Indian Army legend: ఫీల్డ్‌మార్షల్ కరియప్ప చేసిన ‘ముస్తాబు’
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:30 AM
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ ఒక ‘ముస్తాబు కార్నర్’ ఏర్పాటు చేయాలని, అక్కడ సబ్బు, దువ్వెన, తువ్వాలు వంటివన్నీ ఉంచాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు– సంతోషం. ఈ వార్త...
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ ఒక ‘ముస్తాబు కార్నర్’ ఏర్పాటు చేయాలని, అక్కడ సబ్బు, దువ్వెన, తువ్వాలు వంటివన్నీ ఉంచాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు– సంతోషం. ఈ వార్త చూడగానే నాకు ఆరు దశాబ్దాల నాటి స్మృతులు గుర్తుకొచ్చాయి.
మినూమసానీ ప్రజాస్వామ్య శిక్షణ సంస్థను స్థాపించారు. జేఆర్‌డీ టాటా, నానీ పాల్కీవాలా, మెహతా వంటివారు సభ్యులు. ఆ శిక్షణ శిబిరాలను గుంటూరులో కూడా నిర్వహించాం. ఒక శిబిరం ప్రారంభోత్సవం జనరల్ కరియప్ప చేతుల మీదుగా జరిగింది. విజయవాడ విమానాశ్రయంలో వారిని స్వాగతించి, గుంటూరు తీసుకొచ్చే పనిని నాకు పురమాయించారు. స్వతంత్ర భారత సైనికదళాల ప్రప్రథమ భారతీయ ప్రధానాధికారిగా 1949 జనవరి 15న ఆయన పగ్గాలు చేపట్టిన రోజును ప్రతి ఏటా ‘ఆర్మీడే’గా నిర్వహిస్తున్నారు. రిటైరయినాక ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. పెక్కు దేశాలకు సైనిక దళాల పునర్వ్యవస్థీకరణలో సలహాలిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ చేతుల మీదుగా 'Legion of Merit' అవార్డు అందుకున్నారు. 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో కరియప్ప కుమారుడు కాల్పులకు గురై పాకిస్థాన్ సైనికులకు చిక్కాడు. ఈ వార్త పాక్ రేడియో ప్రసారం చేసింది. ఇది విన్న పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, విశ్రాంత జీవనం గడుపుతున్న జనరల్ కరియప్పకు ఫోన్ చేసి జూనియర్ కరియప్పను విడుదల చేస్తానని చెబుతాడు. ‘‘అతడు నా బిడ్డ కాదు, భరతమాత ముద్దుబిడ్డ. మాతృభూమి పరిరక్షణకు పోరాడుతున్న దేశభక్తుడు. నీవు చూపిన ఔదార్యానికి నా కృతజ్ఞతలు. విడుదల చేస్తే యుద్ధ ఖైదీలుగా ఉన్న వారందరినీ విడుదల చెయ్యి. అంతేగానీ నా పిల్లవాడని ఒక్కడినే విడుదల చెయ్యవద్దు’’ అని వారించాడు. ఆ విధంగా, దేశ విభజన జరగక ముందు తనవద్ద జూనియర్ అధికారిగా పనిచేసిన అయూబ్‌ఖాన్ చూపిన చొరవను కరియప్ప తిరస్కరించారు.
విజయవాడ విమానాశ్రయంలో నేను కరియప్పకు స్వాగతం పలికి, కారులో గుంటూరు బయలుదేరాం. ఆజానుబాహువు– సూట్‌లో ఉన్న ఆయన డ్రైవర్ పక్కన ముందుసీటులో కూర్చున్నారు. ప్రయాణం సాగుతూండగా, మార్గంమధ్యలో అర్ధంతరంగా కారు ఆపమన్నారు కరియప్ప. గభాలున కారు దిగి, రోడ్డు పక్కనున్న ఓ ఐదేళ్ళ చిన్నపిల్లను సమీపించారు. తైల సంస్కారం లేక, చికిరిబికిరిగా జుట్టుతో ఉన్న ఆ పిల్లకు జేబులో నుంచి అద్దం తీసి చూపించి– ‘‘చూడు ఎంత వికారంగా ఉన్నావో?’’ అంటూ మరో జేబులో నుంచి ఒక రుమాలు తీసి ఆమె ముఖం తుడిచారు. ఇంకో జేబులో నుంచి మరో జేబుగుడ్డ తీసి, దానిలో ఫేస్ పౌడర్ వేసి ఆమెకు పూశారు. దువ్వెన తీసి తల దువ్వారు. మళ్లీ అద్దం చూపించి "See how beautiful you are?" (ఎంత అందంగా ఉన్నావో చూడు) Do you promise me to follow the same everyday? (ఇకపై, ప్రతిరోజూ ఇలాగే చేస్తావా?) అని అడిగాడు. ఆ పిల్లకు ఇదేమీ అర్థంగాక వింతగా చూస్తోంది. ఈయన ‘జై హింద్’ అని పిడికిలి బిగించి, పద వెడదాం అన్నారు నాతో.
ఇది అరవై మూడేళ్లనాటి ముచ్చట. ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంది.
డాక్టర్ యలమంచిలి శివాజీ
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..