రాజధాని మార్పు నాటకాలకు తెర
ABN , Publish Date - May 15 , 2025 | 01:52 AM
రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని అని అంటే, 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి గందరగోళానికి తెరలేపింది. దీంతో విడిపోయి పదకొండేళ్లయినా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు...
రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని అని అంటే, 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి గందరగోళానికి తెరలేపింది. దీంతో విడిపోయి పదకొండేళ్లయినా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక, శాశ్వత రాజధానిగా ఉండేలా రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది. కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటే రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా ఆవిర్భవిస్తుంది. విభజన చట్టం–2014లోని సెక్షన్–5, సబ్‌సెక్షన్–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు. కానీ, ఆ రాజధాని పేరు మాత్రం చెప్పలేదు. దీంతో కేంద్రం కొత్త రాజధాని అమరావతి అని చెప్తూ ఆ సెక్షన్‌ను సవరిస్తే అమరావతి చట్టబద్ధమవుతుందనీ, దీంతో రాజధాని మార్పు నాటకాలకు తెరపడుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, రాష్ట్రం ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ ఏ ప్రాంతాన్నైనా రాజధానిగా ప్రకటించవచ్చు. అంతేకాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం, రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే ఉంది. అందువల్ల, కేంద్రం ప్రమేయం అవసరమా? అన్న ప్రశ్న లేకపోలేదు. కానీ, కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరించడానికి ముఖ్య కారణం– గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమే. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు రాజధానుల ఆలోచనను తిరస్కరించి, అమరావతినే నిర్ధారించినా వైసీపీ ప్రభుత్వం కొనసాగినంత కాలం రాజధానిపై గందరగోళమే నెలకొన్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధాని విషయంలో గందరగోళానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన 13వేల కోట్ల రూపాయిలకు పైగా నిధులతో అమరావతి పునర్ నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. ఈ పెట్టుబడులు సురక్షితంగా ఉండాలంటే, రాజధాని విషయంలో స్థిరత్వం అత్యంత ప్రధానం. కేంద్ర చట్టంలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తే, పెట్టుబడిదారులకు, ప్రజలకు ఇది శాశ్వత రాజధాని అనే నమ్మకం కలిగి, అభివృద్ధికి దారులు పడతాయి. అమరావతి కోసం 2015లో 33 వేల ఎకరాల సారవంతమైన భూమిని ల్యాండ్ పూలింగ్ పథకం కింద రైతులు ఇచ్చారు. 2022లో హైకోర్టు తీర్పు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వాళ్లకు ఊరట కలిగించాయి. కేంద్ర చట్టంతో అమరావతిని శాశ్వతం చేయాలనే రాష్ట్రం ఆలోచన వాళ్ల త్యాగాన్ని కాపాడాలనే సంకల్పాన్ని చూపిస్తోంది.
చిత్తర్వు రఘు, అడ్వకేట్
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి