Share News

Footprints of My Ancestors: తొలిజాడలు

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:00 AM

నా పూర్వీకులు నడిచిన దారుల్ని వెతుకుతూ పోతాను... రాతిపై అతుక్కుపోయిన రక్తపు మరకల్ని గుర్తుపట్టి మృదువుగా హత్తుకుంటాను. గరుకుపాదాలు హృదయాన్ని వెచ్చగా తాకాయి...

Footprints of My Ancestors: తొలిజాడలు

నా పూర్వీకులు నడిచిన దారుల్ని

వెతుకుతూ పోతాను...

రాతిపై అతుక్కుపోయిన రక్తపు మరకల్ని

గుర్తుపట్టి మృదువుగా హత్తుకుంటాను.

గరుకుపాదాలు హృదయాన్ని వెచ్చగా తాకాయి...

నా పూర్వీకులు విడిచిపెట్టిన

గ్రామాల్ని చేరుకుంటాను.

భూమిలో ఇంకిపోయిన కన్నీటి మడుగులు,

మట్టిలో నిద్రిస్తున్న మరణించిన వారి స్వప్నాలు...

ద్రిమ్మరులై, ముసాఫిరులై ఏ కొండలపైకో,

ఏ నదీ తీరాలవైపో సాగిపోతూ...

పచ్చిక బయళ్ళలో ఆలమందలను,

బోడగుట్టల్లో గొర్రెపిల్లలను

అక్కున చేర్చుకుని ఉంటారు.

నా పూర్వీకుల పాటలు వింటాను

పాటల్లో ప్రవహించిన దుఃఖం,

పాటల్లో గాయపడిన జీవితం,

రాగాల్లో తాండవమాడిన ఆనందం...

అవి పాడుతూ, వింటూ,

వారి గుండెల్ని హత్తుకుంటాను.

పాటలనిండా పర్చుకున్న

విస్తార జీవితాన్ని దర్శిస్తాను.

నా పూర్వీకులు చెప్పుకున్న కథలు వింటాను..

అన్నం మెతుక్కోసం యుద్ధాలు ఎలా చేశారు,

ఆత్మాభిమానం కోసం

ప్రాణాల్ని ఎట్లా సమర్పించుకున్నారు,

మనిషిగా చూడలేని రాజ్యంలో ఆయుధాలుగా

ఎట్లా మారారో వింటాను.

వారి కథలే చరిత్రగా,

వారి పోరాటమే యుద్ధాలుగా,

వారి పనితనమే నాగరికతగా,

వారి సమూహ సంస్కృతియే వారసత్వంగా

ఎట్లా వర్ధిల్లిందో తెలుసుకుని పులకించిపోతాను.

యోధులు నడిచిన కాలి బాటలే రహదారులని...

అడుగుల్లో అడుగులు వేస్తాను.

నా పూర్వీకుల మాటలు వింటాను..

శ్రమలో, చెమటలో, నిప్పును రాజేయడంలో,

మట్టిని పిసకడంలో పుట్టిన శబ్దాలు...

పదాలుగా కలబోసుకుని భాషగా మారడం,

అవి కావ్యాలై, నాటకాలై, ఇతిహాసాలై

భూమిమీద పలుకు సుగంధాలై

ఎట్లా పరవశించాయో విని ఆనందిస్తాను.

నా పూర్వీకుల దారుల్లో

ఒక మొక్క నాటి, ఒక శిల భద్రపరిచి,

నేను ఒకనాడు వారిలో కలిసిపోతాను!

తుమ్మల దేవరావ్

ఇవి కూడా చదవండి

బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని

రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గరు మృతి

Updated Date - Nov 24 , 2025 | 05:00 AM