Share News

Made in China 2025: చైనా చెప్పే డిజిటల్‌ పాఠాలు

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:02 AM

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్‌ నెలకొల్పనున్న నేపథ్యంలో సహజంగానే ఈ విషయంలో చైనా అనుభవం ప్రస్తావనకు వస్తుంది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అభివృద్ధి సాధిస్తేనే అమెరికాతో పోటీలో నిలువగలనని చైనా చాలా ముందుగానే...

Made in China 2025: చైనా చెప్పే డిజిటల్‌ పాఠాలు

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్‌ నెలకొల్పనున్న నేపథ్యంలో సహజంగానే ఈ విషయంలో చైనా అనుభవం ప్రస్తావనకు వస్తుంది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అభివృద్ధి సాధిస్తేనే అమెరికాతో పోటీలో నిలువగలనని చైనా చాలా ముందుగానే గ్రహించింది. తమ ఆర్థిక వ్యవస్థను ‘‘మధ్య–ఆదాయ ఉచ్చు’’ (Middle income trap) నుంచి బయటపడేసి, యావత్ ప్రపంచానికి చౌక సరుకులను ఉత్పత్తిచేసే ‘‘ప్రపంచ కర్మాగారం’’ అనే పేరును పోగొట్టుకుని, అత్యున్నత సాంకేతికత, మేధో సంపత్తులను సృష్టించే సంపన్న దేశం స్థాయికి చేరవలసిన అవసరాన్ని చైనా గుర్తించింది.

మిగిలిన ప్రపంచం ఇటీవల ట్రంప్ విధించిన సుంకాలతోను, అమెరికా రక్షిత ఆర్థిక విధానాలతోను మేల్కొన్నదిగానీ, చైనా అంతకంటే ముందే అప్రమత్తమయ్యింది. అప్రతిహత సాంకేతికతతో ప్రపంచ దేశాలపైన అమెరికా చెలాయిస్తున్న ఆధిపత్యం గురించి 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన విషయాలను చైనా గుర్తించి జాగ్రత్తపడింది.

2017లో అమెరికా ఎగుమతి చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన పరిష్కార ఒప్పందాన్ని పాటించడంలో ప్రముఖ చైనీస్ కంపెనీ ZTE విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా వాణిజ్యశాఖ ఈ కంపెనీపై ఆంక్షలు విధించింది. ఆ తరువాత ప్రపంచ నెట్‌వర్క్ పరికరాల తయారీదారులలో అతిపెద్దది, 5జీ సాంకేతికతలోను, సెల్‌ఫోన్ల తయారీలోను అగ్రగామిగా ఉన్న హువావేతో పాటు అనేక ఇతర చైనీస్ కంపెనీలు ‘ఎంటిటీ లిస్ట్’లో ఉన్నాయని 2019మే నెలలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఈ జాబితాలో ఉన్న కంపెనీలు అమెరికాలో పనిచేసే ఏ సంస్థతోనూ వ్యాపారం చేయలేవు. దీని ప్రకారమే హువావేకు అకస్మాత్తుగా గూగుల్, క్వాల్కామ్, ఇంటెల్ వంటి అమెరికన్ కంపెనీలతో సంబంధాలు తెగిపోయాయి. హువావే సెల్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించటం కూడా వీలు కాకుండాపోయింది.


ఇదంతా జరగడానికి చాలా ముందుగానే 2015లో ‘మేడ్ ఇన్ చైనా–2025 ఇనిషియేటివ్‌’ పేరుతో చైనా కొన్ని లక్ష్యాలను ప్రకటించింది. వీటిలో ముఖ్యమైనవి– తదుపరి తరం ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) అభివృద్ధిలో సెమీ కండక్టర్ల తయారీ; 5జీ అభివృద్ధి; ఏఐలో అగ్రగాముల జాబితాలో చేరటం... మొదలైనవి. 2025 నాటికి 70శాతం స్వయం సమృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాల దిశగా ప్రయివేటు రంగాన్ని, విశ్వవిద్యాలయాలను, పరిశోధనాశాలలను సమన్వయం చేసే పక్కా ప్రణాళికను, దాని అమలు వ్యూహాన్ని చైనా రూపొందించింది. ముందుగా వందల బిలియన్ డాలర్ల విలువైన నిధులను సిద్ధం చేసింది. ఈ నిధులతో దేశీయ ప్రయివేటు కంపెనీలకు సబ్సిడీలు, ఈక్విటీ పెట్టుబడులు, తక్కువ వడ్డీ రుణాలు, పన్ను మినహాయింపులు, భూముల కేటాయింపులు జరిగేలా చూసింది. ఈ కంపెనీలు అభివృద్ధి చేసే సాంకేతికలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా చూడడానికి ‘చైనా స్టాండర్డ్స్–2035’ ప్రణాళికను ప్రకటించింది.

విదేశీ కంపెనీలపై ఆధారపడటానికి బదులు దేశీయ ప్రయివేటు కంపెనీలను దిగ్గజాలుగా మార్చేందుకు ప్రయత్నించటం వల్ల చైనాలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఏర్పడింది. టెలీకమ్యూనికేషన్ పరికరాలలో హువావే, ZTE; సెమీకండక్టర్ తయారీలో SMIC, NAND; ఫ్లాష్ మెమొరీలో యాంగ్జీ మెమొరీ టెక్నాలజీస్; డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డిజిటల్ సేవలలో బైడు, అలీబాబా, టెన్సెంట్ (BAT) వంటి ప్రయివేటురంగ కంపెనీలు తమతమ క్షేత్రాలలో ప్రపంచ స్థాయి సాంకేతికతలను సాధించటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఒక సురక్షిత దేశీయ మార్కెట్‌ను సృష్టించింది. ఇక్కడ ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పోటీపడటానికి ముందు తగినంతగా వృద్ధి చెందుతాయి, ఆవిష్కరణలు చేస్తాయి.

మరోవైపు తమ కంపెనీలు మేధో సంపత్తిని సముపార్జించటం పైన కూడా చైనా దృష్టిపెట్టింది. విదేశీ కంపెనీలు విస్తారమైన చైనీస్ మార్కెట్‌ను ఉపయోగించుకోవడానికి ఒక షరతుగా వారు చైనీస్ భాగస్వాములతో జాయింట్ వెంచర్‌లను ఏర్పరచుకోవాలి, మేధో సంపత్తిని బదిలీ చేయాలి. అలాగే సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్‌ విద్యపైన భారీగా చేస్తున్న వ్యయం వల్ల ఏటా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్‌లను చైనా ఉత్పత్తి చేస్తున్నది. సాంకేతికతలో అభివృద్ధి చెందిన దేశాలతో అంతరాలను వేగంగా తగ్గించటానికి విభిన్న సాంకేతికలపై పట్టున్న అనేక ఐరోపా, ఇజ్రాయెలీ కంపెనీలను చైనీస్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇలా కొనుగోలు చేసిన సాంకేతికలను, బైడు, హువావే వంటి దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన వాణిజ్య ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికలను చైనా తన రక్షణ పరిశ్రమలలో వినియోగిస్తుంది. పరిశోధన, నిధులు, ప్రతిభను సైనిక, పౌర రంగాలు పరస్పరం పంచుకుంటాయి. అలా రెండింటిలోనూ ఆవిష్కరణలను వేగవంతం చేస్తారు. అంతేకాకుండా చైనా నిర్మించిన బలమైన ఇంటర్నెట్ వ్యవస్థలో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌లకు ప్రత్యామ్నాయంగా బైడు, విచాట్, అలీబాబా ఆవిర్భవించాయి. ఈ దేశీయ కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలుగా ఎదగడానికి, స్వదేశంలో ఆధిపత్యం చెలాయించడానికి కావలసిన రక్షణలతోపాటు నిధులను అందించి ప్రభుత్వమే వాటికి మార్గాన్ని సుగమం చేసింది. అంతేగాక కోట్లాది వినియోగదారులకు సేవలందించడం ద్వారా ఇ–కామర్స్, మొబైల్ చెల్లింపులు, ఏఐ అప్లికేషన్‌లకు అసమానమైన పరీక్షా క్షేత్రాన్ని చైనా ప్రభుత్వం అందించటంతో అభివృద్ధి వేగవంతమైంది.


వర్తమానంలో యావత్ మానవాళి జీవన విధానాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగే ఏఐ పైన, క్వాంటం కంప్యూటింగ్ పైన చైనా తన దృష్టిని కేంద్రీకరించి అమెరికాతో పోటీపడుతున్నది. ఒక దేశ కృత్రిమ మేధ (ఏఐ) నాణ్యత, క్వాంటం కంప్యూటర్‌ల అభివృద్ధి నేరుగా దాని డేటా, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలతో ముడిపడి ఉంటుంది. చైనా డేటా సెంటర్ల సామర్థ్యం ప్రపంచ డేటా సెంటర్ల వృద్ధి రేటుతో పోలిస్తే అత్యంత వేగంగా పెరుగుతోంది. చైనా డేటా సెంటర్ల ప్రస్తుత సామర్థ్యం 35 గిగావాట్లు (35వేల మెగావాట్లు). చైనా డేటా సెంటర్లు కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ వంటి అధునాతన సాంకేతికతల ఏకీకరణపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి.

చైనాలో ప్రయివేటు, పబ్లిక్ భాగస్వామ్య వ్యవస్థ (పీపీపీ) చాలా విస్తృతమైనది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా చైనా మౌలిక సదుపాయాల పెట్టుబడిలో పీపీపీలు అనుబంధ పాత్రను పోషిస్తున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంది. చైనాలో పీపీపీలు 2022కల్లా 16.5 ట్రిలియన్ ఆర్‌ఎమ్‌బి (దాదాపు 204 ట్రిలియన్ రూపాయలు. 1 ట్రిలియన్ అంటే 1 లక్ష కోట్లు) పెట్టుబడులతో 10వేల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.

చైనాలోని ప్రయివేటురంగం అంతర్జాతీయ స్థాయికి రావటానికి చైనా ప్రభుత్వ విధానాలు చాలావరకు కారణం. చైనా తన ప్రయివేటురంగ కంపెనీలను పెట్టుబడిదారీ దేశాలు కూడా ఊహించలేని స్థాయిలో ప్రోత్సహిస్తున్నది. ఉదాహరణకు 5జీఈ సాంకేతికతలో ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్న హువాయే కంపెనీ అమెరికా ఆంక్షలతో కుదేలయిన స్థితిలోవుండగా, చైనా ప్రభుత్వం 75 బిలియన్ డాలర్ల (రూ. 6.5లక్షల కోట్లు) విలువైన ఆర్థిక సహాయం చేసింది. దీనిలో పన్నురాయితీలే 25 బిలియన్ డాలర్లు (రూ. 2 లక్షల 20వేల కోట్లు). ఇలా ఒక ప్రయివేటు కంపెనీని నిలబెట్టటం ఏ పెట్టుబడిదారీ దేశంలోనూ సాధ్యపడదేమో.

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణంలో చైనా అమెరికాతో సమవుజ్జీగా మారటం 21వ శతాబ్దంలో కీలకమైన పరిణామం. ఇది సాంకేతికతలో ఏక ధ్రువంగా వున్న ప్రపంచం బహుళ ధ్రువంగా మారడాన్ని సూచిస్తుంది. దీనితో గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా బహుళజాతి కంపెనీలకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనే కాకుండా, అభివృద్ధి చెందిన వాటిలో కూడా అలీబాబా, టెన్సెంట్, హువావే క్లౌడ్ వంటి చైనా కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. చైనాలో ఇక ఏ మాత్రం ప్రాసంగికతలేని పశ్చిమ దేశాల కంపెనీలు ఇప్పటికే అక్కడి నుంచి నిష్ర్కమిస్తున్నాయి. ఈ పరిస్థితి భారత్, వియత్నాం, సౌదీ అరేబియా వంటి దేశాలకు లాభం చేకూరుస్తుంది. అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ఈ డిజిటల్‌ పోటీ రాబోయే దశాబ్దాలలో వర్ధమాన దేశాలకు అనుకూలంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

నెల్లూరు నరసింహారావు

సీనియర్‌ జర్నలిస్ట్‌

ఈ వార్తలు కూడా చదవండి:

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Updated Date - Nov 18 , 2025 | 06:02 AM