Share News

పంచాయతీరాజ్ సార్థకమయ్యేది ఎలా?

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:24 AM

73, 74వ రాజ్యాంగ సవరణ జరిగి 30 సంవత్సరాలు అయినా, పంచాయతీరాజ్, పట్టణ సంస్థల 29 అంశాలకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది నియామకం జరగలేదు. పంచాయతీరాజ్‌లో...

పంచాయతీరాజ్ సార్థకమయ్యేది ఎలా?

73, 74వ రాజ్యాంగ సవరణ జరిగి 30 సంవత్సరాలు అయినా, పంచాయతీరాజ్, పట్టణ సంస్థల 29 అంశాలకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది నియామకం జరగలేదు. పంచాయతీరాజ్‌లో అదనంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీల వ్యవస్థ ప్రవేశపెట్టడం పలు వివాదాలకు దారితీసింది. గతంలో పంచాయతీలు, మండల పరిషత్‌లకు; మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు అనుసంధానం ఉండేది. నేడు అది కరువైంది. 2002లో నాటి ప్రభుత్వం రెవెన్యూ అధికారులను కూడా పంచాయతీలకు అప్పగించి గ్రామపంచాయతీలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది. దీన్ని పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వాగతించారు. కానీ 2007లో ప్రభుత్వం మారగానే రెవెన్యూ వ్యవస్థను తిరిగి పంచాయతీల నుంచి విడగొట్టారు. దీంతో గౌరవ వేతనం మీద రెవెన్యూ శాఖలో పార్ట్ టైంగా పని చేసినవారు 2002లో పంచాయతీ కార్యదర్శులుగా శాశ్వత ఉద్యోగిగా లబ్ధి పొందారు. కానీ తిరిగి రెవెన్యూ శాఖకు వెళ్లిపోయారు. ఇది పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగులకు కాకుండా రెవెన్యూ శాఖ సిబ్బందికి ఉపయోగపడింది.

2019లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పరిపాలన బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి, గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టి, అందులో సుమారు లక్షా పాతికవేల మందిని నియమించారు. అంతేగాక సుమారు రెండు లక్షల మంది వాలంటీర్లను కూడా నియమించారు. కానీ, సదరు గ్రామ సచివాలయాన్ని పంచాయతీరాజ్ శాఖ నుంచి విడగొట్టి వేరొక శాఖ ఏర్పాటు చేశారు. అంటే ప్రజా సంక్షేమం గ్రామ పంచాయతీల ద్వారా కాకుండా వేరొక శాఖ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా బాధాకరం.


నేటి కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆలోచించడం సముచితమే. ఈ సందర్భంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో అటు పరిపాలనాపరంగా, వ్యవస్థాపరంగా జరగవలసిన మార్పులేమిటో చూద్దాం.

నేడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ద్వారా గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కలెక్టర్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిపాలన వ్యవస్థ కొనసాగుతోంది. ఈ రెండు వ్యవస్థలు కూడా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పాటయినవే. రాజ్యాంగ సవరణ ప్రకారం 29 శాఖలకు సంబంధించిన సిబ్బందిని కూడా పంచాయతీరాజ్ సంస్థల పరిధిలోకి తేవాల్సిన సందర్భంలో పటిష్ఠమైన అధికార వ్యవస్థ ఉండాలి. అందుకు గ్రామ, మండల, డివిజనల్, జిల్లా, రాష్ట్ర శాఖలో ఏ విధంగా మార్పులు చేస్తే బాగుంటుందో పరిశీలిద్దాం.

గ్రామపంచాయతీ కార్యదర్శి పేరును కార్యనిర్వహణ అధికారిగా గతంలో ఉన్నట్టుగానే పునరుద్ధరించాలి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌లోని ఆరు వ్యవస్థలను మూడుగా కుదించాలి. గతంలోని గ్రేడ్–1, గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శిలను ఒక గ్రేడ్‌గాను (జోనల్ స్థాయి రిక్రూట్‌మెంట్); మూడు, నాలుగు గ్రేడ్లను రెండో గ్రేడ్‌గాను; ఐదు ఆరు గ్రేడ్‌లను మూడో గ్రేడు (జిల్లా గ్రేడ్లుగా)గా మార్పు చేయాలి.

మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పేరును మండల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మార్పు చేయాలి. ప్రతి మండలంలో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక మండల విస్తరణ అధికారి పోస్టు మంజూరు చేసి, దానికి మండల పంచాయతీరాజ్ సంక్షేమ అధికారిగా పేరు పెట్టాలి. అలాగే నేడున్న విస్తరణాధికారి పేరును మండల పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేయాలి. ఈ మండల పంచాయతీ అభివృద్ధి అధికారులు డివిజనల్ పంచాయతీ అధికారి ఆధీనంలో పనిచేయాలి.


ఇక డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారికి గ్రామ సచివాలయం, గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యక్రమాల విధులను పరిరక్షించే బాధ్యతను అప్పగించాలి. నేడున్న డివిజనల్ అభివృద్ధి అధికారి పోస్టును మండల పరిషత్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారుల ద్వారా 1:1 శాతంతో భర్తీ చేయాలి.

అలాగే జిల్లా స్థాయిలోని జిల్లా పంచాయతీ అధికారి హోదాను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి హోదాతో సమానం చేయాలి. జిల్లా పంచాయతీ అధికారి పేరును కూడా జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మార్పు చేయాలి. జిల్లా పరిషత్‌లో గల జిల్లా కార్యనిర్వాహణాధికారి, జిల్లా పంచాయతీ కార్యనిర్వహణాధికారి పోస్టులను డివిజనల్ అభివృద్ధి అధికారులతో భర్తీ చేయాలి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్టులను పరస్పరం బదిలీ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. జిల్లా ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్టులను కూడా డివిజనల్ అభివృద్ధి అధికారులతో పరస్పర బదిలీ విధానంగా ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా పరిషత్‌లోను జిల్లా పంచాయతీ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో గణాంక అధికారి పోస్టులను మంజూరు చేయాలి. జిల్లా పరిషత్‌లోని గణాంక అధికారి, జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారులను పరస్పరం బదిలీ చేసే విధానం ఏర్పాటు చేయాలి.

రాష్ట్రస్థాయిలోకి వచ్చేసరికి కమిషనర్ పంచాయతీరాజ్ కార్యాలయంలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి కార్యాలయంలో నేడున్న ద్వంద్వ పరిపాలన విధానాన్ని తొలగించి, ఒకే గూడు కింద పరిపాలన తీసుకురావాలి. కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌కు పంచాయతీరాజ్ విభాగం నుంచి సహకారం అందించడానికి ఒక అదనపు కమిషనర్, అలాగే గ్రామీణ అభివృద్ధి విషయాలలో సహకారం అందించటానికి మరొక అదనపు కమిషనర్‌ను ఏర్పాటు చేయాలి. గ్రామీణాభివృద్ధి విభాగంలో రెండు జాయింట్ కమిషనర్‌ పోస్టులు, 4 ఉప కమిషనర్లు, 8 సహాయక కమిషనర్లతో పాటు 12 సెక్షన్లు ఏర్పాటు చేయాలి. అలాగే పంచాయతీ విభాగంలో ఇద్దరు జాయింట్ కమిషనర్ల పోస్టులు, నాలుగు ఉప కమిషనర్లు, 8 సహాయక కమిషనర్లతో పాటు 12 సెక్షన్లను ఏర్పాటు చేయాలి. ఈ పోస్టులను క్రింది స్థాయి అధికారులతో భర్తీ చేయాలి. ప్రతి సెక్షన్‌కు ఒక పరిపాలన అధికారి, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలి. అలాగే అదనంగా 12 డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను కూడా ఏర్పాటుచేసి వారి సేవలను ఉపయోగించుకోవాలి.

కమిషనర్ కార్యాలయంలో ఒక ఫైనాన్షియల్ కమిషనర్ పోస్టును ఏర్పాటు చేయాలి. ఈ పోస్టును ఐఎఎస్‌ హోదా అధికారి ద్వారా భర్తీ చేయాలి. రెండు ముఖ్య గణాంక అధికారుల పోస్టులు ఏర్పాటు చేయాలి. వారిలో ఒకరు పంచాయతీరాజ్ లెక్కలు, మరొకరు గ్రామీణాభివృద్ధిలో గణాంక విషయాలు చూడాలి.

నేడున్న గ్రామపంచాయతీలను కూడా మూడు గ్రేడ్లుగా విభజించాలి. మొదటిది– 5వేలు లోపల జనాభా, రెండోది– ఐదు–పదివేల మధ్యన జనాభా, మూడోది– పదివేల పైబడి జనాభా కలిగిన పంచాయతీలుగా విభజించాలి. పదివేలు పైబడిన జనాభా కలిగిన పంచాయతీల్లో గ్రేడ్ వన్ కార్యదర్శులను (నేడున్న ఒకటి, రెండు గ్రేడ్లు కలిపి), 5–10వేల మధ్య కలిగిన జనాభాలో పంచాయతీలో గ్రేడ్–2 (నేడున్న మూడు, నాలుగు గ్రేడ్లు కలిపి), ఐదు వేల కంటే తక్కువ జనాభా కలిగిన పంచాయతీల్లో గ్రేడ్–3 (నేడున్న 5, 6 గ్రేడ్లు కలిపి) పంచాయతీ కార్యదర్శులను నియమించాలి.


ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి. సర్పంచులు మండల పరిషత్ అధ్యక్షుడిని, మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకొనేటట్లుగా మార్పులు తీసుకురావాలి. అలాగే శాసనపరమైన అంశాలపైన ప్రజాప్రతినిధులు చేసుకునే అప్పీళ్లను పరిశీలించడానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సంబంధిత నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపునకు చర్యలు తీసుకోవాలి. కమిషనర్ పంచాయతీరాజ్ కార్యాలయంలో ఒక విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు చేయాలి. అందులో ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలి.

ఇలా తగు చర్యలు తీసుకుంటే పంచాయతీరాజ్ సంస్థల మధ్యన సమన్వయం ఏర్పడి, సమర్థంగా పరిపాలన సాగడమే కాకుండా పంచాయతీరాజ్ సంస్థలు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి, పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజమవుతుంది.

టి.యం.బి బుచ్చిరాజు

చైర్మన్, ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్


Also Read:

నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి

మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..

2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 19 , 2025 | 04:24 AM