Share News

Cold War legacy: పరాకాష్ఠకు కమ్యూనిస్టుల పిడివాదం

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:16 AM

రష్యా, చైనాలను సోషలిస్ట్ సామ్రాజ్యవాద దేశాలని పేర్కొనడం తప్పే. ఎందుకంటే అవి పెట్టుబడిదారీ నియంతృత్వ సామ్రాజ్యవాద దేశాలు. అక్కడ ఉన్నది వ్యక్తి లేదా పార్టీ నియంతృత్వం. అక్కడ పీడిత ప్రజలు స్వేచ్ఛా వాయువులు...

Cold War legacy: పరాకాష్ఠకు కమ్యూనిస్టుల పిడివాదం

రష్యా, చైనాలను సోషలిస్ట్ సామ్రాజ్యవాద దేశాలని పేర్కొనడం తప్పే. ఎందుకంటే అవి పెట్టుబడిదారీ నియంతృత్వ సామ్రాజ్యవాద దేశాలు. అక్కడ ఉన్నది వ్యక్తి లేదా పార్టీ నియంతృత్వం. అక్కడ పీడిత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చడం లేదు. అక్కడ సంపద సమాజపరమూ కాలేదు. సోషలిజం వదిలి అవి ఏనాడో పెట్టుబడిదారీ దేశాలైనాయి. అయినా భారతీయ కమ్యూనిస్టులకు రష్యా, చైనాల పట్ల మక్కువ పోవడం లేదు. పెట్టుబడిదారీ ప్రజాస్వామిక సామ్రాజ్యవాద దేశాలకు రష్యా, చైనాలు ఎందులోనూ తీసిపోవు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సామ్రాజ్యవాద యుద్ధంగా పరిగణించకూడదు కానీ, పాలస్తీనా–ఇరాన్‌లపై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను మాత్రం సామ్రాజ్యవాద యుద్ధంగా పరిగణించాలి’’ అని పేర్కొనడం కమ్యూనిస్టుల హ్రస్వదృష్టికి నిదర్శనం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత సోవియట్ విప్లవం విజయవంతమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా, తూర్పు యూరోపుల్లో విప్లవాలు చెలరేగి సోషలిస్ట్ శిబిరాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే మూడవ వరస విప్లవాలు జయప్రదం అవుతాయి అనుకోవడం (జూలై 8న డా. శ్రీనివాస్‌ రచన ‘సామ్రాజ్యవాద అంతిమ బుసలు’) చారిత్రక అవగాహనారాహిత్యమైనా, పిడివాదం పరాకాష్ఠకు చేరడమైనా లేదా సైద్ధాంతిక హింసోన్మాదమైనా కావాలి. అనేక దేశాలు అత్యాధునిక అణ్వాయుధాలు సమకూర్చుకున్న ఈ కాలంలో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

అపుడు చావగా మిగిలిన మనుషులతో ఆదిమ కమ్యూనిజం స్థాపించడం కమ్యూనిస్టుల ఉద్దేశమా? ‘‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’’ అన్న శ్రీశ్రీ పలుకులు కమ్యూనిస్టు దేశాలకూ వర్తిస్తాయి. 1932, 1933లో ఉక్రెయిన్‌లో తలెత్తిన కరువు స్టాలిన్ నిర్దయ వల్లేనన్నది మానవ చరిత్రలోని చీకటి అధ్యాయాలు చెబుతున్నాయి. లెనిన్ హయాంలో రూపొంది, 1921–1928 మధ్య అమలైన కొత్త ఆర్థిక విధానం వల్ల ఉక్రెయిన్‌ ఆర్థికంగా పురోగమించింది. కానీ లెనిన్ తదనంతరం ఉక్రెయిన్‌ వాసుల స్వతంత్ర కాంక్షను తొక్కివేయడానికి, రష్యా పారిశ్రామికీకరణ కోసం స్టాలిన్ అవలంబించిన విధానాల వల్ల ఆకలితో అలమటిస్తూ సుమారు ఐదు మిలియన్ల ఉక్రెయిన్‌ ప్రజలు నాశనమయ్యారు.


ఆ కిరాతక కాలంలో కరువుతో అలమటిస్తూ అక్కడి మనుషులు నరమాంస భక్షణకు పూనుకున్నారనే విషయం మానవజాతి చరిత్రలో అత్యంత విషాదకరం. కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా మానవజాతికి చూపుతున్న ఉన్నతమైన సమాజం ఇటువంటిదేనా? చైనాలో సుమారు ఒక మిలియన్ టిబెటన్ పిల్లలను కుటుంబాలను నుంచి వేరు పరచి, ప్రభుత్వం నడిపే బోర్డింగ్ స్కూళ్లలో బలవంతంగా చేర్చి, వారిని టిబెటన్ సంస్కృతి వదలి హాన్ సంస్కృతిలో భాగమయ్యేలా చేయడానికి అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పరిశీలకులు ఆందోళన వెలిబుచ్చారు.

జాతీయవాద అస్తిత్వంతో కూడిన బలమైన సోషలిస్ట్ వ్యవస్థను రూపొందించడానికి చైనా చేస్తున్న అమానవీయ ప్రయత్నాలు ఫాసిజం పరిధిలోకి రావా? దీని గురించి మాట్లాడకుండా భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్టు ప్రభుత్వమంటూ రోజూ గగ్గోలు పెట్టే భారతీయ కమ్యూనిస్టుల విశ్వసనీయత సందేహాస్పదంగా ఉంది. సామ్రాజ్యవాదులకు సింహస్వప్నమైన ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ నాయకుడు కిమ్ ఇల్ సంగ్ నెలకొల్పింది స్వేచ్ఛాయుత సమసమాజమా లేక నిత్యం భయం గుప్పిట్లో ఉండే వంశ పారంపర్య నియంతృత్వ రాజ్యమా? కిమ్ ఇల్ సంగ్ మనవడు కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో ఉత్తర కొరియాలో విస్తృతంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని 2014 యుఎన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ (సీఓఐ) రిపోర్ట్ ప్రపంచానికి చాటిచెప్పింది. నియంత పట్ల విధేయంగా ఉండేందుకు ప్రజలను అన్యాయంగా కారాగారాలలో వేయడం, చంపడం, వారితో వెట్టి చాకిరీ చేయించడం వంటి విధానాలను ఉత్తర కొరియాలో అమలుచేస్తున్నారని, స్త్రీల పట్ల లైంగిక వేధింపులు సాధారణమైపోయాయని, కనీస మానవహక్కులను కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలియజేసింది. రష్యా, చైనా, ఉత్తర కొరియా కథలు వింటేనే అర్థమవుతుంది... కమ్యూనిజం మానవజాతికి ఇచ్చేది అభయం కాదు, భయమేనని. విమర్శలను కాపిటలిస్ట్ ప్రోపగాండా అంటూ కొట్టిపారేస్తూ సైద్ధాంతిక పరిభాషతో తాము చేసిన, చేస్తున్న, చేయబోయే హింసను సమర్థించుకునే కమ్యూనిస్టులతో ఉన్నతమైన సమాజం సాధ్యమవుతుందనుకోవడం అవివేకమే అవుతుంది. ఇది చరిత్ర చాటుతున్న సత్యం.

గౌరాబత్తిన కుమార్‌బాబు

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:17 AM