Indian National Congress History: దేశ ప్రజాస్వామ్య చరిత్రే కాంగ్రెస్ చరిత్ర!
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:19 AM
కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కేవలం రాజకీయ చరిత్ర కాదు. అది త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పరిపాలన వరకు సాగిన భారత ప్రజాస్వామ్య గాథ. నిన్నటి పోరాటం, నేటి ఆలోచన, రేపటి ఆశ...
కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కేవలం రాజకీయ చరిత్ర కాదు. అది త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పరిపాలన వరకు సాగిన భారత ప్రజాస్వామ్య గాథ. నిన్నటి పోరాటం, నేటి ఆలోచన, రేపటి ఆశ... ఈ మూడింటి మధ్య వంతెనగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 1885లో ఏఓ హ్యూమ్ నేతృత్వంలో జరిగింది. ఆ రోజుల్లో ఇది ఒక సంస్కరణవాద వేదికగా ప్రారంభమైనప్పటికీ, కాలక్రమంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి వెన్నుదన్నుగా మారింది. స్వాతంత్ర్యం కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అనేక త్యాగాలు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు వేలాదిమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంవత్సరాల తరబడి జైళ్లలో ఉన్నారు. గాంధీ, నెహ్రూ, వల్లభాయిపటేల్, రాజేంద్రప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహానేతలందరూ దీర్ఘకాల కారాగార జీవితాన్ని అనుభవించారు. ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలు బ్రిటిష్ అణచివేతలో ప్రాణాలు కోల్పోయారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు పడ్డాయి. లౌకికత్వం, శాస్త్రీయ దృక్పథం, ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధి నెహ్రూ పాలనకు నిదర్శనాలుగా నిలిచాయి. ఆయన హయాంలో నిర్మితమైన భాఖ్రానంగల్, దామోదర్ వ్యాలీ, నాగార్జునసాగర్, హీరాకుడ్, కోసి డ్యామ్ వంటి భారీ సాగు నీటి ప్రాజెక్టులు దేశ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఈ ప్రాజెక్టులు వ్యవసాయాన్ని స్థిరపరిచి ఆహార భద్రతకు దారి తీశాయి.
ఇందిరాగాంధీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని రైతులు, పట్టణాల్లో నిరుద్యోగులు సమస్యలతో తల్లడిల్లారు. ఆహారం, విద్య, వైద్య వ్యవస్థలు అభివృద్ధి చెందలేదు. ఆర్థిక వృద్ధి ఉన్నా, దాని లాభాలు పేదలకు చేరలేదు. బ్యాంకులు, పరిశ్రమలు, భూములు, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండేవి. ఈ అసమానతను తొలగించాలన్న ఆలోచనతోనే ‘గరీబీ హటావో’ నినాదాన్ని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. పేదలకు రుణాలు దొరకని పరిస్థితిని మార్చాలని సంకల్పించారు. బ్యాంకుల జాతీయీకరణ చేసి పేదలకు రుణాలు, సబ్సిడీలు వంటి చర్యలకు సిద్ధమయ్యారు. ఇందిరా హయంలోనే రాజస్థాన్ ఎడారిని పచ్చగా మార్చిన ఉకాయ్ డ్యామ్, జయక్వాడి నిర్మితం అయ్యాయి.
రాజీవ్‌గాంధీ భారత రాజకీయాల్లో సాంకేతిక దృక్పథాన్ని ప్రవేశపెట్టారు. కంప్యూటరీకరణ, టెలికాం విస్తరణ వంటి నిర్ణయాలు నేటి డిజిటల్ భారతానికి పునాదులయ్యాయి. విదేశీ టెక్నాలజీ అంటే వ్యతిరేక భావన ఉన్న సమయంలో రాజీవ్‌గాంధీ కంప్యూటర్ల ప్రవేశానికి ధైర్యంగా మద్దతు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, రైల్వే, ఎయిర్‌లైన్స్‌లో కంప్యూటరీకరణకు బాటలు వేశారు. టెలిఫోన్ కమ్యూనికేషన్‌ను విస్తరించారు. ఎస్టీడీ, ఐఎస్డీ సేవలతో గ్రామీణ ప్రాంతాలకు టెలికాం సేవలు వేగంగా పెరిగాయి. సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతులను ప్రోత్సహించి యువతకు ఐటీ విద్యను దగ్గర చేశారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే 73వ, 74వ సవరణలు స్థానిక స్వయంపాలనకు కొత్త శక్తిని ఇచ్చాయి. రాజీవ్‌గాంధీ కాలంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలూ మొదలయ్యాయి.
మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా యూపీఏ–1, యూపీఏ–2 పాలనల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA–2005) గ్రామీణ పేదలకు పనిచేసే హక్కును, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి వంద రోజుల ఉపాధి హామీని కల్పించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసింది. యూపీఏ పాలనతోనే సమాచార హక్కు చట్టం (RTI–2005) పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కల్పించింది. విద్యాహక్కు చట్టం (RTE–2009) 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్యను మౌలిక హక్కుగా మార్చింది. ఆహార భద్రత చట్టం (NFSA–2013) పేదలకు తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు లభించేలా చేసి, కోట్లాది కుటుంబాలకు ఆహార భరోసాను కల్పించింది. అటవీ హక్కుల చట్టం (2006) అడవుల్లో నివసించే గిరిజనులకు భూమిపై, వనరులపై హక్కులు కల్పించింది. భూమి సేకరణ చట్టం (2013)– భూమి సేకరణలో రైతులకు న్యాయమైన పరిహారాన్ని తప్పనిసరి చేసింది. యూపీఏ ప్రభుత్వం మహిళల స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. సామాజిక సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం (2008) సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నడపగలిగింది. సంక్షేమం+వృద్ధి=సమతుల్య అభివృద్ధి నమూనా ముందుకు సాగింది. న్యూక్లియర్ ఒప్పందం (భారత్–అమెరికా పౌర అణు ఒప్పందం) అంతర్జాతీయంగా భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సంక్షేమ పథకాల లీకేజీల తగ్గింపు లక్ష్యంగా పౌరుల గుర్తింపు వ్యవస్థ ఆధార్ కార్డును తీసుకొచ్చింది.
ఇందుకు భిన్నంగా గత పదకొండేళ్లుగా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బొగ్గు గనులు, జాతీయ రహదారులను ప్రైవేటు పరం చేస్తున్నది. ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగించి ‘జీ–రామ్ జీ’ అని పేరును, ఆ చట్టంలో నిబంధనలు మార్చి, ఆ చట్టాన్ని దాదాపు నిర్వీర్యం చేసింది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నది. మరోపక్క రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దేశంలో మతం పేరుతో నిత్య దాడులు పెట్రేగిపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా నిర్మించలేదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ఐఐటీ, ఐఐఎం వంటి అత్యున్నత విద్యా సంస్థలు మేధో వనరులను సృష్టించి దేశాన్ని విజ్ఞాన ఆధారిత దేశంగా తీర్చిదిద్దాయి. కానీ బీజేపీ హయాంలో ఎన్ని కేంద్రీయ విద్యా సంస్థలు, ఎన్ని విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయో లెక్క చూస్తే నిరాశ కలుగుతుంది. ఇలాంటి పనులు గాలికి వదిలి, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి, ప్రభుత్వాలను కూలగొట్టే పని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఓట్ చోరీతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయి. మళ్ళీ మా నాయకుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. అందుకు తెలంగాణ నుంచి బీజం పడింది. రాష్ట్రంలోని ప్రజాపాలన దేశానికే ఆదర్శంగా నడుస్తున్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మళ్ళీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుస్తుంది.
పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి
(డిసెంబర్ 28: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం)
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..