Share News

Empowering Indian Youth: యువత ఆడాలి భారత్ గెలవాలి

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:31 AM

ప్రతి సంవత్సరం ఆగస్టు 29న, భారతదేశం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ రోజు కేవలం ఒక హాకీ లెజెండ్‌ను స్మరించుకోవడానికి మాత్రమే కాదు, ‘దేశ క్రీడా రంగాన్ని క్షుణ్ణంగా సమీక్షించుకోవడానికి...

Empowering Indian Youth: యువత ఆడాలి భారత్ గెలవాలి

ప్రతి సంవత్సరం ఆగస్టు 29న, భారతదేశం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ రోజు కేవలం ఒక హాకీ లెజెండ్‌ను స్మరించుకోవడానికి మాత్రమే కాదు, ‘దేశ క్రీడా రంగాన్ని క్షుణ్ణంగా సమీక్షించుకోవడానికి, దాని గతం నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, వర్తమాన సవాళ్లను విశ్లేషించడానికి, భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించడానికి’ గొప్ప అవకాశం. జనాభా పరంగా పెద్ద దేశమైనా, ఒలింపిక్‌ పతకాల సంఖ్య పరంగా మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. దీనికి కారణాలు అనేకం. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మన పతకాల స్థానం కొంత మెరుగుపడినా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది.

భారతదేశం 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మన క్రీడా వ్యవస్థను సమూలంగా మార్చాలి. కేవలం నగరాల్లో ఆధునిక స్టేడియాలను నిర్మించడమే కాదు, క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి ప్రపంచ స్థాయి శిక్షణను అందించడం పట్ల దృష్టి సారించడం తప్పనిసరి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం క్రీడా వికాసానికి జాతీయ స్థాయి విధానాలను రూపొందించాలి. దీనిలో పాఠశాల స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయి వరకు అన్ని దశలను స్పష్టంగా నిర్వహించాలి. నేషనల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించి, విద్యలో క్రీడలను తప్పనిసరిగా భాగం చేయాలి. క్రీడా రంగానికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి, వాటిని పారదర్శకంగా పంపిణీ చేయాలి. ఖేలో ఇండియా ప్రోగ్రాంను మరింత విస్తృతంగా, సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించాలి. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ పథకాన్ని మరింతగా విస్తరించాలి. క్రీడా వికాసంలో స్పోర్ట్స్ సైన్స్, ఫిజియాలజీ, సైకాలజీ వంటి శాస్త్రాలను ఉపయోగించుకోవాలి. క్రీడాకారుల పనితీరును మెరుగుపరచడానికి డేటా, విశ్లేషణాత్మక సమాచారం ఆధారంగా శిక్షణనివ్వాలి. విదేశీ కోచ్‌లను నియమించి, భారత కోచ్‌లకు అధునాతన శిక్షణ ఇప్పించాలి. క్రీడా సమాఖ్యల పనితీరును పారదర్శకంగా పర్యవేక్షించాలి. వాటిలో ఉన్న అవినీతి, స్వయంప్రతిపత్తి లేమి వంటి సమస్యలను పరిష్కరించాలి.


భారతదేశంలో యువతకు కొదవలేదు. కానీ నేటి సాంకేతిక యుగంలో మైదానంలో ఆటలు ఆడాల్సిన పిల్లలు, యువత వీడియో గేమ్స్‌, ఇతర సామాజిక మాధ్యమాల యాప్స్‌, ఆన్లైన్‌ గేమ్స్‌ వంటి వాటికి అలవాటు పడడం దురదృష్టకరం. యువత ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చి మైదానంలో క్రీడల్లో పాల్గొనే విధంగా చేయడమే కాదు, వారి ప్రతిభను గుర్తించి, వారికి సరైన మద్దతు, ప్రోత్సాహం అందించడం ప్రభుత్వాల బాధ్యత.

డా. రావుల కృష్ణ

అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్‌సియు

ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:47 AM