Jagan Reddy Downfall: కూలుతున్న జగన్ కోటలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:58 AM
నలభై ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటేశారు. గతంలో అక్కడ ఏ ఎన్నిక నిర్వహించినా రక్తపాతం జరగాల్సిందే. అయితే ఈసారి అలాంటి ఆటలేవీ సాగలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను...
నలభై ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటేశారు. గతంలో అక్కడ ఏ ఎన్నిక నిర్వహించినా రక్తపాతం జరగాల్సిందే. అయితే ఈసారి అలాంటి ఆటలేవీ సాగలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో అధికార యంత్రాంగం కూడా అంతే పట్టుదలగా తీసుకుంది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని, అధికార పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పోలింగ్‌కు ముందే పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పులివెందుల, ఒంటిమిట్ట స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు స్థానాల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో డిపాజిట్ కోల్పోయినందుకు జగన్‌రెడ్డి సిగ్గుపడాలి. నాడు కుప్పం పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినందుకు ‘చంద్రబాబు అసెంబ్లీకి వస్తే ఆయన ముఖం చూడాలని ఉంది’ అంటూ వెటకారంగా మాట్లాడిన జగన్‌రెడ్డి, నేడు పులివెందులలో డిపాజిట్ కోల్పోయినందుకు తల ఎక్కడ పెట్టుకుంటారో?!
ఎన్నికల్లో గెలుపునకు రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో జగన్‌రెడ్డి తన తండ్రి కంటే నాలుగాకులు ఎక్కువే చదివారు. సామ, దాన, భేద, దండోపాయాలతో ఓటర్లను ఓడించి మరీ తాను గెలవడానికి అలవాటుపడిన ఆయనకు ఈసారి దొంగ ఓట్లు గుద్దుకోవడానికి వీలు పడకపోయి ఉండవచ్చు. ఏ ఎన్నికలైనా ఏకపక్షంగా జరిగిపోవాలన్నదే ఫ్యాక్షనిస్టుల నైజం కదా! ఆ అక్కసుతోనే ఎన్నికల ఫలితాలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారు. చంద్రబాబూ! నీకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఈ ముసలి వయసులో కృష్ణా, రామా అనుకుంటూ ఉంటే కాస్త పుణ్యమైనా వస్తుంది. లేదంటే నరకానికి పోతావ్’ అంటూ సీఎం చంద్రబాబుపై ఈ పిచ్చిరెడ్డి నోరు పారేసుకున్నారు. డీఐజీ వ్యవస్థ మాఫియా ముఠా లాగా పనిచేస్తున్నదని, చంబల్ లోయ బందిపోట్లను మరిపించేలా దౌర్జన్యంగా ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఓ ఫ్రాడ్‌స్టర్ అంటూ ముఖ్యమంత్రిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం జగన్ నీచ రాజకీయానికి నిదర్శనం. అసలైన చంబల్ లోయ బందిపోట్లు ఎవరో ఆ పార్టీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను అడిగితే చెప్పగలరు. సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి నాయకుడు. ఆయన విలువ జగన్ వంటి మానసిక మరుగుజ్జులకు తెలియదు. అయిదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని నరికి పోగులు పెట్టినందుకే కేవలం 11 సీట్లిచ్చి, ప్రతిపక్షానికి కూడా జగన్ పనికిరాడంటూ ఆయన్ను జనం తరిమేశారు. అయినా తన బుద్ధి, భాషను జగన్ మార్చుకోవడం లేదు. పైగా మూడేళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నారు.
అసలు ప్రజాస్వామ్య హంతకుడు జగన్‌రెడ్డే. హిట్లర్, ముస్సోలిని, ఈడీ అమీన్, కిమ్ ఆలోచనల ప్రతిరూపమే జగన్. తాను అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో, ఫ్యూడలిస్టు స్వభావంతో పాలన సాగించారు. అధికారం కోసం ఏమైనా చేయగల ఔరంగజేబు జగన్‌రెడ్డి. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ధనం, మద్యం పంపిణీని అడ్డుకుంటున్నానని చెబుతూ, ఆ వంకతో తనకు అనుకూలంగా అనేక ఆర్డినెన్సులు, జీవోలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు 21రోజులు ఉన్న సమయాన్ని 14 రోజులకు తగ్గించారు. ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశాల్ని సైతం ప్రతిపక్షాలకు దూరం చేశారు.
నాటి స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేయకుండా జగన్ వర్గం అనేక రకాలుగా అడ్డుకోవడం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. ఎన్నికల అనంతరం ఒకవేళ ప్రతిపక్షం నుంచి ఎవరైనా గెలిచినా, ‘డబ్బు, మద్యం పంపిణీ చేశార’ని ఆరోపిస్తూ వారిపై జగన్ కేసులు పెట్టించారు. మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. ‘అసలు ఎన్నికల్లో ప్రతిపక్షం పోటీ చేయడం అవసరమా?’ అన్న విధంగా వ్యవహరించారు. 9,696 ఎంపీటీసీల్లో 2,362 స్థానాలు, 652 జెడ్పీటీసీల్లో 140 వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవన్నీ జగన్‌రెడ్డి అప్రజాస్వామికంగా గెలిచినవి కావా? పురపాలక ఎన్నికల్లో కూడా ప్రతిపక్షం నామినేషన్ వెయ్యలేకపోయింది.
బెదిరింపులతో, వేధింపులతో అక్కడా అధిక స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రతిపక్ష అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి మరీ వారి నామినేషన్లను ఉపసంహరింపజేశారు. ‘ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్‌ను ఆలస్యంగా మొదలుపెట్టించడం, ఆ సమయంలో కరెంటు కట్ చేయించడం, పోలీసులు ఎన్నికల ఏజెంట్లను బెదిరించి బయటకు పంపడం, తక్కువ ఓట్లతో ప్రతిపక్షం ఓడిపోయి రీ కౌంటింగ్ అడిగినా చెయ్యకపోవడం, అధికార పక్షమైన వైసీపీ తక్కువ ఓట్లతో ఓడిపోతే ఒకటికి రెండుసార్లు రీకౌంటింగ్ చేయించడం...’ వంటి వికృతాలు జగన్ పాలనలో ఎన్నో జరిగాయి. ఇవి స్వయంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు చెప్పిన వివరాలే సుమా! కార్పొరేషన్స్, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా వ్యవహరించారు. వాటిలో 578 ఏకగ్రీవాలు అయితే, అందులో 571 అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లు డబ్బాలు కొట్టుకున్నారు. అక్కడా ఏకగ్రీవాల వెనుక ఉన్నవి బెదిరింపు రాజకీయాలే. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించి, ప్రజాస్వామ్యాన్ని మేడిపండుగా మార్చారు. చట్టబద్ధ పాలనకు జగన్‌రెడ్డి సమాధి కట్టారు. ‘ప్రజాస్వామ్యం’ అన్న పదం ఆయన నోటి వెంట తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించదు.
కలిశెట్టి అప్పలనాయుడు
ఎంపీ, విజయనగరం
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News