కాంగ్రెస్ : కూలుతున్న మహావృక్షం
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:27 AM
భారతవని రాజకీయ మహావృక్షం భారత జాతీయ కాంగ్రెస్ క్రమేణా బలహీనపడుతోంది. పార్లమెంటులో ప్రభావశీలతను, ప్రజల్లో ఆకర్షణ శక్తిని కోల్పోతోంది. ఒకటి, రెండు మినహాయించి...
భారతవని రాజకీయ మహావృక్షం భారత జాతీయ కాంగ్రెస్ క్రమేణా బలహీనపడుతోంది. పార్లమెంటులో ప్రభావశీలతను, ప్రజల్లో ఆకర్షణ శక్తిని కోల్పోతోంది. ఒకటి, రెండు మినహాయించి ప్రతీ ఎన్నికలలోనూ ఈ జాతీయ సంస్థ ప్రాబల్యం సన్నగిల్లుతోంది. దేశ జనాభాలో సగానికి మించి ఉన్న యువతతో మమేకం కాలేకపోతోంది. అసలు యువజనులను తన వైపు ఆకట్టుకోవడంలో సాఫల్య వైఫల్యాలు అటుంచి కనీసం వారిని తన రాజకీయ కార్యకలాపాలలో భాగస్వాములుగా చేసుకునేందుకు ఒక అడుగు కూడ ముందుకు వేయడం లేదు.
దేశ ప్రగతి నిర్మాణ శక్తి యువతే కదా. అయినా యువ భారతీయులతో యువనేత రాహుల్‌గాంధీ సారథ్యంలో సైతం మమేకం కాలేకపోవడం కాంగ్రెస్ కష్టాలకు ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒకప్పుడు అనునిత్యం వివిధ కార్యక్రమాలతో నిమగ్నమై నేటి తరానికి మేటి నాయకులను అందించిన యువజన కాంగ్రెస్ నేడు ఫెక్సీలకు కూడ పనికి రాకుండ పోగా, విద్యార్ధి విభాగమైన ఎన్‌ఎస్‌యుఐ ఉనికినే కోల్పోయింది. గతంలో ఢిల్లీ కాంగ్రెస్‌లోనే కాదు జాతీయ స్ధాయిలో రాహుల్‌గాంధీ యూత్ బ్రిగేడ్‌లో ప్రముఖుడుగా భాసించిన సందీప్ దీక్షిత్ ఘోర పరాజయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన విషయం కానే కాదు. షీలా దీక్షిత్ తనయుడు అయిన సందీప్‌కు వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పతనావస్థకు సంకేతం. మారిన, మారుతున్న లోకం పోకడలను అర్థం చేసుకోకుండా ఒకనాటి తమ అధికార దర్పంతో ఎక్కువ స్ధానాలకు పట్టుబట్టడం, ఆ తర్వాత పరాజయం పాలై ప్రభావం కోల్పోవడం కాంగ్రెస్‌కు పరిపాటి అయిపోయింది.
నిన్నగాక మొన్నటి దాకా తాము దేశాన్ని ఏలిన నాయకులమనే అభిజాత్యాన్ని కాంగ్రెస్ నేతలు వీడలేకపోతున్నారు. నాటి నవాబులూ సరిగ్గా ఇలానే వ్యవహరించేవారు. లక్నో నవాబుల వారసురాలుగా చెప్పుకున్న ఒక మహిళకు 1985లో రాజీవ్‌గాంధీ న్యూ ఢిల్లీలో ఒక బంగ్లాను కేటాయించారు. నవాబు వాజీద్ అలీ షా వారసురాలుగా తాను ఆ బంగ్లాలో ఉండడం తన వంశ స్థాయికి తగదని ఆమె తిరస్కరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు వేచి ఉండే గదిలో తొమ్మిది సంవత్సరాలు గడిపిన అనంతరం, ఆమెకు ఢిల్లీ శివారులోని ఒక నిర్మానుష్య శిథిల భవంతి అయిన మల్చ మహల్‌ను కేటాయించారు. తలుపులు లేని ఆ హర్మ్యంలో విద్యుత్ కాదు కదా కనీసం మంచి నీటి వసతి కూడ లేదు. అలా తాను ఇంకా నవాబు వంశస్ధురాలుననే భ్రమల్లో ఆమె బతికింది. ఈ రకంగా అనేక మంది గడిచిపోయిన గతం నుంచి వర్తమానంలోకి రాకుండ భ్రమల్లో గడుపుతుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకగణం పరిస్ధితి కూడ సరిగ్గా ఇదే విధంగా ఉంది.
చెప్పవచ్చినదేమిటంటే యువతకు చేరువ కావడానికి ముమ్మరంగా ప్రయత్నించవలసిన కాంగ్రెస్ ఇంకా పురా వైభవ స్మృతులలోనే మునిగి తేలుతోంది. ప్రత్యర్థి బిజెపి తన వాట్సాప్ విశ్వవిద్యాలయం ద్వారా దేశంలోనే కాదు విదేశాలలోని భారతీయ యువతను సైతం ఆకర్షించడంలో సఫలమయింది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రగతిశీల భావజాల ప్రాతిపదికపై పార్టీని పునర్నిర్మించేందుకై 7–-18 సంవత్సరాల వయసులోని నవతరాన్ని ఆకర్షించే దిశగా ‘జవహర్ బాల మంచ్’ (జె.బి.యం)ను నెలకొల్పాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు జారీ చేసిన ఆదేశాలను అధికారంలో ఉన్న తెలంగాణలోనే పట్టించుకోవడం లేదంటే కాంగ్రెస్ పరిస్ధితి ఎలా ఉన్నదో ఉహించుకోవచ్చు. ఇక రాహుల్‌గాంధీ నిత్యం ఉద్ఘాటిస్తుండే సైద్ధాంతిక విధానాలు ఆయన్ను అనుసరిస్తున్న ఎంత మంది నాయకులకు అర్ధమవుతున్నాయనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. యువ కిశోరాలుగా దేశాన్ని ఆకర్షించిన కన్హయ కుమార్, హర్థిక్ పటేల్, జిగ్నేష్ మేవానీలను సరైన రీతిలో వినియోగించుకోలేదు. ఇదే కన్హయ కుమార్ బిజెపిలో చేరి ఉంటే ఆ పార్టీ అతన్ని ఏ విధంగా ఉపయోగించుకునేదో ఒక్కసారి అలోచించాలి. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో యువతలో బలమైన సంస్థాగతమైన పట్టు కలిగి ఉండి మజ్లిస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను దీటుగా ఎదుర్కొన్న హైద్రాబాద్ నగర కాంగ్రెస్ విభాగం నేడు నిర్వీర్యమైపోయింది. పార్టీ నిర్మాణాన్ని పక్కన పెడితే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రోహణ్‌రెడ్డి కనీసం కార్యవర్గాన్ని కూడ నియమించుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ కార్యకలాపాలు ఏ రీతిలో ఉన్నాయో ఉహించుకోవచ్చు. తెలంగాణలో వారసత్వంగానైనా కొంత మంది యువనేతలు శాసనసభకు ఎన్నికయినప్పటికి పార్టీ పట్ల వారి విధేయత ఎంత అనేది ఒక అంతుబట్టని ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు ఎవరైనా విదేశీ పర్యటనలకు వస్తే వారిని కలుసుకోవడానికి ప్రవాసులు ఇష్టపడడం లేదు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నాయకగణం కూడా తమ విదేశీ పర్యటనల్లో జనాలను కలుసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1999లో ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు 24, అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఒక మహా వృక్షం తన నీడలో ఉన్న ఒక చిన్న మందిరంపై కూలిపోవడాన్ని అపశకునంగా అనేక మంది భావించారు. సంవత్సరాల తరబడి వేళ్ళు దెబ్బతిన్న చెట్టు ఒక్క పది నిమిషాల వర్షానికి కూలిపోవడం అశ్చర్యం కాదని ఆ సందర్భంగా సోనియాగాంధీ వ్యాఖ్యానించారని చెబుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే మహా వృక్షం వేళ్ళన్నీ కూడ పూర్తిగా దెబ్బతిని కూలిపోతోంది. ఈ పతన క్రమంలో అక్కడక్కడ మిగిలి ఉన్న పచ్చని కాండాన్ని చూసి మురిసిపోతే ఎలా?
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..