Share News

నిరంతర కార్యాచరణతోనే రైతు సంక్షేమం

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:00 AM

మన దేశంలో ‘కరోనా’ కారణంగా నాలుగేళ్ల క్రితం దాదాపు అన్ని కీలక రంగాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయిన సమయంలో 140 కోట్ల దేశ ప్రజల ఆకలిని తీర్చింది వ్యవసాయ రంగమే. దేశానికి స్వాతంత్య్రం లభించిన కాలంలో...

నిరంతర కార్యాచరణతోనే రైతు సంక్షేమం

మన దేశంలో ‘కరోనా’ కారణంగా నాలుగేళ్ల క్రితం దాదాపు అన్ని కీలక రంగాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయిన సమయంలో 140 కోట్ల దేశ ప్రజల ఆకలిని తీర్చింది వ్యవసాయ రంగమే. దేశానికి స్వాతంత్య్రం లభించిన కాలంలో 25కోట్ల దేశ జనాభాకు రెండు పూటలా తినగలిగే ఆహార ధాన్యాలు పండించే పరిస్థితి లేదు. ‘పిఎల్‌–480’ అగ్రిమెంట్‌ ద్వారా ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేవాళ్లం. దానిని ‘షిప్‌ టు మౌత్‌’ ఎకానమీ అనేవారు. అంటే, విదేశాల నుంచి ఓడల్లో ఆహార ధాన్యాలు వస్తేనే ప్రజలకు తిండి లభించేది. అటువంటి దుర్భర పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేశారు. ఫలితంగా, తొలుత హరితవిప్లవం, ఆ తర్వాత క్షీర విప్లవం చోటుచేసుకున్నాయి. నేడు పుష్కలంగా ప్రజానీకానికి తిండిగింజలు అందుబాటులోకి రావడమేకాక ఎగుమతులు చేసే అవకాశం ఏర్పడింది. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ రైతుల పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టుగానే ఉంటున్నది.

సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీ (సీఎస్‌డీసీ) నివేదిక ప్రకారం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో 76 శాతం మంది రైతులు వ్యవసాయాన్ని మానుకొని ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లోకి మళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వ్యవసాయం ద్వారా ఆదాయం లభించకపోగా అప్పు మిగలడం; ఇంకా వ్యవసాయంలోనే కొనసాగితే తమ భవిష్యత్తు మరింత దుర్భరంగా మారుతుందేమోనన్న భయాందోళనలు; తరచుగా కరువు, వరదలు, చీడపీడల రూపంలో కలుగుతున్న అపార నష్టాలు; ప్రభుత్వాల నుంచి పంట నష్టపరిహారం అందించడంలో గానీ, కనీస మద్దతు ధరలు కల్పించడంలో గానీ ఆశించిన మేర సహాయ సహకారాలు లేకపోవడం; అప్పులు, ఇతరత్రా సమస్యల వల్ల కుటుంబంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడులు, అశాంతి. వీటితోపాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు సకాలంలో దొరక్కపోవటం; నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేకపోవడం; అష్టకష్టాలు పడి పంట పండిస్తే వాటికి కనీస మద్దతు ధర లభించకపోవడం; మార్కెట్‌లో దళారుల బెడద; సరైన ధర వచ్చేవరకు పంట ఉత్పత్తిని భద్రపర్చుకొనే గిడ్డంగుల సదుపాయం లేకపోవడం... ఇంకా అనేక సమస్యలు, సవాలక్ష కారణాలు దశాబ్దాల తరబడి భారత రైతాంగాన్ని వేధిస్తున్నాయి.


2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016లో ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకూ ఆచరణలో ఆ హామీ పూర్తిగా నెరవేరలేదు. డా. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు పంట వ్యయానికి 50శాతం కలిపి కనీస మద్దతు ధర అందిస్తామన్న హామీ నేటికీ ఆచరణలోకి రాలేదు. పైగా, ఆ ఫార్ములాను అమలు చేస్తే వినియోగదారుడిపై భారం పడుతుందని సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసి తప్పించుకున్నారు. కాగా, ఇటీవలి కాలంలో రైతులకు నష్టాలు పెరిగాయి. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ ఆదాయాలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయినట్లు 2023–24 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఫలితంగా, 2020లో ప్రతి మూడు రైతు కుటుంబాల్లో ఒకటి అప్పుల ఊబిలో కూరుకుపోగా, ప్రతి రుణగ్రస్థ రైతు కుటుంబం తలసరిన రూ.1.03 లక్షల అప్పు మోస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఆర్థిక సర్వే ప్రకారం గత ఐదేళ్లుగా దేశ వ్యవసాయాభివృద్ధి సగటు రేటు 3.5శాతం. ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. కానీ, రైతులకు ఒరిగింది శూన్యం. కారణం అధిక ఉత్పత్తి ఉన్నప్పుడు ధరల పతనం జరిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడటం. పంట అధికంగా పండినపుడు ఎగుమతులు చేసుకొనే వెసులుబాటు సామాన్య రైతులకు లేదు. మరో పక్క విదేశాల నుంచి పప్పుధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయలు దిగుమతి కావడంతో దేశీయ రైతాంగం ఆ పోటీని తట్టుకోలేకపోతున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల భారం పెరిగి రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.


నిజానికి, వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల్లో నేటికీ భారతదేశం అగ్రస్థానంలో ఉంది. కానీ, హెక్టారుకు వచ్చే సగటు ఉత్పత్తి, ఉత్పాదకతలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉంది. మొక్కజొన్న, వరి, గోధుమ, సోయా తదితర పంటల ఉత్పాదకతలో భారత్‌ వృద్ధి నత్తనడకన ఉండగా, బ్రెజిల్‌ లాంటి దేశాలు సైతం ఉత్పాదకతలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దేశ ఆహార భద్రతకు కీలకమైన వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్పు చేసే అవకాశం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. గతంలో కంటే మెరుగైన వాతావరణ అంచనాలను వేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అధిగ దిగుబడి ఇచ్చే వంగడాలను, విత్తనాలను వృద్ధి చేసుకోగలిగిన టెక్నాలజీ వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగంలో నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయ పరిశోధనలకు చేసే వ్యయాన్ని ఆయా దేశాలు పెట్టుబడిగానే పరిగణిస్తున్నాయి. వ్యవసాయరంగంలో సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వినియోగాన్ని ఆ దేశాలు వేగవంతం చేశాయి. ఇటీవల అత్యధిక శాతం ప్రజలు చిరుధాన్యాలవైపు మొగ్గు చూపుతున్నందువల్ల పంట మార్పిడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.


వ్యవసాయాన్ని ప్రాధాన్యతారంగంగా ప్రభుత్వాలు పరిగణించాలి. దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో పెద్దఎత్తున పరిశోధనలు జరపాలి. వాటి ఫలితాలను రైతాంగానికి అందించాలి. వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించాలి. రైతులకు అధిక ఆదాయాన్ని అందించే వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, ఉద్యానవనం పంటలు, మత్స్య ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించాలి. రైతాంగ కుటుంబాల విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కోసం గ్రామాలలో మౌలిక సదుపాయాలను విస్తరించాలి. రైతాంగ కుటుంబాల పిల్లలకు; చేతివృత్తులపై ఆధారపడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు తగిన పాఠశాలలు ఏర్పాటు చేయాలి. రైతు కుటుంబాల ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయాలి. విద్య, ఆరోగ్యం, ఉపాధి అందుబాటులో ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఆగిపోతాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ రంగాన్ని మెరుగుపర్చడానికి నిరంతర కార్యాచరణ అవసరం.

సి. రామచంద్రయ్య

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

శాసనమండలి సభ్యులు

Updated Date - Jul 03 , 2025 | 04:00 AM