Share News

Nuclear Arms Race: యుద్ధాలయుగం వైపు

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:44 AM

ఇప్పుడు ప్రపంచయుద్ధం స్థాయి పెరిగిపోయినట్లున్నది. యూరోపియన్ దేశాలు, అమెరికా కలిసి.. ఉక్రెయిన్ వెనకుండి రష్యాతో యుద్ధం చేస్తున్నా దాన్ని ప్రపంచ యుద్ధంగా ఎవరూ గుర్తించడం లేదు. ఈ లెక్కన ప్రపంచంలోని ముఖ్యమైన...

Nuclear Arms Race: యుద్ధాలయుగం వైపు

ఇప్పుడు ప్రపంచయుద్ధం స్థాయి పెరిగిపోయినట్లున్నది. యూరోపియన్ దేశాలు, అమెరికా కలిసి.. ఉక్రెయిన్ వెనకుండి రష్యాతో యుద్ధం చేస్తున్నా దాన్ని ప్రపంచ యుద్ధంగా ఎవరూ గుర్తించడం లేదు. ఈ లెక్కన ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలన్నీ గ్రూపులుగా ఏర్పడి యుద్ధం చేస్తేనే అది ప్రపంచయుద్ధం అయ్యేలా ఉంది! స్వీడన్‌కు చెందిన ‘స్టాక్‌ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (సిప్రి) గత జూన్ 16న తన వార్షిక నివేదికలో అణ్వాయుధాలు, యుద్ధాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 1990 దశాబ్దంలో కోల్డ్‌వార్ ముగిసిన తరువాత కనీసం 21వ శతాబ్దంలోనైనా ప్రపంచమంతటా శాంతి నెలకొంటుందని అందరూ సంతోషపడ్డారు. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే అలా అనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నీ తమ శక్తిమంతమైన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటూ వస్తుండడాన్ని కూడా మనం గమనించాలి.

రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా వంటి దేశాలు 2024 నుంచి తమ అణ్వాయుధాలను పెంచుకుంటూ, ఆధునీకరించుకుంటూ వస్తున్నాయి. ప్రపంచంలోని అభద్రతా భావ పరిస్థితులు 2022లో ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో బహిరంగమయ్యాయి. ఈ అభద్రతా పరిస్థితి కారణంగానే అన్ని దేశాలు తమ అణ్వాయుధాలను పెంచుకోవడం, ఆధునీకరించుకోవడం చేస్తున్నాయి. గతంలో అమెరికా, రష్యాల మధ్య జరిగిన అనేక అణ్వాయుధాల ఒప్పందాలు అటకెక్కాయి. ఇదంతా సిప్రి తన నివేదికలో పేర్కొంది.


సిప్రి నివేదిక ప్రకారం చైనా వద్ద 600 అణ్వాయుధాలున్నాయి. ఆ దేశపు అణ్వాయుధాల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాల కంటే వేగంగా పెరుగుతున్నది. భారతదేశం కూడా తన అణ్వాయుధాల సంఖ్యను ఒక మేరకు పెంచుకున్నది. ఇజ్రాయెల్ తన అణ్వాయుధ శక్తిపై మౌనం పాటిస్తోంది. కానీ ఆ దేశం కూడా తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న విషయం తెలియనిది కాదు. ఎగేవ్ ఎడారిలో ఉన్న ప్లుటోనియం ఉత్పత్తి కేంద్రాన్ని ఇజ్రాయెల్ మరింత అభివృద్ధి చేస్తోంది. అయితే మొత్తం అణ్వాయుధాల్లో 90 శాతం అమెరికా, రష్యా వద్దే ఉన్నాయి.

ప్రస్తుతమున్న 12,241 అణ్వాయుధాల్లో 9,600 అణ్వాయుధాలు సైనిక అవసరాల కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 3,900 అణ్వాయుధాలు మిస్సైల్స్, యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉన్నాయి. ఇందులోనే 2001 అణ్వాయుధాలు హై అలర్ట్ స్థితిలో ఉన్నాయి. అంటే ప్రపంచం ఎంత అభద్రతలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సిప్రి డైరెక్టర్ స్మిత్ తమ ఇయర్ బుక్ ముందుమాటలో ఒక హెచ్చరిక చేశాడు. ‘అణ్వాయుధాల నిర్మాణం కోసం మొదలైన ఈ కొత్త పోటీ, కోల్ట్‌వార్ కాలం నాటి పరిస్థితి కంటే చాలా ప్రమాదకరంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అణ్వాయుధాలు అనుసంధానిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది’ అని తెలిపాడు.


ప్రపంచ మార్కెట్‌ లాభాలను కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పటి వరకు క్రమబద్ధంగా నడుపుతున్న సంస్థలను, ఒప్పందాలను, చట్టాలను పక్కకు నెట్టి... సైనికబలం ద్వారా తమకు అనుకూలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమాన్ని నెలకొల్పాలని పాత ధనిక దేశాలు అనుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆయుధాలు, అణ్వాయుధాల పోటీ పెరుగుతున్నది. జూన్ 24, 25 తేదీల్లో నెదర్లాండ్‌లోని ‘ది హేగ్’లో జరిగిన నాటో దేశాల మంత్రులు, అధినేతల సమావేశం కూడా సిప్రి నివేదికను బలపరుస్తున్నది.

2035 వరకు నాటో దేశాలన్నీ, తమ దేశాల జీడీపీలో 5 శాతం వరకు ధనాన్ని నాటో బడ్జెట్‌కు కేటాయించాలని ‘ది హేగ్‌’ సమావేశంలో నిర్ణయించాయి. దీనికి స్పెయిన్, బెల్జియం, స్లోవేకియాలు అభ్యంతరం తెలిపాయి. అయితే 32 సభ్య దేశాలు ఉన్న నాటోలో ఒకటి రెండు దేశాలు ఈ ప్రతిపాదనను అంగీకరించనంత మాత్రాన నాటో బడ్జెట్ పెరుగుదలలో పెద్ద తేడా ఏమీ రాదు. నాటో బడ్జెట్ పెరగడం అంటే ఆయుధాల పోటీ, ఉద్రిక్తతలు, యుద్ధ అవకాశాలు పెరగడమే.

యూరప్‌కు రష్యానే పెద్ద ప్రమాదమనీ, భవిష్యత్తులో యూరప్‌లోని దేశాలపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని, అందుకే నాటో బడ్జెట్ పెంచుతున్నట్లు ఈ సమావేశంలో నేతలు వెల్లడించారు. యూరప్‌, ఆమెరికా దేశాలు రష్యాతో యుద్ధం చేసినా చేయకపోయినా తమ ఆధునిక ఆయుధ బలంతో ప్రపంచంపై పెత్తనం చేస్తూ, సరుకులుగా పాత ఆయుధాలు అమ్ముకోవచ్చు.


కారణాలు ఏవైనా అన్ని దేశాలు తమ ఆధునిక ఆయుధాలు, అణ్వాయుధాలను పెంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ డిజిటల్ రంగాలు, అంతరిక్షం అన్ని యుద్ధానికి వేదికలుగా సిద్ధమవుతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ప్రపంచ నాటక రంగంలో శాంతి అధ్యాయానికి తెరపడబోతున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచం యుద్ధాల యుగంలోకి, కల్లోల కాలంలోకి అడుగు పెడుతున్నది.

లంకా పాపిరెడ్డి

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:44 AM