Comrade Stalin Babu: మన మధ్య నడయాడిన స్టాలిన్
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:01 AM
సీపీఐ నాయకుడు స్టాలిన్ బాబు (అక్టోబర్ 24) మరణం బాధాకరం. వ్యక్తిగతంగా వారి జీవితంలో అపకీర్తులు లేవు. అన్నీ మంచి అలవాట్లే. ఆయన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన చురుకయిన పాత్ర ...
సీపీఐ నాయకుడు స్టాలిన్ బాబు (అక్టోబర్ 24) మరణం బాధాకరం. వ్యక్తిగతంగా వారి జీవితంలో అపకీర్తులు లేవు. అన్నీ మంచి అలవాట్లే. ఆయన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన చురుకయిన పాత్ర పోషించారు. ఉద్యమాన్ని పార్టీకి ప్రయోజనాత్మకంగా ఎలా మలుచుకోవాలి? ఆ ఉద్యమ స్వరూపమేమిటి, అందులో పాల్గొంటున్నవారెవరు? వారు ఏ కోవకు చెందినవారు, వారి కుటుంబ నేపథ్యమేమిటి? వ్యక్తిగత అలవాట్లేమిటి? ఏదైనా బలహీనతలున్నాయా? ఉంటే వాటిని సరిచేయడానికి అవకాశాలున్నాయా? ఇతరేతర కారణాలు కూడా పరిశీలించేవారు.
సుగుణాలున్న కార్యకర్త కోసం స్టాలిన్ బాబు ఎంతయినా శ్రమించేవారు. వ్యక్తిగత విషయాలూ తెలుసుకుని తగిన సలహాలు ఇచ్చి, విశ్వాసం కల్పించేవారు. ఆనాడు గుంటూరులో విద్యార్థి ఉద్యమానికి ఆటంకంగా రౌడీ మూకలు అడ్డుతగిలేవి. దాన్ని ఎదుర్కోడానికి మేమంతా సైనికుల్లాగ కదన రంగంలోకి దూకినా, స్టాలిన్ మంచివ్యూహం రూపొందించేవారు. కార్యకర్తల్ని తయారు చేయడంలోనూ, నాయకత్వ స్థాయి పెంపొందించడంలోనూ బాగా కృషిచేసేవారు. వాస్తవానికి నాకు రాజకీయాల వాసనే పడేది కాదు. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో నగరి వద్ద ఆయనంబాకం గ్రామానికి చెందినవాడిని. చిత్తూరు జిల్లా అందులో తమిళ భాషా ప్రభావం నుంచి వచ్చినవాడిని. నేను గుంటూరు ఆయుర్వేద కాలేజీలో చేరాను. దానికి కారణం నగరిలో పాపులర్ ఆయుర్వేదిక్ డాక్టర్ రామచంద్రరాజు. వారు మా కుటుంబానికి సన్నిహితులు. వారికి నగరి, పుత్తూరు, తిరుత్తణి (తమిళనాడు)లలో హాస్పిటల్స్ ఉండేవి. నా పీయూసీ అయిపోయాక రామచంద్రరావు గారితో మాట్లాడే సందర్భంగా అపుడే పేపర్లో ‘‘గుంటూరు ఆయుర్వేదిక్ కాలేజీలో BAMS డిగ్రీ కోర్స్ ప్రకటించారు. ఆ ప్రకటన చూసి వెంటనే డాక్టర్ గారు నన్ను గుంటూరుకు వెళ్లి ఆయుర్వేదిక్ కాలేజీలో చేరమన్నారు.
ఆయుర్వేదిక్ కాలేజీలో ఎన్నికలు జరిగితే మా గ్రూపే గెలిచింది ఓడిపోయిన గ్రూప్ ఏఐఎస్‌ఎఫ్ అనుకూలురని తెలిసింది. ఏఐఎస్‌ఎఫ్ అనుకూలురులో ర్యాలీప్రసాద్ గోదావరి జిల్లావాడు. అప్పటికే ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్త. విద్యార్థి సంఘం సమావేశం అయినాక ర్యాలీ ప్రసాదుతో ‘ఏంటయా అట్ల మాట్లాడుతావ్ మీ నాయకులిట్లే సలహాలిస్తారా? ఎవరు మీ నాయకులు’’ అని నిలవేశాను. అపుడు ప్రసాదు ‘‘మా నాయకులను కలుస్తావా’’ అన్నాడు. సరే అని బ్రాడీపేట 4వ లైన్ ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ ఒక పొడవాటి వ్యక్తి చూడచక్కగా ఉన్నారు వారే స్టాలిన్ బాబు, ఆ పక్కనే కళాకారుడు మల్లె కీపాస్ పంచెతో చూడచక్కగా ఉన్నారు నల్లూరి వెంకటేశ్వర్లు.
నేను చిత్తూరు భాషలో ‘‘ప్రసాద్‌కు నీవిట్లాగే ట్రయినింగ్ ఇచ్చావా’’ అని నిష్టూరంగా మాట్లాడాను. స్టాలిన్ నాతో కూర్చో బ్రదర్ అని మాటల్లో దింపారు, ర్యాలీప్రసాద్‌నే మందలించినట్టు మాట్లాడారు. అది ఎత్తుగడే కావచ్చు. అప్పటి నుంచి నా కోసం కాలేజీకి, కొరిటిపాడులో నేనున్న రూముకు తరచూ రావడం, అరండల్ పేట ఇస్కస్ కార్యాలయం వద్దనున్న మార్వాడీ స్వీట్ షాపులో వెన్నుండ్లు, తినిపించేవారు. నాకు మిత్రులంటే చాలా ఇష్టం. రాజకీయాలకన్నా స్నేహానికే ప్రాధాన్యత నిస్తూ ఏఐఎస్‌ఎఫ్ కార్యక్రమాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించే క్రమంలో ఆళ్ల నాగేశ్వరరావును పురమాయించేవారు. నన్ను లైన్‌లో పెట్టడానికి చాలా కష్టపడ్డారు. చివరికి వారి స్నేహంతో పాటు విస్తృతస్థాయి మిత్రబృందం ఏర్పడింది. దీనికి కొరిటిపాడులో ఉన్న రూము కూడా ఉపయోగపడింది. ఇదంతా చెప్పడానికి కారణం– మట్టిముద్దనైన నన్ను శిల్పంగా తయారుచేసి ఉద్యమానికి అప్పగించిన శిల్పి స్టాలిన్ బాబు.
నాలాంటి ఉద్యమకారులను పదుల సంఖ్యలో ఆయన తయారు చేశారు. రాష్ట్రంలోనే సమరశీల టీమ్ తయారయింది. ఇంతలో ఈ టీమ్ నుంచి నన్ను మా సొంత జిల్లా అయిన తిరుపతికే వెళ్లి పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణం చేయమని రాష్ట్ర పార్టీ ఆదేశించింది. అయితే ఇక్కడ ఒక చేదు నిజం చెప్పాల్సి వస్తున్నది. బూర్జువా పార్టీలలో రాకపోకలు సహజం, కమ్యూనిస్టు ఉద్యమాలలో ఒక స్టాయికి చేరిన కార్యకర్తలు గానీ నాయకులు గానీ ఉద్యమానికి ఏ కారణంగానైనా దూరమయితే సమాజానికి, నమ్మిన ఆశయాలకు, చివరికి వ్యక్తులకు తీరని ఆవేదన, నష్టం కలుగుతుంది. ఒక ఉద్యమానికి అంకితమయ్యాక ఆ ఉద్యమమే పరమావధిగా ఉండాలే తప్ప మార్గం మధ్యలో అడ్డొచ్చే తుంపర అడ్డు కాకూడదు. స్టాలిన్ బాబు జీవితం సమాజానికో చుక్కాని, కార్యదక్షత, పట్టుదల, అంకితభావానికి ప్రతిబింబం కూడా.
కె. నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి
(నవంబర్ 1న గుంటూరులో స్టాలిన్ బాబు సంతాపసభ)
ఇవి కూడా చదవండి
ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..
ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..