Venkaiah Naidu Dree Schemes: వెంకయ్య సలహాలు నేతలకు నచ్చుతాయా
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:25 AM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేసే ఉచిత పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, అప్పులు చేసి ఉచిత పథకాలను అమలు చేయడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలుగు...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేసే ఉచిత పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, అప్పులు చేసి ఉచిత పథకాలను అమలు చేయడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేసిన హితబోధ ఆచరణాత్మకమైనదే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అభివృద్ధికి సూచిక కాదని, ఈ పథకాన్ని అమలుచేయాలని మహిళలెవరూ కోరలేదని తెనాలిలో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో ఆయన చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. అర్హులైన పేదవారి అభివృద్ధికి ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైన సహాయ సహకారాలు అందించాలే తప్ప, ప్రజలను సోమరిపోతులుగా మార్చే ఉచిత పథకాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, దేశ ప్రజల ఆత్మనిర్భరతను దెబ్బతీస్తాయని ఆయన అభిప్రాయం. ఎన్నికల సందర్భంలో ఉచిత పథకాల హామీలపై ఆయన అనేకమార్లు తన నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా ప్రేరణ పొందిన ఆయన... రాజకీయాల్లో హుందాతనాన్ని, దేశ హితాన్ని, సిద్ధాంత రాజకీయాలను ప్రోది చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. రాజకీయ పదవులకు దూరమైనప్పటికీ, దేశ హితం కోసం సలహాలు ఇవ్వడం మాత్రం ఆయన మానలేదు. రాజకీయాల్లో అజాతశత్రువు అయినందున, ఆయన ఆలోచనల ప్రభావం భవిష్యత్తు రాజకీయాలపై కొంత ఉంటుంది. ప్రతిపక్షాల్లో సైతం ఆయనను అభిమానించే నాయకులు ఉండడం ప్రత్యేకత.
ఉచిత పథకాల వల్ల అనర్హులు సైతం వాటిని పొందడం కోసం తప్పుడు మార్గాలు అవలంబిస్తారని, విలువల పరిరక్షణ పట్ల ప్రజలకు అనురక్తి తగ్గుతుందని ఆయన పలుమార్లు తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. వాస్తవ విషయాలను పరిశీలిస్తే- మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ప్రామాణికత లేదు. చార్జీ చెల్లించి ప్రయాణం చేయలేని మహిళలకు ఈ సౌకర్యం కల్పిస్తే- సామాజిక న్యాయం కొంత వరకు నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగులైన స్త్రీలు, కోటీశ్వరుల కుటుంబాల స్త్రీలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవడంలో ఎటువంటి సామాజిక న్యాయం లేదు. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత అనవసర ప్రయాణాలు ఎక్కువయ్యాయి. ప్రామాణికత లేని ఈ పథకాన్ని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందనే విషయం ఇక్కడ గమనార్హం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం కలిగిన ఫరవాలేదు, మా పార్టీ ఎన్నికల్లో గెలవాలనే దుర్నీతిని రాజకీయ పార్టీలు అనుసరించడమే ఇందుకు కారణం. జాతీయవాదాన్ని రాజకీయ సిద్ధాంతంగా అనుసరించే భారతీయ జనతా పార్టీ సైతం ఈ ఉచిత పథకాల ఉచ్చులో పడడం మరింత విస్మయం కలిగించే విషయం.
వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్ల విషయంలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. వాస్తవిక వయసును తగ్గించి, బోగస్ ఆధార కార్డులు పొంది, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న కేసులు ఎన్నో ఉన్నాయి. అంగవైకల్యం లేకపోయినా, డాక్టర్లను మేనేజ్ చేసి అనేకమంది వికలాంగుల పింఛన్లు పొందుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక రేషన్ కార్డులు పొందటానికి ఎవరు అర్హులు అనే విషయంలో రాజకీయ పార్టీల నాయకులకు స్పష్టత లేదు. రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని చాలా మంది ఉపయోగించకుండా బ్లాక్ మార్కెట్‌కు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఒక కేజీ బియ్యానికి 42 రూపాయలు ఖర్చు చేస్తోంది. రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడని ప్రజలు కేజీ 12 రూపాయల వంతున బయట అమ్ముకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇలా వృథా అయిపోతోంది. ఈ విషయంలో రాజకీయ నాయకులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గానీ, జాతీయవాద సంస్థల నాయకులు గానీ నోరు విప్పకపోవడం శోచనీయం. వాస్తవంగా ఉచిత పథకాలకు ఖర్చు చేసే ధనాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరుతాయి. ప్రజల భవిష్యత్తుకు ఒక పునాది లభిస్తుంది.
వెంకయ్యనాయుడు ఇచ్చిన సలహాలను రాజకీయ నాయకులు పాటిస్తారో, పాటించరో చెప్పలేం గాని, ఈ విషయంపై దేశ హితాన్ని కోరే ప్రజలలో చైతన్యం రావడం ఎంతైనా అవసరం.
ఉల్లి బాలరంగయ్య
సామాజిక విశ్లేషకులు
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News