Share News

Little Moments of Joy: చిన్న చిన్న ఆనందాలు

ABN , Publish Date - Oct 06 , 2025 | 05:59 AM

ఎప్పుడో ఎక్కాల పుస్తకంలో శ్రావణభాద్రపదాలు వర్షరుతువని బట్టీ పెట్టిన ధర్మాలు మారి ఏ కాలంలోనైనా ఉక్కబోతల చెమట ఋతువే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మంచి మనసు లాంటి...

Little Moments of Joy: చిన్న చిన్న ఆనందాలు

ఎప్పుడో ఎక్కాల పుస్తకంలో

శ్రావణభాద్రపదాలు వర్షరుతువని

బట్టీ పెట్టిన ధర్మాలు మారి

ఏ కాలంలోనైనా ఉక్కబోతల చెమట ఋతువే

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే

మంచి మనసు లాంటి

మంచిగంధపు తెర వీచినంత ఆనందం

అప్పటివరకు

అలమరలో బీరువాలో వెదకి వెదకీ

ఇక కనబడదనుకొన్న ఇష్టమైన పుస్తకం

చాలాకాలం తర్వాత

అనుకోకుండా

పాతపుస్తకాల దొంతరలో

ఒక్కసారి కనబడగానే

ఎగిరి గంతేసినంత ఆనందం

ఆకులన్నీ రాలిపోయి

రెమ్మలన్నీ ఎండిపోయి

తలవాల్చేసిందనుకొన్న మొక్క

ఒకరోజు పొద్దున్నే

ఎండిన కొమ్మల మధ్యనుంచి

ఎర్రని చిగురునవ్వులతో పలకరించినపుడు

ఆకాశమే వంగినంత ఆనందం

చిన్నపుడు బళ్ళో

ఒకే బెంచీపై పక్కపక్కనే

కబుర్లు అల్లర్లు మేట్నీ సినిమాల

బాల్యస్నేహితురాలు

బతుకు తాపత్రయాల ప్రయాణంలో

చీలిన దారుల్లో

ఎవరికి వారు వేరయ్యాక

చిరకాలానంతరం కలిసినప్పుడు

ఉత్సాహం ఊయల్లో

ఊగిన ఆనందం

కృత్రిమ మేధా ప్రపంచంలో

చుట్టూ నిలువెత్తు

నిశ్శబ్దం గోడలు మొలిచినపుడు

ఉరి తీయబడుతున్న మాటల నేపథ్యంలో

ఒంటరితనం గొంగళి పురుగు

తన కన్నీటి పత్రాలను తానే తింటున్న వేళ

ఎక్కణ్ణుంచో

చెవుల్లో గుసగుసగా

పాట వినబడుతుంటే

మైమరచిన ఆనందం

చిన్న చిన్న ఆనందాలే

చెప్పలేని మాధుర్యాలు

ప్రమిదల్లో వత్తులు నిలిచి కాలుతున్నట్లు

జీవితాన్ని వెలిగించే అపురూప క్షణాలు

మందరపు హైమవతి

94410 62732

ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 05:59 AM