కాలుష్యరహిత నగరంగా ఢిల్లీ
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:57 AM
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది.. ప్రజాస్వామ్య నర్తన మహత్యమిది. అయితే ఈ సారి పాలక పక్షం మారిపోవడంలో....

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది.. ప్రజాస్వామ్య నర్తన మహత్యమిది. అయితే ఈ సారి పాలక పక్షం మారిపోవడంలో ఒక కీలక వ్యత్యాసమున్నది. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారు అన్న ప్రశ్నకు సమాధానంగా పలు అపరిష్కృత సమస్యలను ఓటర్లు ప్రస్తావించారు.. అవన్నీ ఢిల్లీ ప్రజలను ఎడతెగకుండా వేధిస్తున్నవే. అయినప్పటికీ అధికార పార్టీ వాటిని పరిష్కరించేందుకు సరైన ప్రాధాన్య మివ్వలేదు. ఏమిటా సమస్యలు? ఢిల్లీ నగరంలో 22 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న యమనా నది కాలుష్య కూపంగా మారిపోవడం అన్ని సమస్యలలోకి అగ్రగణ్యమైనది. ఆరోగ్యకరమైన శ్వాసను నిరోధిస్తున్న వాయుకాలుష్యం, వీధుల్లో పేరుకుపోతున్న చెత్త కుప్పలు మొదలైనవి కూడా ఢిల్లీవాలాలను పీడిస్తున్న సమస్యలు. ఇటువంటి పర్యావరణ సమస్యలను రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళికలలో తప్పక ప్రస్తావించేవి, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవి. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ వాసులు ఆ సమస్యల గురించి గొంతెత్తి చెప్పారు, ఎప్పుడు పరిష్కరిస్తారని రాజకీయ పార్టీలను, వాటి అభ్యర్థులను నిలదీశారు. ప్రజల ఈ నిక్కచ్చి వైఖరి పరిస్థితులలో మార్పుకు తప్పకుండా దారితీయగలదనే ఆశాభావం కలిగిస్తోంది.
యమునా నదిని పరిశుభ్రం చేసి, నిర్మల వాహినిగా మార్చేందుకు పూనుకుంటున్న కొత్త ప్రభుత్వం కొన్ని వాస్తవాలను స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మొదటిది–అధికారం నుంచి దిగిపోయిన ప్రభుత్వమూ, దానికి ముందున్న ప్రభుత్వమూ యమునా నదిని పరిపూర్ణంగా స్వచ్ఛపరిచేందుకు నిబద్ధతతో శ్రద్ధాసక్తులు చూపాయి. సందేహం లేదు. ఒక మురుగునీటి కాలువగా తయారయిన యమునా నదిలో పూర్వపు స్వచ్ఛతను పునరుద్ధరించేందుకు అన్ని ప్రభుత్వాలూ సంకల్పించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ రెండూ యమునానది ప్రక్షాళనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ఖర్చు చేశాయి. ఇక్కడ చెప్పవలసినదేమిటంటే ప్రభుత్వాల నిబద్ధత, ఆర్థిక వనరుల లభ్యతకు సంబంధించి ఎటువంటి లోటు లేదు.
ఇక రెండోది– యమునా నదిని సంపూర్ణంగా పరిశుభ్రం చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉన్నది. ఎంతయినా అది దేశ రాజధాని గుండా ప్రవహిస్తోంది కదా. అయితే ఈ కార్యాచరణ ప్రణాళిక అమలవుతున్న తీరుతెన్నులను ఉన్నత న్యాయస్థానాలు క్రమబద్ధంగా సమీక్షిస్తున్నాయి. ప్రతినెలా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఒక నివేదిక కోర్టుకు సమర్పిస్తోంది. కనుక కొత్తగా అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం యమునా నది ప్రక్షాళనకు అసలేమీ జరగలేదని, ఆ విషయం గురించి పట్టించుకోలేదని ఎట్టి పరిస్థితులలోను భావించకూడదు. ఎన్నికల ప్రచార పర్వంలో మాత్రమే అటువంటి విమర్శలు అభియోగాలు చెల్లుబాటు అవుతాయి. అయితే ఇప్పుడు నిర్ణయాత్మకంగా చర్యలు చేపట్ట వలసి ఉన్నందున అటువంటి వాద ప్రతివాదాలు ఎంతమాత్రం అర్థవంతమైనవి కాబోవు.
నిబద్ధతా పూర్వకమైన లక్ష్య శుద్ధితో, వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేసినప్పటికీ యమునా నది పరిస్థితి ఎందుకు మెరుగుపడలేదు? ఈ విషయమై ఇప్పుడు నిశిత, నిష్పాక్షిక చర్చ జరగవలసి ఉన్నది. యమునా నది ఢిల్లీ నగరంలోకి ప్రవేశిస్తున్న పల్లా అనే ప్రదేశంలో యమునా జలాల నాణ్యత సంవత్సరం పొడుగునా అనేకనెలల్లో శ్రేష్ఠంగా ఉంటుందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నెలవారీ నివేదిక స్పష్టంగా పేర్కొంటోంది. అయితే ఢిల్లీలోకి ప్రవేశించి తన 22 కిలోమీటర్ల ప్రస్థానాన్ని ఆరంభించిన తరువాత కొద్ది కిలోమీటర్ల దూరంలోనే యమునా వాహిని కాలుష్యమయమైపోతోంది. ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద నీటి నాణ్యతను తనిఖీ చేసే సమయానికి నదీజలాల్లో ఆక్సిజన్ పూర్తిగా హరించుకుపోతోంది. ఆక్సిజన్ కొరవడడమంటే యమునా జలాలు జీవరహితంగా మారిపోవడమే. దీన్నిబట్టి ఢిల్లీ నగరంలో నది ఒక మృత వాహినిగా అయిపోయిందని చెప్పక తప్పదు. వాస్తవమేమిటంటే కార్యాచరణ పథకం ప్రభావవంతం కావాలంటే దాన్ని పునః రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. యుమునా నది ప్రక్షాళనకు మనం చేయవలసినవి సరిగ్గా చేయడం లేదు. ఇదొక నిష్ఠుర సత్యం. దీన్ని అర్థం చేసుకోవలసిన అవసరమున్నది. ఈ దృష్ట్యా యమునా నది ప్రక్షాళన అజెండా ఎలా ఉండాలి?
Jagan Argument : అయోమయం... జగన్‘వాదం’!
తొలుత మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీడీ) నిర్మించడం పైనే కాకుండా నిలిపివేసి, శుద్ధికి తీసుకువెళ్లే మురుగు పరిమాణంపై కూడా దృష్టి పెట్టాలి. అంటే ఢిల్లీలోని చాలా విస్తృత ప్రాంతాలు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థలతో అనుసంధానం కాబడలేదనే వాస్తవాన్ని అంగీకరించవలసి ఉన్నది. ప్రస్తుత కార్యచరణ పథకం ఈ అనుసంధాన పనులకు పెద్దగా ప్రాధాన్యమివ్వడంలేదు. ఈ కారణంగానే సెప్టిక్ ట్యాంక్‌ల నిర్వహణకు డి–స్లడ్జింగ్ ట్యాంకర్స్‌పై ఆధారపడడం మినహా ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చేపట్టవలసిన కీలక చర్య డి–స్లడ్జింగ్ ట్యాంకర్లు అన్నిటినీ రిజిస్టర్ అయ్యేలా చూడాలి. వాటిలో జీపీఎస్ ఏర్పాటును తప్పనిసరి చేయాలి. ఆ ట్యాంకర్ల కదలికలను పర్యవేక్షించేందుకు ఒక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలి. సెప్టిక్ ట్యాంక్‌లలోని పంకంను విధిగా శుద్ధి కేంద్రాలకు తీసుకువెళ్లేలా చూడాలి. దీనివల్ల ఉపయోగించిన నీటిని, శుద్ధి చేసిన మలాన్ని పునః ఉపయోగించుకోవడం వీలవుతుంది. ఇక రెండోది శుద్ధిచేసిన వ్యర్థ జలాలను మోరీలలోకి వదలకూడదు. ఎందుకని? అలా చేయడం వల్ల అనుసంధానం కాబడని ప్రదేశాల నుంచి వచ్చిన శుద్ధిచేయబడని వ్యర్థజలాలతో కలిసిపోతాయి. శుద్ధిచేసిన మురికి ద్రవాలు, పదార్థాలను పునః ఉపయోగించాలి. ఢిల్లీ ఎకనామిక్ సర్వే ప్రకారం శుద్ధిచేసిన వ్యర్థ జలాలలో కేవలం 10 శాతాన్ని మాత్రమే తిరిగి ఉపయోగించుకోవడం జరుగుతోంది. చాలా ఎస్‌టీపీలు నది సమీపప్రాంతాలలో ఉండడం లేదు. ఈ కారణంగా శుద్ధిచేసిన వ్యర్థజలాలను శుద్ధి చేయబడని మురుగునీటిని నదికి తీసుకువెళుతున్న మోరీలలోకి వదిలివేయడం జరుగుతోంది. మరి యమునా జలాల నాణ్యత మెరుగ్గా ఉండకపోవడంలో ఆశ్చర్యమేముంది? ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని 22 మోరీల నిర్వహణకు ప్రాధాన్యమిచ్చేలా కార్యాచరణ పథకంలో మార్పులు చేయవలసిన అవసరమున్నది. ప్రతి మోరీ నిర్వహణకు ఒక ప్రత్యేక ప్రణాళికను ఉండేలా ఢిల్లీ ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. శుద్ధిచేయబడని మురుగునీరు నదిలోకి పారకుండా నిరోధించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలి. శుద్ధిచేసిన వ్యర్థ జలాలను శుద్ధిచేయబడని వ్యర్థ జలాలతో కలవకుండా చూడాలి.
ప్రస్తుతం ఢిల్లీ నగరం యమునానది నుంచి నీటిని తీసుకుని మురికి నీటిని తిప్పి పంపిస్తుంది. అలా కాకుండా నీటిని తీసుకుని శుద్ధిచేసిన వ్యర్థజలాలను మాత్రమే తిరిగి నదికి పంపేలా జాగ్రత్త వహించాలి. అప్పుడు మాత్రమే ఢిల్లీలో యమునా నది స్వచ్ఛ వాహినిలా పునర్జీవిస్తుంది.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్,
‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
Read Latest Telangana News And Telugu News