Chaudhary Charan Singh: భారత రైతు బాంధవుడు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:36 AM
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 23ని ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు...
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 23ని ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు అన్నదాత కష్టాలు తెలుసు. దేశ స్వాతంత్య్ర పోరాటమైనా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమైనా రెండింటిలోనూ ముఖ్యపాత్ర పోషించారు చరణ్‌సింగ్. 1902 డిసెంబరు 23న హాపూర్‌లో జన్మించిన చౌదరి చరణ్‌సింగ్, ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి, 1928లో ఘజియాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
చౌదరి చరణ్‌సింగ్‌ను ‘రైతుల ఆత్మబంధువు’ అని పిలుస్తారు. ఆయన 1937లో యూపీలోని ఛప్రౌలీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 1946, 1952, 1962, 1967లలో కూడా ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. గోవింద్‌వల్లభ్ పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ, న్యాయ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. డాక్టర్ సంపూర్ణానంద్, చంద్రభాను గుప్తాల ప్రభుత్వాల్లోనూ ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 1952– ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ మంత్రిగా చరణ్‌సింగ్ రైతులకు నిజమైన నేస్తంగా అవతరించిన సంవత్సరం. మంత్రి పదవితో పాటు ఆ ఏడాది అసెంబ్లీలో జమీందారీ నిర్మూలన చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం వచ్చిన తర్వాత భూస్వాముల నుంచి ఎక్కువ భూమిని తీసుకుని వాటిలో పనిచేస్తున్న నిజమైన రైతులకు ఇచ్చారు. అప్పటి వరకు భూస్వాముల వద్ద కూలి పనులు చేసిన రైతులే అనంతరం ఆ భూమికి యజమానులయ్యారు. ఆయన చేపట్టిన భూసంస్కరణలతో చిన్న రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. రైతుల సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. 1966, 1967లో ఉత్తరప్రదేశ్‌లో కరువు తాండవించినప్పుడు రైతుల నుంచి అధిక ధరలకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, వారికి లబ్ధి చేకూర్చారు. చరణ్‌సింగ్ ప్రారంభించిన చర్యల వల్లనే పంటలకు కనీస మద్దతు ధర విధానం ప్రారంభమైంది.
జవహర్‌లాల్ నెహ్రూతో విభేదాల కారణంగా చౌదరి చరణ్‌సింగ్ కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత భారతీయ క్రాంతిదళ్‌ని స్థాపించి రాజ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా సహాయంతో ఏప్రిల్ 3, 1967న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరుసటి సంవత్సరం ఏప్రిల్ 17న రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలలో 1970 ఫిబ్రవరి 17న మళ్లీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో చౌదరి చరణ్‌సింగ్ ఉపప్రధాని, హోంమంత్రిగా పనిచేశారు. జనతా పార్టీలో విభేదాల కారణంగా మొరార్జీ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత చౌదరి చరణ్‌సింగ్ కాంగ్రెస్ (యు) మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు. కేవలం 23 రోజులు మాత్రమే కొనసాగిన ఆయన 1979 ఆగస్టు 21న రాజీనామా చేశారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలకు గుర్తింపుగా చరణ్‌సింగ్ పుట్టిన రోజును 2001 నుంచి జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించారు.
జటావత్ హనుము
(నేడు జాతీయ రైతు దినోత్సవం)
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News