Share News

Andhra Pradesh Irrigation Projects: సాగునీటి ప్రాజెక్టులపై మేల్కొన్న సర్కారు

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:16 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏణ్ణర్ధం పైగా అయింది. సాగునీటి రంగానికి సంబంధించి సర్కారు ఇప్పుడు ఒక దారికి వచ్చింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర జల వివాదాలపై దృష్టి పెట్టింది. అయినా...

Andhra Pradesh Irrigation Projects: సాగునీటి ప్రాజెక్టులపై మేల్కొన్న సర్కారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏణ్ణర్ధం పైగా అయింది. సాగునీటి రంగానికి సంబంధించి సర్కారు ఇప్పుడు ఒక దారికి వచ్చింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర జల వివాదాలపై దృష్టి పెట్టింది. అయినా ఇది చాలదు. చేయవలసింది ఇంకా ఉంది.

బనకచర్ల అనుసంధానం చేపట్టే ముందు గోదావరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాలు ఎంతో తేల్చుకోవలసి ఉందని, అందుకు ట్రిబ్యునల్ నియామకం అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ముఖ్యమంత్రికి నచ్చజెప్పి ఉండాలి. అలాగే కేంద్రంపై ఒత్తిడి పెంచి ఉండాల్సింది. అయితే వారు ఇప్పటికి గానీ మేల్కోలేదు. 75శాతం డిపెండబిలిటీ మేరకు గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి 1480 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 945 టీఎంసీలు తమకు చెందుతాయని, కేవలం 518 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని తెలంగాణ వాదిస్తుండగా, తమ వాటా 737 టీఎంసీలుగా ఏపీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ తమ నికర జలాల వాటా ఎంతో తేల్చుకొని ఉంటే ఈ రోజు వరద జలాల వెంట పడవలసిన అగత్యం ఉండేది కాదు.

వాస్తవంలో 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కృష్ణా ట్రిబ్యునల్‌తో పాటు గోదావరి ట్రిబ్యునల్ నియామకానికి తీర్మానం చేసి ఉన్నారు. అయితే జగన్మోహన్‌రెడ్డి తన హయాంలో ఎప్పుడూ దాని ఊసెత్తలేదు. ఏణ్ణర్ధం అయ్యేంత వరకు కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ట్రిబ్యునల్ నియామకం గురించి కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. అంతేకాదు, పలు కీలకమైన అంశాలు ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకున్న ప్రత్యేక రక్షణల మేరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం రెండవ దశ డీపీఆర్‌ను ఆమోదించాలని కోరడం కూడా ప్రత్యేకత సంతరించుకొంది. సుప్రీంకోర్టులో స్టే ఉన్నా, కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలను కట్టడి చేయాలని కోరడం శుభసూచికమే. వీటన్నింటికీ మించి వంశధార ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై చేయాలని కోరారు... ఇవన్నీ స్వాగతించవలసినవే. వాస్తవంలో ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ పాటికే కొన్ని సాధించి ఉండాల్సింది. గోదావరి ట్రిబ్యునల్ నియామకానికి తెలంగాణ ఇష్టపడడం లేదు. ట్రిబ్యునల్ నియామకం జరిగితే ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల గురించి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉండే వెసులుబాటును కూడా తేల్చే అవకాశం లభిస్తుంది.


ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా నల్లమల సాగర్ అనుసంధానంతో పాటు రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర విభజన చట్టం రక్షణ కల్పించివున్న అంశాన్ని గుర్తుచేసి ఆర్థిక సహాయం కోరారు. ఇన్నాళ్లకు ఈ డిమాండ్‌ను కేంద్రం ముందు పెట్టడం శుభ పరిణామమే. వాస్తవంలో 2014లో రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ నమూనా ప్రత్యేక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుందేల్‌ఖండ్ ప్రాంతానికి యమునా నది ఉప నదులైన కెన్–బెత్వా నదుల అనుసంధానం భారీ ప్రాజెక్టు నిర్మిస్తోంది. 44,605 కోట్ల రూపాయల వ్యయంతో, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తోంది. తొలి ఏడాది 6,700 కోట్లు కేటాయించింది. ఇన్నాళ్లకు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ పెట్టడం ముదావహమే. డిమాండ్ పెట్టి ఊరుకోకుండా ఈ అంశంలో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వెంటపడితే కొంతలో కొంతైనా నిధులు రాబట్టే అవకాశం ఉంది.

చంద్రబాబు అధికారం చేపట్టాక పలుమార్లు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నా, ఎప్పుడూ పోలవరం రెండవ దశ డీపీఆర్‌ గురించి ప్రస్తావన చేయలేదు. ఇటీవల కేంద్ర జలశక్తిశాఖ మంత్రి వద్ద ఈ అంశం లేవనెత్తారు. జగన్మోహన్‌రెడ్డి హయాం నుంచే పోలవరం రెండవ దశపై నీలినీడలు కమ్ముకున్నాయి. పదివేల కోట్లు ఇస్తే తొలి దశ పూర్తి చేస్తాననే ప్రతిపాదన జగన్మోహన్‌రెడ్డి చేశారు. ఆయన ప్రభుత్వం 36 వేల కోట్లతో తొలి దశ ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ దశలో ఎన్నికలొచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వ ప్రతిపాదనలనే కొంత మార్పు చేసి ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు కేంద్రం ముందు ఈ ప్రతిపాదన చేయడం స్వాగతించాలి. పోలవరం తొలి దశ నిర్మాణంలో ఉన్న సమయంలోనే రెండవ దశ డీపీఆర్‌కు ప్రతిపాదనల రూపకల్పన చేయడానికి ఏ అడ్డంకీ ఉండదు. అయితే ఈ ప్రతిపాదన అమలు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి స్థాయిలో జరిగే పరిస్థితి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ వద్దనే నేరుగా చంద్రబాబు ప్రస్తావన చేయడం అవసరం. 2014–19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి డీపీఆర్‌ను కేంద్ర జల శక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలో 2017–18 షెడ్యూల్ రేట్లతో 55,548.83 కోట్ల రూపాయల అంచనాలతో ఆమోదించింది. అనంతర కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అంతా మూలన పడింది.


ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ముఖ్యమైన అంశం కూడా కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు జీవన్మరణ సమస్యగా ఉంది. వంశధార జలాల వివాదంపై ట్రిబ్యునల్ 2017లోనే ముసాయిదా తీర్పు ఇచ్చింది. వంశధారపై ఆంధ్రప్రదేశ్ నేరెడి వద్ద బ్యారేజీ నిర్మించుకోవచ్చని చెప్తూ, దానితో పాటు కాట్రగడ వద్ద సైడ్‌వేర్ నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఒడిషా భూభాగంలో 106 ఎకరాల ముంపు ఉంటుందని ఇందుకు ఆ రాష్ట్రం అంగీకరించాలని తీర్పు ఇచ్చింది. 2019లో ఒడిషా సుప్రీంకోర్టుకెక్కింది, కానీ కోర్టు స్టే ఇవ్వలేదు. తిరిగి జగన్మోహన్‌రెడ్డి హయాంలో 2021లో ట్రిబ్యునల్ తుది తీర్పు అదే విధంగా ఇచ్చింది. కానీ ఒడిషాతో ఉన్న రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ తుది తీర్పుపై స్టే లేకున్నా నోటిఫై చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు, ఒడిషా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపివుంటే సమస్య సామరస్యంగా పరిష్కారమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖను కోరడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. నేరెడి బ్యారేజీ నిర్మాణం జరిగితే 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణమైన హీరమండలం రిజర్వాయర్‌కు గ్రావిటీతో నీళ్లు అందుతాయి. అదే జరిగితే ఆ జలాశయం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టకు వంశధార నీళ్లు చేరి, రెండు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించవలసిందే.

n వి.శంకరయ్య

విశ్రాంత పాత్రికేయుడు

ఇవి కూడా చదవండి

2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..

Updated Date - Dec 27 , 2025 | 01:16 AM