Share News

Urban Traffic Congestion: పాదచారులను మరచిన మార్గాలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 02:09 AM

మీరు ఇంటి నుంచి బయటికి వస్తారు. కనిపించేదేమిటి? రోడ్డుకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాహనాల వరుస! ఒకటి కాదు, రెండు వరుసల్లో మెల్లగా కదులుతూ కనిపిస్తుంటాయి, సందేహం లేదు. ఇది నగర ప్రధాన రహదారులకు...

Urban Traffic Congestion: పాదచారులను మరచిన మార్గాలు

మీరు ఇంటి నుంచి బయటికి వస్తారు. కనిపించేదేమిటి? రోడ్డుకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాహనాల వరుస! ఒకటి కాదు, రెండు వరుసల్లో మెల్లగా కదులుతూ కనిపిస్తుంటాయి, సందేహం లేదు. ఇది నగర ప్రధాన రహదారులకు పక్కగా ఉన్న మీ కాలనీలోని దృశ్యం. ఇక మెయిన్‌ రోడ్‌పై వాహనాల రద్దీ ఎలా ఉంటుందో చెప్పాలా? రద్దీ, రద్దీ, రద్దీ! జనసమ్మర్ధం మన జీవితాలలో ఒక సాధారణ అంశమైపోయింది. ఆఫీసుకు బయలుదేరామా, బస్సుకోసం పడిగాపులు కాస్తాం. బస్సు వస్తుంది, తోసుకుంటూ ఎక్కుతాం, నుంచుంటాం, కూర్చుంటాం (అరుదుగా), ఒత్తిడికి గొణుగుతాం, ఆవేశపడతాం, శాపనార్థాలు పెడతాం, ఆశాభంగం చెందుతాం... చివరకు గమ్యానికి చేరే సమయానికి అ..ల..సి.. పోతాం, ఆ రోజు ముగిసిపోయిందని భావిస్తాం. నిజానికి అప్పటికి మన దైనందిన వృత్తి కార్యకలాపాలు ప్రారంభమే కావు!

దేశ వ్యాప్తంగా 50 నగరాలు, పట్టణాలలో ట్రాఫిక్‌ రద్దీని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’లోని నా సహచరులు విశ్లేషించారు. చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు, మెట్రో నగరాలు, పర్వత ప్రాంత పట్టణాలు సర్వత్రా ప్రయాణ సేవలకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు రాకపోకలకు పడుతున్న సమయంలో వ్యత్యాసం రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మీ గమ్యాన్ని చేరేందుకు పట్టే సమయం మామూలు కంటే రెట్టింపుగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలలో పీక్‌ పీరియడ్‌ మరింతగా పెరిగిపోతుందని, కేవలం ఆఫీసు వేళల్లోనే కాకుండా ఇతర సమయాలలో కూడా రోడ్లపై వాహనాల కదలిక అసాధ్యమైపోతుందని వెల్లడయింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ట్రాఫిక్‌ రద్దీ ఎంత ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత అధికంగా ఉంటుంది. వాహనాలు ఎక్కువ సేపు రోడ్లపై కదలకుండా ఉండిపోవడం వల్లే వాయు కాలుష్యం పెరుగుదలకు దారితీస్తోంది. కనుక రద్దీ అనేది మీ దైనందిన జీవితాల నుంచి సమయాన్ని కొల్లగొట్టడమేకాదు. అనవసర ఒత్తిడిని పెంచుతుంది. ఆరోగ్యంపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. మన ఆయుష్షును కూడా తగ్గిస్తోంది. ఇది చాలా బాధాకరం. మనకు మేలుచేయదు. ఇది మన జీవితాల్లో సాధారణం కాకూడదు.


ట్రాఫిక్‌ రద్దీతో సంభవిస్తున్న మనోవ్యాకులతను నధిగమించేందుకు మనం రాజకీయ అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు అంతకంతకూ సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారు. తమ దైనందిన రాకపోకలకు వాటి మీదే ఆధారపడుతున్నారు. దీనివల్ల నగరాలు ఫ్లై ఓవర్లు మొదలైన రహదారి సదుపాయాలను అదనంగా సమకూర్చవలసివస్తోంది. రోడ్డు ప్రదేశాన్ని అత్యంత అధికంగా, అత్యంత అసమర్థంగా ఉపయోగించుకునే చిన్న కార్లతో రహదారులు అన్నీ నిండిపోతున్నాయి. ఢిల్లీలో ప్రతి రోజూ 500కు పైగా కొత్త కార్లు రిజిస్టర్‌ అవుతున్నాయి. మేము సర్వే చేసిన నగరాలలో దైనందిన రాకపోకలకు 7 నుంచి 11 శాతం మంది మాత్రమే కార్లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ బాగా ఉండే మరో నగరమైన బెంగళూరులో కార్లను వినియోగిస్తున్నవారు 7 శాతం మంది మాత్రమేనని నగరాలలో మరింత సమర్థ, స్థిరమైన రవాణా వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా ఉన్న సమగ్ర మొబిలిటీ ప్రణాళిక సమాచారం వెల్లడించింది. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే మిగతా 80 నుంచి 90 శాతం మంది కూడా కార్లను వినియోగించుకుంటే అవన్నీ ప్రయాణించేందుకు సరిపోయే ప్రదేశం మన నగరాలలో ఉన్నదా? అవెలా ప్రయాణిస్తాయి?

నగరాలలో ప్రజా రవాణా తీరుతెన్నులు సరిగా లేకపోవడం ఒక ప్రధాన లోపం. ప్రజా రవాణా సంస్థ బస్సులు చాలా తక్కువగా తిరుగుతుంటాయి. అవి ప్రజల అవసరాలను తీర్చదగిన సంఖ్యలో ఉండవు. ప్రజలు వాటిపై ఆధారపడలేకపోతున్నారు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగానే బస్సులు సమయానికి రావడం జరగకపోవడంతో వినయోగదారులు విసుగుచెందుతున్నారు. బస్సులు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుపోతుండడంతో వాటి రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కారణంగానే ఆ బస్సుల్లో ప్రయాణాలకు ప్రజలు విముఖత చూపుతున్నారు. మెట్రో రైల్‌ సదుపాయమున్న నగరాలలో వినియోగదారులకు కొంత ఉపశమనం చేకూరుతోంది. అయితే ఇక్కడ అనుకూలత, ప్రయాణ వ్యయాల ప్రశ్న తలెత్తుతోంది. మెట్రో టిక్కెట్‌ ధరనే కాకుండా తమ గమ్యాన్ని చేరుకునేందుకు రిక్షా, టాక్సీ మొదలైనవాటి వ్యయాన్ని కూడా భరించవలసివస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే పట్టణ, నగర ప్రాంతాలలో రోడ్లను పాదచారులనూ దృష్టిలో ఉంచుకుని రూపొందించడం లేదు. దీనివల్ల నడిచి వెళ్లేవారికి ప్రమాదకరమైన, అసౌకర్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాలిబాటలు ఉండడం లేదు. ఉన్నా వాటిని సరిగా నిర్వహించడం లేదు. ట్రాఫిక్‌ ప్రణాళికలో పాదచారుల భద్రత పట్ల నిర్లక్ష్యం సంపూర్ణంగా కనిపిస్తోంది.


ఈ పరిస్థితిలో ఆటో రిక్షాలు, బ్యాటరీ రిక్షాలు, మినీ బస్సుల లాంటి అనుబంధ రవాణా సాధనాలపై అధికంగా ఆధారపడడం అనివార్యమవుతోంది. అయితే రోడ్లపై మరింత అస్తవ్యస్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అయినా ఇవి కీలకమైనవి. గమ్యాన్ని చేరుకునేందుకు లక్షలాది ప్రజలకు అనువైన, భరించగల ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. గుర్తించవలసిన వాస్తవమేమిటంటే ఈ రవాణా వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా, నియంత్రితంగా లేదు. వాటిపై నియంత్రణ లేదు. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించని పక్షంలో నగరాలలో రవాణా పద్ధతులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దలేము. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మార్గాంతరమేమిటి? ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తృతమూ, పటిష్ఠం చేయాలి. బస్సుల సంఖ్యను మెట్రో రైళ్లను పెంచాలి. గమ్యాలకు వడిగా చేరేందుకు కాలి బాటలను నిర్మించాలి. వాహనాల కదలికలను నియంత్రించాలి. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించాలి. చట్టవిరుద్ధ పార్కింగ్‌ను అరికట్టాలి. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈ విషయమై మనం కలిసికట్టుగా కృషి చేయడం లేదు. అందుకు బదులుగా రోడ్డు వెడల్పు జరిగితే మనకు బాధలు తప్పిపోతాయని ఆశిస్తాం. ఇప్పటికైనా మనం మేల్కొనాలి. ట్రాఫిక్‌ పరిస్థితులను సమగ్రంగా ఆకళింపు చేసుకోవాలి.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 02:09 AM