Share News

Higher Education in Telangana: ఎయిడెడ్‌ పై మీ హామీ మరువద్దు

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:34 AM

సమాజ పురోగతికి విద్య అవసరాన్ని గుర్తించిన పెద్దలు సొసైటీల ద్వారా విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలకు 1963లో ప్రొఫెసర్ డి.సి.రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే విధానం...

Higher Education in Telangana: ఎయిడెడ్‌ పై మీ హామీ మరువద్దు

గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి...

సమాజ పురోగతికి విద్య అవసరాన్ని గుర్తించిన పెద్దలు సొసైటీల ద్వారా విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలకు 1963లో ప్రొఫెసర్ డి.సి.రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే విధానం అమలులోకి రావడంతో ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు అభివృద్ధి చెందాయి. కొన్ని కళాశాలలకు ప్రభుత్వమే ఉచితంగాను, మరికొన్ని కళాశాలలకు నామమాత్రపు లీజుకు భూమిని సమకూర్చింది. అంతెందుకు ప్రభుత్వ భూమి లీజు ద్వారానే మీరు డిగ్రీ చదివిన ఆంధ్ర వివేకవర్ధిని (ఎ.వి.) కళాశాల కూడా ఏర్పడింది. అలాగే, వెనుకబడిన ప్రాంతమైన వికారాబాద్‌లో రైతులు తాము పండించిన ధాన్యాన్ని మార్కెట్లో అమ్మిన ప్రతి బస్తాపైనా ఒక రూపాయిని ఇచ్చారు. అలా పోగుచేసిన డబ్బుతో ‘వికాస మండలి’ అనే సొసైటీ ద్వారా అనంత పద్మనాభ కళాశాలను 43 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యేలా సహకరించారు. ఇలాంటి సహకారానికి తోడు కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యుజీసీ) ద్వారా నిధులను సమకూర్చటంతో ఇవి మినీ యూనివర్సిటీలుగా అభివృద్ధి చెందాయి. ఇవాళ ఆంధ్ర వివేకవర్ధిని (ఎ.వి.) కళాశాలతో పోటీ పడగల ప్రభుత్వ కళాశాల ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ కోవలో వివేకవర్ధిని (వి.వి.) కళాశాల, బద్రుక కళాశాల, ఎగ్జిబిషన్ సొసైటీ కింద ఏర్పాటైన సరోజినీనాయుడు వనిత మహా విద్యాలయం, సర్దార్ పటేల్ కాలేజీ, కస్తూర్బా గాంధీ మహిళా కళాశాల, వరంగల్‌లోని లాల్‌బహుదూర్ కళాశాలతో పాటు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళాశాల, రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల, భవన్స్ న్యూ సైన్స్ కళాశాల, ఓరియంటల్ కళాశాల... ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు అవుతుంది. వెనుకబడిన మన తెలంగాణ విద్యాభివృద్ధిలో ఇవి గుణాత్మకమైన పాత్రను పోషించిన విషయం మీకు తెలియంది కాదు.


కానీ వైపరీత్యమేమంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన కేసీఆర్‌ ప్రభుత్వం ఈ కళాశాలలను గాలికి వదిలివేసింది. దీనితో అప్పటి కళాశాల ఉన్నత విద్యా కమిషనర్ జీఓ.ఆర్‌సి.నెం.890, విద్య (సి.ఇ.–II) శాఖ తేదీ:2–8–1996 నిబంధనను ఆధారం చేసుకొని మూకుమ్మడిగా ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని ప్రభుత్వ కళాశాలల్లోకి రీడిప్లాయ్‌ చేశారు. కానీ ఆయన ఉదహరించిన జీఓ నిబంధన ఏం చెబుతోందంటే, ఆయా కళాశాలల్లో తగినంత మంది విద్యార్థులు లేనప్పుడు ఆ ఉపాధ్యాయుడిని అవసరమైన దగ్గరి ఎయిడెడ్ కళాశాలలకు ఆన్ డ్యూటీపై బదిలీ చేయాలి. అక్కడ అవసరం లేనప్పుడు మాత్రమే ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేయాలని చెబుతోంది. అలాగే, ఎయిడెడ్ విద్యకు భిన్నమైన మార్పులను యజమాన్యాలు తీసుకురావాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విద్యా చట్టం–1982 చెబుతున్నది. కానీ పైన పేర్కొన్న నిబంధననూ, విద్యా చట్టాన్నీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్నత విద్యా కమిషనర్ ఈ కళాశాలలను పూర్తిగా ప్రైవేటుగా నడుపుకోవటానికి అనుమతి ఇచ్చారు. ఇందువల్ల అప్పటివరకూ పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్యను అందించటంలో అగ్రభాగంలో ఉన్న కళాశాలలు తెరమరుగైపోయాయి. పోరాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో ఇదీ గత ప్రభుత్వం వెలగబెట్టిన ఘనకార్యం.


మీ మంత్రివర్గ సహచరుడు దుద్దిల్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకి ‘ఎయిడెడ్‌ కళాశాలల పరిస్థితిని మార్చాలి’ అని మేము విన్నవించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు. అంతేగాక, ఈ కళాశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్న హామీని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇది చాలా సానుకూలమైన అంశంగా మేము భావించాం. ఇప్పటికైనా ఈ హామీ అమలు దిశగా ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు కొనసాగేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ డిగ్రీ కళాశాలలన్నీ ప్రభుత్వ భూములతో, యూజీసీ సహకారంతోనే అభివృద్ధి చెందాయి. అటువంటప్పుడు వాటిని ప్రభుత్వపరం చేయవచ్చని, అలా ప్రభుత్వపరం చేయటానికి యాజమాన్యం సిద్ధపడకపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమికి మార్కెట్ ధర ఆధారంగా చెల్లించాలని కూడా విద్యా చట్టం–1982 చెబుతోంది. ఈ రకంగా ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం తీసుకోవడం వల్ల అదనంగా ఎలాంటి భారం పడకుండానే ప్రభుత్వ విద్య మరింత బలపడడానికి, అలాగే అందరికీ ఉన్నత విద్య అందుబాటులో రావడానికి దోహదపడుతుంది. ఇందువల్ల ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన భారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీని ఉత్త మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో దాన్ని అమల్లోకి తెస్తారని విద్యారంగ శ్రేయోభిలాషులుగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.

ప్రొ. జి.హరగోపాల్, ప్రొ. కె.లక్ష్మీనారాయణ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్), ప్రొ. ఆమంచి నాగేశ్వరరావు (ఉస్మానియా యూనివర్సిటీ),

డా. ఎడమ శ్రీనివాస్‌రెడ్డి (విద్యారంగ నిపుణులు),

డా. ఎ.సంజీవయ్య (ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘం),

డా. ఎ.శంకర్ నాయక్ (గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్), డి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణ (తెలంగాణ విద్యావంతుల వేదిక),

పూస మల్లేశ్‌ (హైకోర్టు అడ్వకేట్), ప్రొ. గంటా జలంధర్‌రెడ్డి,

ప్రొ. ఎస్‌.బిక్షం, ప్రొ. సిల్మా నాయక్, ప్రొ. సిహెచ్‌.బిక్షపతి,

డా. సి.రాజేశ్వర్, ప్రొ. వాసా ప్రభాకర్, ప్రొ. పట్టా వెంకటేశ్వర్లు

ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 01:34 AM