Share News

BC Reservation: 42శాతం స్ఫూర్తితో బీసీలను గెలిపించాలి!

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:51 AM

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదా సమర్పించి, తుది రూపానికి ఆమోదముద్ర వేసేముందు చేసిన ప్రసంగంలో ‘జనవరి 26, 1950న మనం...

BC Reservation: 42శాతం స్ఫూర్తితో బీసీలను గెలిపించాలి!

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదా సమర్పించి, తుది రూపానికి ఆమోదముద్ర వేసేముందు చేసిన ప్రసంగంలో ‘జనవరి 26, 1950న మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలో ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా మనకు సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక, ఆర్థిక జీవితంలో మనకు అసమానత ఉంటుంది. మనం ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించాలి. లేకుంటే అసమానతతో బాధపడేవారు ఈ అసెంబ్లీ ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని పేల్చివేస్తారు’ అని హెచ్చరించారు.

రాజ్యాంగం అమలులోకి రాకముందే కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కల్పించాలనే డిమాండ్ వచ్చిన నేపథ్యంలో, యావత్ భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులను పరిశీలించేందుకు ప్రభుత్వం జనవరి 29, 1953న కాకా కాలేల్కర్ కమిషన్‌ను నియమించింది. మార్చి 30, 1955న ఈ కమిషన్ తన నివేదిక అందజేసింది. కమిషన్ చైర్మన్ నివేదికతో పాటు ఒక ఉత్తరాన్ని జతపరిచి రాష్ట్రపతికి అందజేశారు. ఈ నివేదిక కులానికి ప్రాధాన్యత ఇచ్చిందని, ఇది సమాజానికి దేశానికి శ్రేయస్కరం కాదని, దీనిని తిరస్కరించాలని ఆ లేఖలో కోరారు. కుల ప్రాతిపదికను మొదటి కమిషన్ వ్యతిరేకిస్తే, కులాన్ని ఒక సూచికగా తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం మండల్‌ కమిషన్ తీర్పులో స్పష్టం చేసింది. 1992లో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఇచ్చిన తీర్పు ఫలితంగా తమిళనాడు సహా ఎన్నో రాష్ట్రాలలో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి ఇందిరా సహాని కేసు కూడా అగ్నిపరీక్ష ఎదుర్కొంది. తమిళనాడు 69శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ సుప్రీంకోర్టు విధించిన పరిధి వల్ల సందిగ్ధత ఏర్పడింది. దీంతో అసెంబ్లీలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి, 69శాతం రిజర్వేషన్లు అమలయ్యేటట్టు, సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిధి నుండి రక్షణ పొందడానికి రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చేట్టుగా అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పావులు కదిపారు. ఇనుమును వంచాలంటే అది వేడిగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలన్న నానుడిని ఆచరణలో చూపించారు. 2019లో పార్లమెంటు ఆమోదించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టంలో ‘ప్రస్తుత రిజర్వేషన్లతో పాటు’ ఆర్థికంగా బలహీనవర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్ అందిస్తుంది’’ అని ఉంది. ఈ పదబంధం మరొకసారి 50శాతం పరిమితి నిబంధనపై సందేహాలను రేకెత్తిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు పోక తప్పలేదు. మరొకవైపు శాసనసభలో చేసిన తీర్మానాలకు కట్టుబడి, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రక్షణ కల్పించేలా 9వ షెడ్యూల్‌ను ఆశ్రయించాలనే ఉద్యమం కొనసాగుతోంది. ప్రచార ప్రసార సాధనాల పుణ్యమా అని దీనికి సంబంధించిన అన్ని అంశాలు మారుమూల ప్రాంతాలకు కూడా చేరాయి.

2003లో అచ్చయిన ‘భారతదేశం యొక్క శాంతియుత విప్లవం – ఉత్తరభారత రాజకీయాల్లో తక్కువ కులాల పెరుగుదల’ పుస్తకంలో, రచయిత క్రిస్టోఫ్‌ జాఫ్రెలట్‌ మండల్‌ కమిషన్ తదితర పరిణామాల గురించి సవివరంగా రాశారు. చట్టసభలలో ఓబీసీ కులాల సంఖ్య పెరగడాన్ని గణాంకాల ద్వారా వివరించారు. ఇందులోని ప్రతి అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పకుండా విభిన్నమైన దృక్పథాలతో చూస్తారు. ప్రాస కోసం మండల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కమండల్ ఉద్యమాన్ని ప్రారంభించిందని చేసిన అభియోగాలను బీజేపీ పటాపంచలు చేసింది. రాజకీయ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలతో, ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరివారానికి చెందిన సేవాభారతి అట్టడుగుస్థాయి ప్రజలను ఏ విధంగా ఆకర్షిస్తున్నదో, బీజేపీ అంచలవారీగా ఉన్నత వర్గాల వారికి చట్టసభల్లో స్థానాలు తగ్గించి, బీసీ వర్గాలకు స్థానాలు పెంచడం వల్ల సామాజిక సమరసతతో పాటు బీసీ నాయకులను ఎన్నికలలో గెలిపించిన చరిత్ర ఈ తరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాబోయే జనగణనలో కులగణనను చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. రిజర్వేషన్లపై ప్రధానమంత్రి వైఖరి ఎస్సీ వర్గీకరణలో ఇదివరకే స్పష్టమైంది. చట్టపరంగా బీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ గత 30 సంవత్సరాలకు పైగా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.


మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగుబిడ్డ పి.నరహరి (ఐఏఎస్) రాసిన ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకం అందరినీ ఆలోచింపచేస్తుంది. అందులో రచయిత 08–08–2022న లోక్‌సభ ప్రశ్న నెంబర్ 3660కు భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖ ఇచ్చిన జవాబు ఆధారంగా ముద్ర యోజన రుణాల పంపిణీలో అసమానతలను వివరించారు. ఓబీసీ–జనరల్ కోటాలో మంజూరైన ఆ రుణాల వివరాలు సంవత్సరాల వారీగా, శాతాలవారీగా ఈ విధంగా ఉన్నాయి. 2015–16లో జనరల్ 63శాతం– ఓబీసీ 22.4శాతం, 2016–17లో జనరల్ 62.2– ఓబీసీ 24.4, 2017–18లో జనరల్ 64.5– ఓబీసీ 20.7, 2018–19లో జనరల్ 68.6– ఓబీసీ 18.7, 2019–20లో జనరల్ 66, ఓబీసీ 19.4, 2020–21లో జనరల్ 65.5, ఓబీసీ 19.1. మండల్ కమిషన్ ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించినా, భారత జనాభాలో ఓబీసీల వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ రుణం పొందడంలో మాత్రం తక్కువగా ఉంది. సమాజంలో అట్టడుగు స్థాయి వరకు కారణాలను వెతికి, సవాళ్లను ఎదుర్కోవడానికి నిరంతర అవగాహన, సమైక్య పోరాటం అనివార్యం.

తెలంగాణ శాసనసభలో చేసిన ఏకగ్రీవ తీర్మాణాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు 42శాతం రిజర్వేషన్ల స్ఫూర్తితో బీసీ సభ్యులను గెలిపించుకోవాలి. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికకు పార్టీ గుర్తు ఉండదన్న నెపంతో వీరిని కటీ పతంగులుగా చేస్తే అసెంబ్లీ తీర్మానాలకు విలువ ఉండదు.

సీహెచ్. విద్యాసాగర్‌రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 05:51 AM