Vizag Data Hub: ఊహాజనిత భయాలు ద్వంద్వ ప్రమాణాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:53 AM
విశాఖపట్నంలో గూగుల్ నిర్మించతలపెట్టిన డేటా హబ్ గురించి అక్టోబర్ 30న ప్రచురితమైన నా వ్యాసంపై నవంబర్ 19 సంచికలో గుత్తా రోహిత్ విమర్శ రాశారు. తదనంతరం డిసెంబరు 2, 16వ తేదీ సంచికల్లోనూ...
విశాఖపట్నంలో గూగుల్ నిర్మించతలపెట్టిన డేటా హబ్ గురించి అక్టోబర్ 30న ప్రచురితమైన నా వ్యాసంపై నవంబర్ 19 సంచికలో గుత్తా రోహిత్ విమర్శ రాశారు. తదనంతరం డిసెంబరు 2, 16వ తేదీ సంచికల్లోనూ చర్చ కొనసాగింది. ‘చైనాలో వేల సంఖ్యలో డేటా సెంటర్లు ఏమీ లేవు. అక్కడ సాధారణ డేటా సెంటర్లు 449, ఏఐ డేటా సెంటర్లు వంద దాకా ఉన్నాయి. అమెరికాలో ఏఐ డేటా సెంటర్లు పదుల సంఖ్యలోనే (20–30మధ్యలో) ఉన్నాయి’ అంటున్నారు గుత్తారోహిత్ తన వ్యాసంలో. ఇంతకంటే అవాస్తవాలు ఏమైనా ఉంటాయా?
55 వేల మెగావాట్ల డేటా సామర్థ్యంతో అమెరికాలో డేటా సెంటర్లున్నాయి. చైనా తమ దేశంలోని ప్రైవేటు కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు, రాయితీలు ఇచ్చి మరీ 35 వేల మెగావాట్ల డేటా సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఏఐ ఆధారిత డేటా సెంటర్ల సాంకేతికతలో, విస్తృతిలో ప్రపంచంలో అగ్రస్థానం కోసం నువ్వా, నేనా అన్నట్టుగా ఈ దేశాలు పోటీ పడుతున్నాయి. అయినా వీటిని తక్కువగా చూపించి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంతో ఏదో ఉపద్రవం సంభవిస్తుందనే భావన కలుగజేయటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు.
ఏఐ ఆధారిత డేటా సెంటర్లతో సహా, డేటా సెంటర్లన్నీ ఒక దేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగమే. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునాదిపైనే ఆధునిక ప్రపంచం అనుసంధానమవుతుంది. అది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్ సేవల కలయిక. ఈ కలయిక డేటా ప్రవాహం కొనసాగేలా, ఆర్థిక కార్యకలాపాలు బలోపేతమయ్యేలా, డిజిటల్ సేవలు వేగంగా అందేలా చూస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ భద్రత కూడా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగమే. ఈ సమాహారంలోని ప్రతి విభాగంపై స్వావలంబన ఉంటేనే ఏ దేశమైనా ప్రగతిపథంలో పురోగమిస్తుంది. ఈ ప్రాథమిక విషయం తెలియకపోతే చర్చ ‘ఒక ఏనుగును ఆరుగురు అంధులు వర్ణించిన తీరు’గా సాగుతుంది.
ప్రపంచంలో పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో నాలుగో స్థానంలో ఉన్న భారతదేశం... అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద డిజిటలైజ్డ్ దేశంగా ఉంది. అంతేకాకుండా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీలో భారతదేశం కూడా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ తాజా నివేదిక తెలిపింది. ప్రపంచస్థాయి ఏఐ దేశంగా ఆవిర్భవించటానికి కావలసిన పెట్టుబడుల అవసరాన్ని గుర్తు చేస్తూ, ఏఐ పరిశోధనలో భారతదేశం 11వ స్థానంలో, మౌలిక సదుపాయాలలో 16వ స్థానంలో ఉందని ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ–2025’ అనే విషయంపైన ప్రాసెస్ సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ ఎకానమీ తయారు చేసిన నివేదిక వెల్లడించింది.
డేటా సెంటర్ల సామర్థ్యం విషయానికే పరిమితమై చూసినప్పుడు– ప్రపంచ డేటాలో 20శాతం ఉత్పత్తి చేస్తున్న భారతదేశం ప్రస్తుతం ప్రపంచ డేటా సెంటర్ సామర్థ్యంలో కేవలం 3శాతం వాటాను మాత్రమే కలిగివుంది. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో డేటా సెంటర్ల సంఖ్య 277, సామర్థ్యం 1500 మెగావాట్లకు అటుఇటుగా ఉంది. భారతదేశ డేటా సెంటర్ మార్కెట్‌లో ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగివుంది. దేశంలోని మొత్తం డేటా సెంటర్ సామర్థ్యంలో 52 శాతం ముంబైలో ఉంది. ఆ తరువాత 21 శాతంతో చెన్నై రెండవ స్థానంలో ఉంది. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని పిలిచే బెంగళూరు, హైదరాబాద్ వంటి టెక్ హబ్‌లు ఒక్కొక్కటీ 7 శాతం వాటాను కలిగివున్నాయి. ఢిల్లీ కేవలం తొమ్మిది శాతం మాత్రమే కలిగివుండగా, పూణే, కోల్‌కతా వరుసగా ఏడు శాతం, ఆరు శాతం వాటాను కలిగివున్నాయి.
ఆసియాలో అతిపెద్ద రేటింగ్–4 డేటా సెంటర్ కంపెనీ అయిన CtrlS తన డేటా సెంటర్స్‌ను హైదరాబాద్ సమీపంలోని చందన్‌వెల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లోని 40 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నది. 600 మెగావాట్లకు పైగా ఐటీ లోడ్‌కు ఇది మద్దతు ఇస్తుంది. హైపర్‌స్కేల్, ఎంటర్‌ప్రైజ్ డేటా అవసరాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుంది. CtrlS డేటా సెంటర్ అధిక–సాంద్రత, అల్ట్రా–హై–డెన్సిటీ వర్క్‌లోడ్‌లను నిర్వహించడానికి రూపొందిన ఏఐ–రెడీ, ఇంటర్ కనెక్టెడ్ భవనాలను కలిగి ఉంటుంది. ఇదే కాకుండా అదానీ డేటా సెంటర్ కూడా ఇక్కడ వస్తోంది. అయినా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ తరహాలో విద్యుత్ కొరత, నీటి ఎద్దడి వస్తుందనే విమర్శ మచ్చుకు కూడా కనపడదు. ఇదిలా ఉండగా దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం 2030 కల్లా తొమ్మిది గిగావాట్లకి పెంచడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఐటీ పరిశ్రమల స్థాపనలో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలు గూగుల్ డేటా సెంటర్ తమ రాష్ట్రాలకు రానందుకు కారాలు మిరియాలు నూరుతున్నాయి. అయినా ఇప్పటివరకు ఎటువంటి ఐటీ పరిశ్రమా లేని ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ డేటా సెంటర్ స్థాపనపై కొందరు కత్తులు దూస్తున్నారు. రాష్ట్రంలో 13,488 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. మరెన్నో ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యంలో సగానికి మించివున్న మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక విద్యుత్తు (13,600 మెగావాట్లు)కు ఇది దాదాపు సమానం. అంతేకాకుండా మహారాష్ట్ర నేటి ఆంధ్రప్రదేశ్ కంటే జనాభాలో దాదాపు రెండున్నర రెట్లు, విస్తీర్ణంలో రెండు రెట్లు పెద్దది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో వస్తున్న డేటా సెంటర్లతో విద్యుత్తు సంక్షోభం వస్తుందని భయాందోళనలు రేకెత్తించటంలో అర్థం లేదు.
అలాగే నీటి వినియోగంపై కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేశంలో 73 శాతం దాకా డేటా సెంటర్లు ఉన్న ముంబయి, చెన్నై నగరాలు నీటి కొరతతో ఉన్నాయి. డేటా సెంటర్లకు నీటి అవసరాలు గణనీయంగా ఉంటాయనేది నిజమే. కానీ నీటి వినియోగాన్ని, తద్వారా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే సాంకేతికతలైన లిక్విడ్ కూలింగ్ పద్ధతితో పాటు, వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగిస్తారు. అలాగే సముద్రపు నీటిని నిర్లవణీకరణ (డీశాలినేషన్) చేసి వినియోగించటం, సముద్రపు లోతుల్లోని నీటిని (ఇది సముద్రపు పై భాగంలో ఉండే నీటికి భిన్నంగా కలుషితం కాకుండా ఉంటుంది) శుద్ధి చేసి వాడటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణాల చేతనే ఈ నగరాలలో డేటా సెంటర్ల కారణంగా నీటి కొరత ఏర్పడలేదు.
నీరు, విద్యుత్తు లభ్యతలకు సంబంధించి విశాఖపట్నం ఏ విధంగా చూసినా ముంబయి, చెన్నైల కంటే మెరుగైన నగరం. అయినా ఏదో ప్రళయం సంభవిస్తున్నట్టు గుండెలు బాదుకోవటం వెనుక సాంకేతిక కారణాలు కాకుండా మరేవో ఉద్దేశ్యాలు ఉన్నాయి. ఊహాజనిత భయాలను సృష్టించటం, విశ్లేషణలో ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ లక్ష్యాల కోసమో తెలుసుకుని, వాటి వెనుకవున్న దురుద్దేశపూరిత రాజకీయాలను నిర్వీర్యం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ భవిత అగమ్యగోచరం అవుతుంది.
నెల్లూరు నరసింహారావు
(సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News