Share News

Hitchcock Book For This Generation: ఈ తరానికి హిచ్‌కాక్‌

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:10 AM

ఎక్కడో లండన్‌లో పుట్టి, హాలీవుడ్‌లో మెరిసి సినీ ప్రపంచాన్ని మురిపించిన హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా తెలుగులో ఒక పుస్తకం వచ్చింది. ఇద్దరు కలిసి, ఎందరిచేతో రాయించి తీసుకొచ్చిన బృహత్తర ప్రాజెక్టు ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్‌: హిచ్‌కాక్‌’...

Hitchcock Book For This Generation: ఈ తరానికి హిచ్‌కాక్‌

ఎక్కడో లండన్‌లో పుట్టి, హాలీవుడ్‌లో మెరిసి సినీ ప్రపంచాన్ని మురిపించిన హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా తెలుగులో ఒక పుస్తకం వచ్చింది. ఇద్దరు కలిసి, ఎందరిచేతో రాయించి తీసుకొచ్చిన బృహత్తర ప్రాజెక్టు ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్‌: హిచ్‌కాక్‌’. జర్నలిస్ట్ – సినీ రైటర్ – నంది అవార్డు విన్నర్ పులగం చిన్నారాయణ, ఐ.ఆర్.టి.ఎస్. అధికారి రవి పాడి చేసిన ఈ ప్రయత్నం గురించి వారితో చిరు సంభాషణ ఇది.

ఇంటర్వ్యూ : వడ్డి ఓంప్రకాశ్ నారాయణ

వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ హిచ్ కాక్‌పై భారతీయ భాషల్లోనే తొలి ప్రయోగం అంటూ ఈ పుస్తకం తెచ్చారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?

పులగం: కోవిడ్ కాలం – బోలెడంత ఖాళీ సమయాన్ని ఇచ్చింది. అంతేకాదు, బోలెడన్ని ఖాళీల్ని నింపుకునే సమయాన్ని కూడా ఇచ్చింది. చాలా పుస్తకాల్ని చదివే తీరికనిచ్చింది. ఎన్నెన్నో సినిమాలు చూసే ఓపికనిచ్చింది. ఏవో దొరికిన సినిమాలు చూసేయడం కాకుండా, ఒక పర్సనాలిటీకి సంబంధించి మొత్తం కలెక్షన్ అంతా గేదర్ చేసి, ఆ వ్యక్తి తాలూకు సృజనాత్మక ప్రపంచంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నంలో నాకు హిచ్‌కాక్‌ దొరికాడు. ఆయనవి మొత్తం 53 సినిమాలు (9 మూకీలు, 45 టాకీలు). ప్రతి దాంట్లోనూ హిచ్‌కాక్ సిగ్నేచర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో తక్కువ లొకేషన్లలో, లో-బడ్జెట్‌లో అంత అవుట్‌పుట్ ఎలా ఇచ్చాడా అని ఆశ్చర్యం వేసింది. కోవిడ్ తర్వాత ఫిల్మ్‌మేకింగ్ స్టయిల్ మారిపోతుందేమో, తక్కువ బడ్జెట్‌లో తక్కువ లొకేషన్లలో సినిమాలు తీయాల్సి వస్తుందేమో అనిపించింది నాకు. అందుకే హిచ్‌కాక్ సినిమాల్ని ఈ తరానికి మళ్లీ పరిచయం చేయాలనిపించింది. ఒక్కో సినిమాని ఒక్కో సినీ ప్రముఖుని పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ చేస్తే బావుంటుందనిపించింది. మొదట సుప్రసిద్ధ దర్శకులు సింగీతం గారికి ఈ ఐడియా చెబితే, ‘ప్రొసీడ్’ అని, వారంలోపే ‘రియర్ విండో’ సినిమా మీద ఒక ఆర్టికల్ రాసి పంపించారు. దర్శకుడు వంశీ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన ఇంటి నిండా హిచ్‌కాక్ పోస్టర్‌లే! ఓ రకంగా హిచ్‌కాక్ పట్ల క్యూరియాసిటీ కలగడానికి కారకుడు, ప్రేరకుడు వంశీ గారే. ఈ ప్రాజెక్టు గురించి రోజూ రవి పాడి గారితో ఫోన్‌లో చర్చిస్తుంటే, ఆయన అలవోకగా ఆయా సినిమాల తెర వెనుక ముచ్చట్లు చెప్పేస్తుండేవారు. ఈ ప్రాజెక్టుకి పరిపూర్ణత రావాలంటే ఆయన భాగస్వామ్యమూ ఉండాలనిపించింది. అలా ఇద్దరం కలిసి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం.


నలభై ఐదు మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పదిమంది జర్నలిస్టులతో మొత్తం 62 వ్యాసాలు... ఇవి రాయించడం కష్టం కాలేదా?

పులగం: ఇంతమందితో ఎక్కడా రిపిటిషన్‌ లేకుండా ఆర్టికల్స్ రాయించడమంటే చాలా భారమైన వ్యవహారమే. నాకు తెలిసిన దర్శక రచయితలందర్నీ సంప్రదించాను. కొంతమంది మధ్యలో చేతులెత్తేశారు. అయినా ఏం భయపడలేదు. దీన్ని ఎవరు పబ్లిష్‌ చేస్తారు, పుస్తకాన్ని ఎలా తీసుకురావాలి, ఎన్ని కాపీలు అమ్ముడవుతాయి లాంటి ఆలోచనలు ఏనాడూ పెట్టుకోలేదు. ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాం, ప్రకృతి సహకరిస్తుందనే ధీమా. చివరకు నేనే ‘అక్షౌహిణి మీడియా’ పేరుతో పబ్లిష్ చేశాను. వారం రోజులకే ఫస్ట్ ఎడిషన్ కాపీలు అమ్మగాలిగాం. హిచ్‌కాక్‌కి ఇంకా డిమాండ్ ఉందని అర్థమైంది.

ఏ సమాచారమైనా వికీపీడియాలో, ఇంటర్‌నెట్‌లో దొరికే ఈ కాలంలో ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటి?

రవి పాడి: ఇందులో దర్శకులు, రచయితలు, జర్నలిస్టులు రాసిన సినిమా సమీక్షల్లో ప్రస్తావనకు రాని అంశాలను, తెర వెనుక ముచ్చట్లను చాలా ఇచ్చాం. ఇవేవీ వికీపీడియాలో దొరకవని ఖచ్చితంగా చెప్పగలను. వి.ఏ.కె. రంగారావు, యండమూరి, మల్లాది, సుకుమార్ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకోవడానికి కారణం అదే కారణం. ప్రముఖ రచయిత సత్యానంద్ అయితే ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో విడుదల చేయమని సూచించారు. ఆ ప్రయత్నంలో ఉన్నాం.

ఇంకే దర్శకుడు గురించైనా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా?

రవి పాడి: వంశీ గారు, మల్లాది గారు కొంతమంది ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పి, పుస్తకాలు తీసుకొస్తే బావుంటుందని సూచించారు. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్ పుస్తకం వరుసలో ఉంది. ‘ప్రపంచ సినిమా పరిమళం’ పేరుతో ఇంకో పుస్తకం సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని

రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గరు మృతి

Updated Date - Nov 24 , 2025 | 05:10 AM