగించుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే స్టేషన్లలో జనసమూహానికి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఏఐ –ఆధారిత సాధనాలు రైల్వే ప్రయాణీకుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి.

కుంభ్ సహాయక్ చాట్‌బాట్‌లో ఏకీకృతం చేసిన భాషిణి, అందరికీ వాయిస్–ఆధారంగా తప్పిపోయిన వారిని కనుగొనే అవకాశం లభించింది. రియల్–టైమ్ అనువాదం అలాగే బహుభాషా సహాయాన్ని అందించింది. భారతీయ రైల్వేలు, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సహా వివిధ విభాగాలు పరస్పర సహకారంతో సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరించారు.


డీపీఐని ఉపయోగించడం ద్వారా, మహాకుంభ్ సాంకేతికత ఆధారిత నిర్వహణలో ప్రపంచస్థాయి ప్రమాణాలను నిర్దేశించింది, దీనిని మరింత సమ్మిళితంగా, సమర్థంగా, సురక్షితంగా చేసింది.

భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తిని రూపొందించడం : డిజిటల్ విప్లవానికి భారత శ్రామికశక్తి ప్రధాన కేంద్రంగా ఉంది. దేశంలో వారానికో కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటవుతూ, ప్రపంచ పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధికి ప్రధాన గమ్యస్థానంగా భారత్ స్థితిని బలోపేతం చేస్తుంది. అయితే, ఈ వృద్ధిని కొనసాగించడానికి విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నిరంతర పెట్టుబడుల అవసరం ఎంతైనా ఉంది.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం, ఏఐ, 5జీ, సెమీకండక్టర్ రూపకల్పన వంటి అంశాలను చేర్చుతూ విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలను మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వం ఈ సవాలును సమర్థంగా పరిష్కరిస్తోంది. పట్టభద్రులు ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో ఉద్యోగాలను ప్రారంభించేలా చేసి, విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని ఇది తగ్గిస్తోంది.

ఏఐ నియంత్రణ కోసం ఆచరణీయ విధానం : భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తిని రూపొందిస్తున్న భారత్ తన ఏఐ నియంత్రణ విధానంతో బాధ్యతాయుతంగా విస్తరించే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. ఆవిష్కరణలను అణచివేసే ‘హెవీ–హ్యాండెడ్’ నియంత్రణ విధానం లేదా కొంతమంది చేతుల్లో అధికారాన్ని కేంద్రీకరించే ‘మార్కెట్–ఆధారిత పాలన’ వలె కాకుండా, భారత్ ఆచరణాత్మకమైన, సాంకేతిక–చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తోంది.


ఏఐ సంబంధిత ఇబ్బందులను పరిష్కరించడానికి చట్టంపై మాత్రమే ఆధారపడకుండా, ప్రభుత్వం సాంకేతిక రక్షణ చర్యల్లోనూ పెట్టుబడులు పెడుతోంది. డీప్ ఫేక్స్, గోప్యతా సమస్యలు, సైబర్ భద్రతా ముప్పులను పరిష్కరించే సాధనాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లో ఏఐ–ఆధారిత ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తోంది.

ఏఐ ప్రపంచ పరిశ్రమల పునర్నిర్మిణాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆవిష్కరణలను పెంపొందించే నియంత్రణ విధానాలను కొనసాగిస్తూనే సమ్మిళిత వృద్ధికి సాంకేతికతను ఉపయోగించుకోవాలనే స్పష్టమైన దార్శనికతతో భారత్ ముందుకు వెళ్తోంది. కానీ విధానాలు, మౌలిక సదుపాయాలకు అతీతంగా, ఈ పరివర్తన మన ప్రజల కోసమేననేది గమనించాల్సిన విషయం.

అశ్వినీ వైష్ణవ్

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ,

రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 06 , 2025 | 05:48 AM